సాక్షి, అమరావతి: కులాల ప్రాతిపదికగా జనగణన జరపాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో తీర్మానం చేయడంపై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జనగణన–2021లో కులం కాలమ్‌ను తొలగిస్తామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని బీసీ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.
90 ఏళ్ల క్రితం 1931లో జరిగిన జనగణన ఆధారంగానే బీసీల శాతాన్ని ఇప్పటికీ లెక్కగట్టడంతో తీవ్ర నష్టం జరుగుతోందని, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా తగినంత తోడ్పాటు లేదని బీసీ వర్గాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. ఈసారి జనగణనను కులాల ప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్‌లో న్యాయం ఉందని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో వెనుకబడిన తరగతులను వెన్నెముక వర్గాలుగా తీర్చిదిద్దుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వం తాజాగా కుల జనగణన నిర్వహించాలంటూ కేంద్రాన్ని కోరడంతో బీసీ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి
బీసీలకు మేలు చేసే కుల జనగణనకు మద్దతు పలుకుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం గొప్ప విషయం. అందుకు బీసీల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే స్ఫూర్తిని కొనసాగించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని గానీ, రాష్ట్ర ప్రభుత్వపరంగా ప్రతినిధి బృందాన్ని పంపడం గానీ చేయాలి. అవసరమైతే జాతీయస్థాయిలో కలిసి వచ్చే సీఎంలు, సంఘాలతో ఐక్య కార్యాచరణ చేపట్టి కేంద్రాన్ని ఒప్పించాలి. – కేశన శంకరరావు, ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు
ఇది చారిత్రాత్మకం
కుల జనగణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం చారిత్రాత్మకం. ఇది కేంద్రంపై ఒత్తిడి పెంచుతుంది. సీఎం వైఎస్ జగన్ బీసీల గుండెల్లో నిలిచేలా నిర్ణయం తీసుకున్నారు. ఆయన బీసీల పక్షపాతి అని మరోసారి రుజువైంది. బీసీల్లో ప్రతి కులానికి కార్పొరేషన్ పెట్టి వారి అభివృద్ధికి జగన్ ప్రత్యేక కృషి చేస్తున్నారు. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టు వర్కుల్లో బీసీలకు 50 శాతం ఇచ్చేలా జగన్ చట్టబద్ధత కల్పించిన తీరు దేశానికే మార్గదర్శకం. వెనుకబడిన తరగతులకు చెందిన సీఎంలు ఉన్న రాష్ట్రాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. సీఎం వైఎస్ జగన్‌కు బీసీ వర్గాల అందరి తరపున కృతజ్ఞతలు తెలిజేస్తున్నాం. – ఆర్.కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు
రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి
జనగణనలో కులం కాలమ్ కూడా ఉండాలని ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం అభినందనీయం. కేంద్రం చేపట్టే జన గణనలో కులం కాలమ్ తీసేయడం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడమే. బీసీలకు సామాజికంగా, రాజకీయంగా జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయం జరగాలంటే బీసీ కుల జనగణన తప్పనిసరి. – వైకే (వై.కోటేశ్వరరావు), సామాజిక న్యాయ సేవా కేంద్రం రాష్ట్ర కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment