బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద జరగనున్న వైఎస్సార్‌సీపీ సిద్ధం మహాసభ ప్రాంగణంలో వైనాట్ 175 అంటూ ఏర్పాటు చేసిన ర్యాంప్
నేడు బాపట్ల జిల్లా మేదరమెట్ల వేదికగా వైఎస్సార్‌సీపీ ఎన్నికల సన్నాహక సభ
ఆఖరి సిద్ధం సభకు ముస్తాబైన పి.గుడిపాడు
వందలాది ఎకరాల సువిశాల మైదానంలో భారీ ఏర్పాట్లు
గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 44 నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో తరలిరానున్న పార్టీ శ్రేణులు
ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడు సభలు ఒకదానికి మించి మరొకటి సూపర్ హిట్
తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతిపెద్ద ప్రజాసభగా నిలిచిన రాప్తాడు సభ
ఈ 3 సభలు గ్రాండ్ సక్సెస్ కావడంతో ఉరిమే ఉత్సాహంతో మేదరమెట్ల దిశగా కదం తొక్కుతున్న శ్రేణులు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని పి.గుడిపాడు వద్ద ఆదివారం జరగనున్న ‘సిద్ధం’ ఆఖరి సభకు సర్వం సిద్ధమైంది. చరిత్రలో నిలిచిపోయేలా పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగసభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల వద్ద కోల్‌కత–చెన్నై జాతీయ రహదారి పక్కనే వందలాది ఎకరాల సువిశాల మైదానంలో ఈ సభను నిర్వహించడానికి భారీ ఏర్పాట్లుచేశారు.
దక్షిణ కోస్తాలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని 44 నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో కదలిరానున్నారు. వీరిని ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సీఎం జగన్ ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడులలో నిర్వహించిన సిద్ధం సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే.
రాప్తాడు సభ ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అతిపెద్ద ప్రజాసభగా నిలిచిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. మూడు సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ కావడం.. టైమ్స్‌నౌ–ఈటీజీ, జీన్యూస్ మ్యారిటైజ్ వంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సునామీ సృష్టించడం ఖాయమని తేలడంతో చివరి ‘సిద్ధం’ సభకు కూడా ఉరిమే ఉత్సాహంతో కార్యకర్తలు, నేతలు, అభిమానులు భారీ ఎత్తున తరలివెళ్లడానికి సంసిద్ధమయ్యారు.
ప్రజాక్షేత్రంలో వైఎస్సార్‌సీపీ దూకుడు
ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి జనవరి 27న భీమిలి వేదికగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, సీఎం జగన్ సమరశంఖం పూరించారు. ఓ వైపు జనబలమే గీటురాయిగా, సామాజిక న్యాయమే పరమావధిగా శాసనసభ, లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేస్తూనే.. మరోవైపు ‘సిద్ధం’ సభలు నిర్వహిస్తూ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈ సభలు పూర్తవడం.. అవి గ్రాండ్ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణులు ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నాయి. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా సీఎం జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రతి ఇంటా గుర్తుచేస్తూ.. ప్రభుత్వంవల్ల మంచి జరిగి ఉంటే.. మరింతగా మంచి చేయడానికి వైఎస్సార్‌సీపీని ఆశీర్వదించి, ఓటు వేయాలని శ్రేణులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. వీరికి ప్రజలు నీరాజనాలు పలుకుతుండటంతో మరింత నూతనోత్సాహంతో వారు ప్రచారంలో పాల్గొంటున్నారు.
పొత్తుల లెక్కతేలినా నైరాశ్యం..
