క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ పో 2022 బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, క్రెడాయ్ ప్రతినిధులు, బ్యాంకుల అధికారులు
తిరుపతి మంగళం: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్)కి తన వంతు సంపూర్ణ సహాయ, సహకారాలను అందిస్తానని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి హామీ ఇచ్చారు. తిరుపతిలోని ఓ ప్రయివేటు హోటల్లో ఆదివారం క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్‌పో 2022 బ్రోచర్‌ను ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువలతో కూడిన సంస్థగా క్రెడాయ్‌కి దేశవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం ఉన్నాయన్నారు.
జాతీయస్థాయిలో జరిగే క్రెడాయ్ కార్యక్రమాలకు దేశ ప్రధాని, రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, ప్రాంతీయ స్థాయిల్లో జరిగే కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో ఎదురవుతున్న నష్టాలను నివారించడంపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై విస్తృత స్థాయిలో చర్చలు జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ ప్రతినిధులు రాంప్రసాద్, రాజేష్‌గుప్తా, రాజేష్‌బాబు, ప్రభాకర్, రాజశేఖర్‌రావు, వివిధ బ్యాంకుల అధికారులు, బిల్డర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment