
సాక్షి, అమరావతి: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల్లో ఇంధన పొదుపు సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ఏపీలో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. జాతీయ స్థాయిలో చేపట్టే.. అంతర్జాతీయ ఇంధన పొదుపు సాంకేతికతకు ఈ అధ్యయనం కీలకం కానుంది. రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ. చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
► విద్యుత్ వినియోగం అధికంగా ఉండే గ్లాస్, రిఫ్రాక్టరీ పరిశ్రమలను అధ్యయనం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్‌ను బీఈఈ ఎంపిక చేసింది. ఈ అధ్యయన బాధ్యతను ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్–టెరీ’కు అప్పగించింది.
► అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలను ఎంపిక చేసింది. ఈ జాబితా ప్రకారం మన రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని రిఫ్రాక్టరీ పరిశ్రమల్లో ఏడాది పాటు టెరీ అధ్యయనం చేస్తుంది. ఇందులో వెల్లడైన అంశాల ఆధారంగా జాతీయ స్థాయిలో ఎంఎస్‌ఎంఈల కోసం బీఈఈ ఒక రోడ్ మ్యాప్ రూపొందిస్తుంది.
► రాష్ట్రంలో విద్యుత్ పొదుపుకు అపార అవకాశాలున్నాయని టెరీ గతంలో నిర్వహించిన ఓ సర్వేలో గుర్తించింది. దీంతో అన్ని స్థాయిల్లోనూ అత్యాధునిక సాంకేతికత, పొదుపు చేయగల విద్యుత్ ఉపకరణాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఇంధన పొదుపు సంస్థ
కృషి చేస్తోంది.
► ఎంఎస్‌ఎంఈ రంగంలో నూతన ఎనర్జీ ఎఫిషియన్సీ సాంకేతికత అమలు చేస్తున్న ఇంధన శాఖకు రాష్ట్ర పరిశ్రమల శాఖ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నదని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్రంలో చేపట్టే అధ్యయనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆయన ఆదేశించారు.