మహిళకు చీరల యూనిట్‌ను అందజేస్తున్న భారతి, అవేర్ సంస్థల ప్రతినిధులు (ఫైల్)
కడప సెవెన్‌రోడ్స్(వైఎస్సార్ జిల్లా:) కోవిడ్–19 ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయి అనాథలుగా వీధిన పడిన పిల్లలు ఎందరో. కుటుంబ పెద్ద దిక్కయిన భర్తను కోల్పోయి ఆ భారాన్ని మోస్తున్న మహిళలు మరెందరో. ఒక్కొక్కరిది ఒక్కో విషాదగాథ. చీకట్లు అలుముకున్న జీవితాల్లో వెలుగు రేఖలు పూయించడం తమ సామాజిక బాధ్యతగా స్వీకరించింది భారతి సిమెంట్ యాజమాన్యం. క్షేత్ర స్థాయిలో ఈ ప్రణాళిక అమలును భుజానికెత్తుకుంది అవేర్ సంస్థ. జిల్లాలో 100 కోవిడ్ బాధిత కుటుంబాల పునరావాసానికి భారతి సిమెంట్ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ (సీఎస్‌ఆర్) కింద నిధులు అందించింది. దీంతో కడప నగరంలోని పలువురు మహిళలకు బతుకుపై భరోసా ఏర్పడింది.
చదవండి👉: మనం ప్రజా సేవకులం
జీవనోపాధి ఏర్పాటు చేసుకుని స్వతంత్రంగా, ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. కలెక్టర్ చొరవ తీసుకుని తమ పిల్లలకు కార్పొరేట్ స్కూళ్లలో ఉచిత విద్య అందించగలిగితే తాము నిశ్చింతగా ఉండగలమంటున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వెలువరించిన వివరాల మేరకు జిల్లాలో 1,35,061 కోవిడ్ కేసులు నమోదు కాగా, 729 మంది మృతి చెందారు. జిల్లాలో 404 మంది పిల్లలు అనాథలుగా మారినట్లు ఐసీడీఎస్ సర్వే ద్వారా వెల్లడైంది. అనాథ పిల్లలను ఆదుకోవాలంటూ కలెక్టర్ విజయరామరాజు కార్పొరేట్ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు భారతి సిమెంటు ముందుకొచ్చింది. సామాజిక సేవలో అపార అనుభవం ఉన్న అవేర్ స్వచ్ఛంద సంస్థను ఆహ్వానించి వారి ద్వారా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించింది.
ఆర్థికాభివృద్ధి యూనిట్ల పంపిణీ
నగదు పంపిణీ చేయడం వంటి చర్యలు ఫలితం ఇవ్వబోవని, ఆర్థికాభివృద్ధి యూనిట్లు పంపిణీ చేస్తే బాధిత కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని అవేర్ సంస్థ సూచించింది. ఈ కొత్త ప్రయోగానికి భారతి సిమెంటు యాజమాన్యం అంగీకరించింది. పాడి ఎనుములు, కిరాణాస్టోర్లు, చిన్నపాటి వస్త్ర దుకాణాలు, కూరగాయల దుకాణాలు, టిఫెన్ సెంటర్లు, కంప్యూటర్ సెంటర్లు, సోఫా తయారీ వంటి స్వయం ఉపాధి కల్పించారు. భారతి సిమెంట్ ప్రధాన అధికారి సాయి రమేష్, పీఆర్‌ఓ మేనేజర్ భార్గవరెడ్డి కలెక్టర్ విజయరామరాజు ద్వారా యూనిట్లను బాధిత కుటుంబాలకు అందించారు.
ఇలా వంద కుటుంబాల్లోని 212 మంది పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించారు. తమకు ఒక దారి చూపి ఆదుకున్న భారతి సిమెంట్, అవేర్ సంస్థలకు రుణపడి ఉంటామని బాధితులు తెలిపారు. అవేర్ వ్యవస్థాపకులు మాధవన్ ఆదేశాలతో తాము జిల్లాలోని 11 మండలాలకు చెందిన వంద కుటుంబాలకు ఉపాధి యూనిట్లు అందజేశామని అవేర్ సంస్థ జిల్లా ప్రాజెక్టు అధికారి రవీంద్రారెడ్డి తెలిపారు. ఇందులో బేకరీ, జిరాక్స్, ఆటో, గొర్రెల పెంపకం తదితర యూనిట్లు ఉన్నాయని వివరించారు. యూనిట్లను బాధిత కుటుంబాలు సద్వినియోగం చేసుకుంటున్నాయని పేర్కొన్నారు.
కుటుంబానికి ఆసరా దొరికింది
నా భర్త అమానుల్లాబాషా, బావ అమీర్‌బాషా, అత్త షేక్ మురాద్‌బీ గత సంవత్సరం రంజాన్ నెలలో కోవిడ్‌తో మృతి చెందారు. సొంత ఇల్లు లేదు. చెర్లోపల్లెలో ప్రభుత్వం స్థలం ఇచ్చినా ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితి. భారతి సిమెంట్స్, అవేర్ సంస్థ నాకు కిరాణా షాపు ఏర్పాటు చేయించడంతో కుటుంబం గడుస్తోంది. ఒక్కగానొక్క కొడుకు ప్రైవేటు స్కూలులో చదువుతున్నాడు. ఫీజులు చెల్లించలేక పోతున్నాను. దాతలు ఆదుకుని చదువుకు సాయం చేయాలి.
– పర్వీన్‌బాను, రాజారెడ్డివీధి, కడప
ఆపదలో ఆదుకున్నారు
లాడ్జిలో గుమాస్తాగా పనిచేసే నా భర్త ఎం.చంద్రశేఖర్ గత ఏడాది జూన్ 19వ తేదీ బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందాడు. సొంత ఇల్లు తప్ప మాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. కోవిడ్ సోకడంతో వలంటీర్ నా భర్త వేలిముద్రను తీసుకోవడానికి నిరాకరించింది. దీంతో వైఎస్సార్ బీమా రాలేదు. అప్పుల వారు వేధిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భారతి సిమెంట్, అవేర్ సంస్థలు చీరల వ్యాపారం యూనిట్ మంజూరు చేసి ఆదుకున్నాయి. దీంతో ఇల్లు గడుస్తోంది. పిల్లలకు మంచి కార్పొరేట్ విద్య అందించగలిగితే రుణపడి ఉంటాము.
– ఎం.వెంకట సుజిత, పెద్దబెస్తవీధి, కడప
Comments
Please login to add a commentAdd a comment