ఇక టీడీపీ–జనసేన పొత్తుల లెక్క తేలాక రెండు పార్టీలు మొదటిసారిగా ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘జెండా’ సభకు జనం మొహం చాటేశారు. ‘రా కదలిరా’ పేరుతో చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు ప్రజలు తరలిరావడంలేదు. టీడీపీ–జనసేన పొత్తును ఆదిలోనే జనం ఛీకొట్టడం.. వైఎస్సార్‌సీపీ సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ కావడంతో ఆ రెండు పార్టీల శ్రేణులు నైతిక స్థైర్యాన్ని కోల్పోయాయి. అలాగే, టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక టైమ్స్‌నౌ–ఈటీజీ సంస్థ నిర్వహించిన సర్వేలోనూ 49 శాతం ఓట్లతో వైఎస్సార్‌సీపీ 21–22 లోక్‌సభ స్థానాల్లో ఘనవిజయం సాధిస్తుందని.. టీడీపీ–జనసేన కూటమి 45 శాతం ఓట్లతో 3–4 లోక్‌సభ స్థానాలకే పరిమితమవుతుందని తేల్చిచెప్పింది. ఇది ఆ రెండు పార్టీ శ్రేణులను తీవ్ర షాక్‌కు గురిచేసింది. దీంతో ఎన్నికలకు ముందే శ్రేణులు కకావికలమవుతుండటంతో ఉనికి చాటుకునేందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బీజేపీ పెద్దల కాళ్లావేళ్లాపడి.. ఆ పార్టీతోనూ పొత్తు ఖరారు చేయించుకున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం ఎస్పీ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సిద్ధం సభకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా మొత్తం సుమారు 4,200 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశామన్నారు. నలుగురు ఎస్పీలు, 14 మంది అడిషనల్ ఎస్పీలు, 21 మంది డీఎస్పీలు, 92 మంది సీఐలు, 292 మంది ఎస్‌ఐలతోపాటు ఏఆర్ నుంచి 400 మంది, స్పెషల్ ఫోర్స్ సుమారు 160 మంది బందోబస్తులో ఉన్నారన్నారు. పదివేలకు పైగా బస్సులు, ఇతర వాహనాలు వచ్చే అవకాశమున్నందున దానికి అనుగుణంగా 338 ఎకరాల్లో 28 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటుచేశామని ఎస్పీ చెప్పారు.
పటిష్ట ఏర్పాట్లు
వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లుచేస్తోంది. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి అక్కడే మకాంవేసి ఎప్పటికప్పుడు ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు. ఆదివారం సా.3 గంటల నుంచి 5 గంటల వరకూ ఈ సభ జరుగుతుంది. రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి విడదల రజిని, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, అద్దంకి సమన్వయకర్త పాణెం చిన హనిమిరెడ్డి తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
► ఆదివారం ఉ.10 గంటల నుంచి వాహనాల దారి మళ్లింపు చేపడుతున్నట్లు ఎస్పీ జిందాల్ చెప్పారు. నెల్లూరు వైపు నుంచి ఒంగోలు మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలను ఒంగోలు సౌత్ బైపాస్ నుంచి సంఘమిత్ర హాస్పిటల్, కర్నూల్ రోడ్డు, చీమకుర్తి, పొదిలి దొనకొండ అడ్డ రోడ్డు మీదుగా హైదరాబాద్‌కు దారి మళ్లిస్తామన్నారు.
► హైదరాబాద్ వైపు నుంచి ఒంగోలు వైపునకు వచ్చే భారీ వాహనాలను సంతమాగులూరు అడ్డరోడ్డు, వినుకొండ, మార్కాపురం, పొదిలి, చీమకుర్తి మీదుగా..
► నెల్లూరు వైపు నుంచి ఒంగోలు మీదుగా హైదరాబాదు వైపు వెళ్లే సాధారణ వాహనాలను మేదరమెట్ల వద్ద నుంచి నామ్ హైవేపై అద్దంకి, సంతమాగులూరు మీదుగా మళ్లిస్తున్నారు.
► ఒంగోలు వైపు నుంచి విశాఖ వైపు ఎన్‌హెచ్ 16పై వెళ్లే వాహనాలను త్రోవగుంట నుంచి ఎన్‌హెచ్ 216 పైకి మళ్లించి చీరాల, బాపట్ల, మచిలీపట్నం మీదుగా పంపుతున్నారు.
► ఒంగోలు వైపు నుంచి విజయవాడ, గుంటూరు వైపు వెళ్లే వాహనాలను త్రోవగుంట, చీరాల, బాపట్ల, పొన్నూరు మీదుగా వాహనాలను మళ్లిస్తారు.
► ఒంగోలు వైపు నుంచి చిలకలూరిపేట వైపు వెళ్లే వాహనాలను త్రోవగుంట, చీరాల, పర్చూరు మీదుగా.. విశాఖపట్నం నుంచి ఒంగోలు, చెన్నై వైపు వెళ్లే వాటిని నర్సాపురం, మచిలీపట్నం, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా.. గుంటూరు నుంచి ఒంగోలు, చెన్నై వైపు వెళ్లే వాహనాలను బుడంపాడు అడ్డరోడ్డు నుంచి పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా మళ్లిస్తున్నారు.
► 16వ నంబర్ ఎన్‌హెచ్‌పై మేదరమెట్ల గ్రోత్ సెంటర్ నుంచి బొల్లాపల్లి టోల్‌ప్లాజా వరకు ఎలాంటి వాహనాలను అనుమతించడంలేదని.. సిద్ధం సభ ప్రాంగణానికి వచ్చే వాహనాలనే అనుమతిస్తామని చెప్పారు. ఈ ఆంక్షలు ఆదివారం రాత్రి 8 వరకూ అమల్లో ఉంటాయన్నారు.
ఓటమి భయంతోనే పొత్తులు
► రంగులు మార్చడం చంద్రబాబు నైజం : మంత్రి విడదల రజిని
► ప్రజలంతా జగనన్న పాలనలోనే ఉండాలనుకుంటున్నారు : మోపిదేవి
అద్దంకి: ఓటమి భయంతోనే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలతో పొత్తులు పెట్టుకుంటోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఎద్దేవా చేశారు. బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో ఏర్పాటుచేసిన సిద్ధం సభ ప్రాంగణాన్ని ఆమెతోపాటు రాజ్యసభ సభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు శనివారం పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. గతంలో అమిత్ షా ఏపీకి వచ్చినప్పుడు ఆయనపై చంద్రబాబు రాళ్లు వేయించిన విషయం ప్రజలు మరిచిపోతారా అని ఆమె ప్రశ్నించారు.
అధికారంలో ఉన్న సమయంలో ఒక రకంగా అధికారంలో లేని సమయంలో మరో రకంగా రంగులు మార్చడమే చంద్రబాబు నైజమని విమర్శించారు. ఎన్ని పార్టీలు ఏకమై వచ్చినా వైఎస్సార్‌సీపీని ఏమీచేయలేరన్నారు. ప్రజలంతా సంక్షేమ పాలన అందించిన జగనన్ననే మళ్లీ సీఎంగా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె ధీమా వ్యక్తంచేశారు. నాలుగున్నరేళ్ల పాలనలో సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకెళ్లిన ఘనత జగనన్నదే అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అందుకున్న 80–85శాతం మంది తిరిగి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్నే తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నారన్నారు.
అపవిత్ర పొత్తుతో ప్రతిపక్షాలు..
ఇక సీఎం వైఎస్ జగన్‌ను ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపాలని ప్రతిపక్షాలన్నీ అపవిత్రమైన పొత్తు పెట్టుకుని అడ్డదారులు తొక్కుతూ, అమలుకు సాధ్యంకాని హామీలతో ప్రజల ముందుకొస్తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు విమర్శించారు. పేదలంతా వైఎస్సార్‌సీపీ పాలనతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. 2024లో జగనే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలు మళ్లీ పెత్తందారి వ్యవస్థను తేవాలని చూస్తున్నాయన్నారు. గతంలో రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం అని చెప్పిన బాబు వాటిని నెరవేర్చలేదన్న విషయం ప్రజలందరికీ ఇంకా గుర్తుందన్నారు.
సిద్ధం సభలు ఏపీ చరిత్రలో నిలిచిపోతాయని.. వాటి ద్వారా ప్రజాభిమానం వెల్లువెత్తుతోందన్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. పొత్తుల ముసుగులో వైఎస్సార్‌సీపీని ఓడించాలని చంద్రబాబు చూస్తున్నాడన్న సంగతి ప్రజలకు అర్థమవుతోందన్నారు. 175కు 175 సీట్ల గెలుపు ఈ సభ నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు.ఈ సమావేశంలో సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, ఏపీఐఏసీ చైర్మన్ జంకె వెంకటరెడ్డి, రాష్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ ఆడపా శేషు, నియోజకవర్గ పరిశీలకుడు మారం వెంకారెడ్డి, స్థానిక నాయకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment