CREDAI property show
-
వైఎస్ విజన్ వల్లే హైదరాబాద్ అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి విజన్, విధానాల వల్లే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమైందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ అధికారంలోకి రాక ముందు హైదరాబాద్‌లో స్థిరాస్తి మార్కెట్ పూర్తిగా క్షీణ దశలో ఉండేదని, ఆయన సీఎం పదవి చేపట్టాక దూరదృష్టితో నగరాభివృద్ధి కోసం చేపట్టిన అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్ వే వంటి విప్లవాత్మక ప్రాజెక్టులతో హైదరాబాద్ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయని గుర్తుచేశారు. దీంతో అప్పుడు పుంజుకున్న స్థిరాస్తి మార్కెట్ ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉందని చెప్పారు. భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ 13వ ప్రాపర్టీ షో మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిలో బిల్డర్లు కూడా భాగస్వాములేనన్నారు. బిల్డర్లు ఎంత వ్యాపారం చేస్తే రాష్ట్రం అంత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బిల్డర్లను వ్యాపారస్తులుగా చూసే విధానాలకు స్వస్తిచెప్పి పరిశ్రమ అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటామని పొంగులేటి హామీ ఇచ్చారు. శివారు ప్రాంతాల్లోని రిజర్వాయర్ల సామర్థ్యాన్ని మరింత పెంచి హైదరాబాద్ దాహార్తిని తీరుస్తామని, నీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. నిర్మాణ అనుమతులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ నలువైపులా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందని పేర్కొన్నారు. ధరణిలో 8.5 లక్షల దరఖాస్తులు పెండింగ్.. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వం ఎన్నో విధ్వంసాలకు పాల్పడిందని, సామాన్యులకు కలిగిన ఇబ్బందులను కళ్లారా చూస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రస్తుతం ధరణిలో 8.5–9 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిలో 5.8 లక్షల దరఖాస్తులను సహేతుక కారణాల్లేకుండానే తిరస్కరించారని విమర్శించారు. స్పెషల్ డ్రైవ్‌లతో గత వారం రోజులలో 80 వేల పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించామని పొంగులేటి చెప్పారు. రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేసి బలోపేతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఉన్న లొసుగులను గుర్తించి సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామన్నారు. పారదర్శక రెవెన్యూ వ్యవస్థను సామా న్యుల చెంతకు తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వైఎస్సార్ లాగా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌రెడ్డి అన్నారు. మూసీ రిఫర్‌ఫ్రంట్, మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లతో ప్రధాన నగరంలో కూడా అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ జాతీయ మాజీ అధ్య క్షుడు సి.శేఖర్‌రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వి. రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక వసతులకు పెట్టింది పేరుగా తెలంగాణ
కుత్బుల్లాపూర్: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండదండలతో మౌలిక వసతులకు పెట్టింది పేరుగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని, నచ్చిన ప్రాపర్టీ కొనుక్కుని సొంతింటి కల నెరవేర్చుకునే అవకాశం క్రెడాయ్ ప్రాపర్టీ షో ద్వారా సాధ్యమవుతోందని రాష్ట్ర కార్మిక మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. కొంపల్లి అస్పిసియస్ కన్వెన్షన్ సెంటర్లో రెండు రోజులపాటు కొనసాగే ‘క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో నార్త్‘ను ఎమ్మెల్యే వివేకానంద్‌తో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పక్కా అనుమతులు, కచ్చితమైన సౌకర్యాల కల్పనలో క్రెడాయ్పై ప్రజలకు గట్టి నమ్మకం ఉన్నదన్నారు. మేడ్చల్‌కు దాదాపు 22 లక్షల స్క్వేర్ ఫీట్ల గేట్ వే ఆఫ్ ఐటీ పార్క్ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ నిర్మాణ రంగం ఊపందుకుంటోందని తెలిపారు. ధరణి సమస్యలు పరిష్కరించండి: క్రెడాయ్ ప్రతినిధులు కాగా.. క్రెడాయ్ సభ్యులు నిర్మాణ సమయంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ధరణి రికార్డుల్లో సమస్యలను పరిష్కరించుకోవడానికే కనీసం 6 నెలలు సమయం పడుతోందని, ఇది నిర్మాణంపై ప్రభావం చూపుతోందని వివరించారు. మురుగునీటి సమస్య, కనెక్టివిటీ రోడ్లు, ధరణి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రాపర్టీ షోలో క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు పి.రామకృష్ణారావు, జనరల్ సెక్రటరీ వి.రాజశేఖర్‌రెడ్డి, క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ సీహెచ్ రామచంద్రారెడ్డి, అధ్యక్షుడు డి.మురళీకృష్ణారెడ్డితో పాటు క్రెడాయ్ హైదరాబాద్ ప్రతినిధులు జి.ఆనంద్‌రెడ్డి, కె.రాజేశ్వర్, ఎన్.జైదీప్‌రెడ్డి, బి.జగన్నాథ్ రావు, ట్రెజరర్ ఆదిత్య గౌర, శివరాజ్ ఠాకూర్, కె.రాంబాబు, పలు ఆర్థిక సంస్ధలు, సందర్శకులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌కు మరో మాస్టర్ ప్లాన్
సాక్షి, హైదరాబాద్: మహానగరం రోజురోజుకు విస్తరిస్తున్న వేళ సరికొత్త మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సిన ఆవశ్యత ఉందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వచ్చే 25–30 ఏళ్ల హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తామన్నారు. అంతర్జాతీయ ఏజెన్సీతో వచ్చే 18 నెలల్లో దీనికి రూపకల్పన జరుగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. 2012–13లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఇప్పటి హైదరాబాద్ విస్తరణకు ఏమాత్రం సరిపోవటం లేదని, అందులో కొన్ని తప్పులున్న మాట కూడా వాస్తవేనని అన్నారు. అలాగే111 జీవో పరిధిలో పర్యావరణహితమైన మాస్టర్‌ను ప్లాన్‌ను రూపొందిస్తామని చెప్పారు. హెచ్ఐసీసీలో శుక్రవారం జరిగిన క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో ఆయన మాట్లాడారు. 111 జీవో పరిధిలో 1.32 లక్షల ఎకరాల భూములున్నాయని, 135 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని..ఇక్కడ సమాంతర అభివృద్ధి జరిగేలా మాస్టర్ ప్లాన్‌ను క్రోడీకరిస్తామని వివరించారు. అలాగే ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్త మాస్టర్ ప్లాన్లను అమల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కార్మికులకు నైపుణ్య శిక్షణ కేంద్రం.. వలసలను నివారించేందుకు..భవన నిర్మాణ కార్మికులకు ఇక్కడే ఉపాధి లభించేందుకు డెవలపర్లు చొరవ తీసుకోవాలని సూచించారు. కార్మికులకు సంబంధించిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ అందించాలని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. శిక్షణ అనంతరం జాబ్ గ్యారంటీ అనే నమ్మకాన్ని కలిగిస్తే విదేశాల్లో ఉన్న మన యువత తిరిగి వస్తారని చెప్పారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిద్దామని తెలిపారు. మరో 300 మిలియన్ గ్యాలన్ల నీటి లభ్యత 27 శాతం హైదరాబాద్ తాగునీటి అవసరాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలు తీరుస్తున్నాయి. అయితే గోదావరి, కృష్ణాతో ప్రస్తుతం ఈ జలాశయాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పారు. వీటి నుంచి మిలియన్ గ్యాలన్ల నీటిని కూడా వాడుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం 600 పైగా మిలియన్ గ్యాలన్ల నీటి లభ్యత ఉంది. గుండ్లపోచంపల్లి, మల్లన్నసాగర్లతో త్వరలోనే మరో 300 మిలియన్ గ్యాలన్ల నీరు అందుబాటులోకి రానుందని కేటీఆర్ వివరించారు. దీంతో ప్రతి ఇంటికీ ఇంకా ఎక్కువ గంటలు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పారు. డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణలో మనం దేశంలోనే ముందుంటామని అన్నారు. ఒక్క చోటే ఉండొద్దు.. నగరం నలువైపులా గృహ సముదాయాలను విస్తరించాలని, ఒక్క ప్రాంతంలోనే కేంద్రీకృతం కాకూడదని కేటీఆర్ సూచించారు. ఒకర్ని చూసి ఒకరు గొర్రెల మందలాగా ఒకేచోట స్థిరపడిపోతున్నారు. హైదరాబాద్‌లో పశ్చిమం వైపు మాత్రమే కాకుండా నలువైపులా అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన జరుగుతోంది. వీటిని డెవలపర్లు వినియోగించుకోవాలన్నారు. ఔటర్ లోపల 148 లింక్ రోడ్లు, 19 ఫ్లైఓవర్లు, అండర్పాస్లున్నాయని.. ఆయా ప్రాంతాలలో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందని కేటీఆర్ చెప్పారు. వీటి చుట్టూ హౌసింగ్ కాలనీలు, స్కూళ్లు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్‌ను డెవలప్ చేయాలని బిల్డర్లుకు సూచించారు. కొత్త ఏరియాలలో గృహ నిర్మాణాలను ప్లాన్ చేయాలన్నారు. వచ్చే 10–15 ఏళ్ల పాటు హైదరాబాద్ గృహ నిర్మాణ రంగానికి ఢోకా లేదని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గించాలి ఓఆర్ఆర్ చుట్టూ 5–6 క్లస్టర్లను ఏర్పాటు చేసి డెవలపర్లకు తక్కువ ధరకు భూములను కేటాయించాలని క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ వి.రాజశేఖర్ రెడ్డి కోరారు. దీంతో ఆయా ప్రాంతాలలో రూ.50–60 లక్షల లోపు ధర ఉండే అందుబాటు, మధ్యస్థాయి గృహాలను నిర్మిస్తామని, దీంతో సామాన్యుల సొంతింటి కల మరింత సులువవుతుందని చెప్పారు. మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గించాలని లేదా కనీసం మహిళ పేరిట రిజిస్ట్రేషన్ల చేసే వారికి, అందుబాటు గృహాల రిజిస్ట్రేషన్ చార్జీలను 1–2 శాతం మేర తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, లక్ష్మారెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ ఆర్వీ రామచంద్రా రెడ్డి, ప్రెసిడెంట్ రామకృష్ణా రెడ్డి, హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ రామకృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు. -
కెడాయ్కి సంపూర్ణ సహకారం
తిరుపతి మంగళం: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్)కి తన వంతు సంపూర్ణ సహాయ, సహకారాలను అందిస్తానని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి హామీ ఇచ్చారు. తిరుపతిలోని ఓ ప్రయివేటు హోటల్లో ఆదివారం క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో 2022 బ్రోచర్‌ను ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువలతో కూడిన సంస్థగా క్రెడాయ్‌కి దేశవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం ఉన్నాయన్నారు. జాతీయస్థాయిలో జరిగే క్రెడాయ్ కార్యక్రమాలకు దేశ ప్రధాని, రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, ప్రాంతీయ స్థాయిల్లో జరిగే కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో ఎదురవుతున్న నష్టాలను నివారించడంపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై విస్తృత స్థాయిలో చర్చలు జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ ప్రతినిధులు రాంప్రసాద్, రాజేష్‌గుప్తా, రాజేష్‌బాబు, ప్రభాకర్, రాజశేఖర్‌రావు, వివిధ బ్యాంకుల అధికారులు, బిల్డర్లు పాల్గొన్నారు. -
నిర్మాణ అనుమతుల కలెక్టర్లకు అప్పగింతపై పునరాలోచించండి!
సాక్షి, హైదరాబాద్: ‘జిల్లాలలోని పని ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్న కలెక్టర్లకు అదనంగా భవన నిర్మాణ అనుమతులు అప్పగించడం సరైంది కాదు. డీటీసీపీ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలో ఉన్నట్టు సాంకేతిక నిపుణులు, ఇన్ఫ్రా జిల్లా కేంద్రాలలో లేవు. భవన నిర్మాణ అనుమతుల ఏర్పడే సమస్యల పరిష్కారం కోసం వారంలో రెండు రోజులను కేటాయించారు. అయితే ఆ రోజుల్లో మంత్రి, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం ఉంటే గనక ఇక అంతే సంగతులు. ప్రతి జిల్లాలోను టీఎస్‌బీపాస్ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. దాని పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని’ క్రెడాయ్ తెలంగాణ నూతన కార్యవర్గం కోరింది. ఈ విషయంపై సంబంధింత మంత్రిని సంప్రదించనున్నామని తెలిపింది. క్రెడాయ్ తెలంగాణ నూతన ప్రెసిడెంట్ ఎన్నికైన డీ మురళీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. భూముల సమగ్రత, సులభతర క్రయ విక్రయాల కోసం ఏర్పాటు చేసిన ధరణిపై సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని.. కాకపోతే దీన్ని దశల వారీగా అమలు చేస్తే మరింత సమర్థవంతంగా ఉండేదని సూచించారు. ధరణిలో ఏర్పడుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అప్పటివరకు పాత పద్ధతులను సైతం కొనసాగించాలని కోరారు. టీఎస్‌బీపాస్‌ను జిల్లాలలో పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టి, అమలులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇతర నగరాల్లో రియల్టీ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని, హైదరాబాద్‌లో మాత్రం డిమాండ్ ఏర్పడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సమగ్రవంతమైన పారిశ్రామిక విధానాలు, అందుబాటులో భూముల ధరలు వంటివి ఇందుకు కారణమని తెలిపారు. టీఎస్‌ఐసీతో జిల్లాలలో అభివృద్ధి.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ)ని తీసుకొచ్చారని.. దీంతో స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఈ. ప్రేమ్‌సాగర్ రెడ్డి అన్నారు. జిల్లాల విభజన, మౌలిక వసతుల అభివృద్ధి, ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లలో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి జిల్లాలలో భూముల ధరలు పెరిగాయని చెప్పారు. అయినప్పటికీ ఇతర నగరాల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలతో పోలిస్తే ఆయా జిల్లాలలో అందుబాటులోనే ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో గృహాలకు, గిడ్డంగి సముదాయాలకు డిమాండ్ పెరిగిందని చెప్పారు. వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్‌తో డిమాండ్.. ఇప్పటివరకు ఐటీ, ఫార్మా హబ్‌గా ఉన్న హైదరాబాద్ ఏరోస్పేస్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాలలో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తుందని సెక్రటరీ కే. ఇంద్రసేనా రెడ్డి అన్నారు. మార్కెట్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఎగుమతులను ప్రోత్సహించేందుకు, జిల్లాలలో పారిశ్రామిక జోన్ల అభివృద్ధి కోసం ‘వన్ డిస్ట్రిక్ట్– వన్ ప్రొడక్ట్’ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుందని.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రియల్టీ రంగానికి డిమాండ్ ఏర్పడుతుందని చెప్పారు. క్రెడాయ్ నూతన కార్యవర్గం కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ చైర్మన్‌గా సీహెచ్. రామచంద్రారెడ్డి, ప్రెసిడెంట్‌గా డీ. మురళీ కృష్ణారెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్‌గా ఈ. ప్రేమ్‌సాగర్ రెడ్డి, సెక్రటరీగా కే. ఇంద్రసేనా రెడ్డి, ఉపాధ్యక్షులుగా జీ. అజయ్ కుమార్, జగన్ మోహన్ చిన్నాల, వీ. మధుసూదన్ రెడ్డి, బీ. పాండు రంగారెడ్డి, జాయింట్ సెక్రటరీగా జీ. శ్రీనివాస్ గౌడ్, ట్రెజరర్‌గా ఎం. ప్రశాంత రావు ఎన్నికయ్యారు. క్రెడాయ్ యూత్ వింగ్ తెలంగాణ కో–ఆర్డినేటర్‌గా సీ సంకీర్త్ ఆదిత్యరెడ్డి, సెక్రటరీగా రోహిత్ ఆశ్రిత్ నియమితులయ్యారు. 2021–23 సంవత్సరానికి గాను ఈ నూతన కార్యవర్గం పదవిలో ఉంటుంది. ప్రోత్సాహకర విధానాలు.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రోత్సాహకర విధానాలతో రాష్ట్రం వృద్ధిపథంలో దూసుకుపోతుందని చైర్మన్ సీహెచ్ రామచంద్రా రెడ్డి చెప్పారు. టీఎస్ఐపాస్తో హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాలలోను చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలు వచ్చాయని, దీంతో ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు టీ–హబ్, ఎస్సీ, ఎస్టీల కోసం టీప్రైడ్ వంటి వినూత్న పథకాలతో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరిగిందని.. దీంతో స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లతో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూములు పెరిగాయని, పంట ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని తెలిపారు. వీటన్నింటి ప్రయోజనాలతో హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి జిల్లాలలోను గృహలకు, వాణిజ్య కేంద్రాలు, గిడ్డంగులకు డిమాండ్ పెరిగిందని వివరించారు. నిర్మాణ రంగంలో సాంకేతిక వినియోగం, నైపుణ్యం కలిగిన మానవ వనరులను జిల్లా చాప్టర్లకు సైతం విస్తరించేందుకు కార్మికుల నైపుణ్యాభివృద్ధి, సభ్యులకు శిక్షణ వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని, నీటి పొదుపు, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలపై మెంబర్లకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. సంఘటిత డెవలపర్ల ప్రాజెక్ట్‌లు, అందుబాటు ధరల్లో నాణ్యమైన గృహాలను ఒకే వేదికగా సామాన్యులకు సైతం చేరేలా అన్ని జిల్లా చాప్టర్లలోను ప్రాపర్టీ షోలను నిర్వహిస్తామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 క్రెడాయ్ చాప్టర్లున్నాయని, ఈ రెండేళ్ల కాలపరిమితిలో వీటిని 20కి విస్తరిస్తామని పేర్కొన్నారు. -
Credai: ప్రాపర్టీ షో.. అదిరింది...
-
Credai: ప్రాపర్టీ షో.. అదిరింది...!
క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షో ముగిసింది. కోవిడ్ సంక్షోభం తర్వాత అతి పెద్ద ప్రాపర్టీ షోగా ఇది నిలిచింది. వందకు పైగా రియల్ ఎస్టేట్, డెవలపర్స్ ఈ షోలో పాల్గొన్నారు. మొదటి షో కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కుదుపులకు లోనైంది. ముఖ్యంగా సెకండ్ వేవ్ తర్వాత ఎక్కడా ప్రాపర్టీ షోలు భారీ స్థాయిలో జరగలేదు. అనేక సవాళ్లను అధిగమిస్తూ ఆగస్టు 13,14,15 తేదీల్లో హైటెక్స్‌లో , క్రెడాయ్ హైదరాబాద్ యూనిట్ ఈ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేసింది. రియల్ పుంజుకుంటోంది క్రెడాయ్ ప్రాపర్టీ షోకు రెస్పాన్స్ బాగుందని క్రెడాయ్, హైదరాబాద్ యూనిట్ ట్రెజరర్ ఆదిత్య అన్నారు. కోవిడ్ మునుపటి స్థితికి రియల్ ఎస్టేట్ చేరుకుంటుందనే నమ్మకం కలిగిందన్నారు. కొత్తగా ఇళ్లలు కొనాలనుకునే వారి సంఖ్య పెరిగిందని తెలిపారు. మరోవైపు ఆఫీస్ స్పేస్‌లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇన్సెంటీవ్లు ఉండటంతో మార్కెట్ ఆశాజనకంగా ఉందన్నారు. రెస్పాన్స్ బాగుంది ప్రాపర్టీ షో ప్రారంభం కాకుముందు జనాల రెస్సాన్స్ ఎలా ఉంటుందో అనే అనుమానం ఉండేదని, కానీ ఈ షో ప్రారంభమైన తర్వాత అనుమానాలు అన్నీ పటాపంచలైపోయాంటూ తెలిపింది గౌరు డెవలపర్స్‌కి చెందిన కావ్య. కొత్త ఇళ్లులు, స్థలాలు కొనాలనుకునే వారి సంఖ్య పెరిగిందని, మూడు రోజులుగా వస్తున్న వారికి తమ ప్రాజెక్టుల గురించి వివరిస్తున్నామంది. మార్కెట్‌పై అవగాహన దాదాపు పద్దెనిమిది నెలలుగా ఎక్కువ మంది ఇళ్లకే పరిమితయ్యారు. అత్యవసర పనులకే బయటకు వస్తున్నారు. దీంతో ప్రస్తుతం మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయనే దానిపై సరైన అవగాహన ఉండటం లేదు. అయితే క్రెడాయ్ భారీ ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడంతో మార్కెట్‌పై అవగాహన కోసం చాలా మంది వస్తున్నారు. ముఖ్యంగా గృహిణిలు కొత్త ఇళ్ల గురించి ఎక్కువగా వాకాబు చేస్తున్నారు. మొత్తంగా రియల్ ఎస్టేట్ రంగంపై ముసురుకున్న అనుమానాలను క్రెడాయ్ ప్రాపర్టీ షో పటాపంచలు చేసింది. -
డబ్బా బిల్డింగ్స్ కట్టొద్దు
‘‘నగరం అభివృద్ధిని గుర్తించేది స్థానికంగా ఉన్న సుందర, వినూత్న భవన ఆకారాలతోనే. లాస్ ఏంజిల్స్, షాంఘై వంటి నగరాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి కారణమిదే. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ కూడా గుర్తింపు పొందాలంటే స్థానిక డెవలపర్లు నాలుగు గోడలు, పైకప్పుతో డబ్బా లాంటి బిల్డింగ్స్ కట్టొద్దు. వినూత్న ఎలివేషన్స్, డిజైన్లతో నిర్మాణాలను చేపట్టాలని’’ తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు సూచించారు. వినూత్న ఎలివేషన్స్ కోసం ఖర్చు పెట్టాలని.. ఆర్కిటెక్ట్, డిజైన్స్ ఎంపికలో అంతర్జాతీయ కన్సల్టెన్సీలతో కలిసి పనిచేయాలన్నారు. క్రెడాయ్ హైదరాబాద్ 9వ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. సాక్షి, హైదరాబాద్: డెవలపర్లు ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో ఆధునిక విధానాలను పాటించాలి. సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించాలి. నిర్మాణ ప్రదేశాల్లో దుమ్ము, ధూళి వంటివి రాకుండా చూసుకోవాలి. దీంతో అనారోగ్యంతో పాటూ కాలుష్యం ఎక్కువవుతుంది. మరీ ఎక్కువగా పశ్చిమ హైదరాబాద్‌లో జరిగే నిర్మాణదారులు అప్రమత్తంగా ఉండాలి. వాటర్స్ప్రే వంటి ఎన్నో రకాల ఆధునిక విధానాలు అందుబాటులో ఉన్నాయని సూచించారు. నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించడం, రహదారులు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టరాదు. అనుమతులు ఇవ్వకుండానో, కూల్చడం ద్వారానో వీటిని ఆపొచ్చు. లేకపోతే ప్రభుత్వం జరిమానాలు, శిక్షలు విధించొచ్చు. రాష్ట్రాభివృద్ధికి కావాల్సింది ఇది కాదని.. డెవలపర్లకే స్వీయ నియంత్రణ అవసరమని అభిప్రాయపడ్డారు. క్రెడాయ్ స్కిల్ ఇనిస్టిట్యూట్.. ప్రస్తుత నిర్మాణ రంగంలో పని చేస్తున్న కూలీలు ఎక్కువగా బిహార్, రాజస్తాన్ వంటి ఇతర రాష్ట్రాల వాళ్లే ఉన్నారు. మనోళ్లేమో కూలీ పని కోసం గల్ఫ్ దేశాలకు పోతున్నారు. అలా కాకుండా నగర నిర్మాణ రంగంలో స్థానికులనే నియమించుకోవాలి. న్యాక్ వంటి సంస్థలతో నైపుణ్య శిక్షణ ఏర్పాటు చేస్తాం. అవసరమైతే క్రెడాయ్ స్కిల్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలి. ప్రతిపాదనలతో సంప్రదిస్తే ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. ప్లంబర్, కార్పెంటర్ వంటి అన్ని రకాల నిర్మాణ రంగ పనులు స్థానికులకే అందిస్తే ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి. మరోవైపు ప్రభుత్వం కూడా నిర్మాణ రంగ విధానాలను సులభతరం చేయడానికి ప్రధాన కారణం డెవలపర్లను చూసి కాదు.. నిర్మాణ రంగం మీద ఆధారపడి కూలీలు, తాపీ మేస్త్రీలు, ప్లంబర్లు, కార్పెంటర్లు వంటి లక్షలాది మంది నిర్మాణ రంగ కూలీలకు న్యాయం జరుగుతుందనే. డెవలపర్లు జిల్లాల్లోనూ దృష్టి సారించాలి.. హైదరాబాద్‌తో పాటూ తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ డెవలపర్లు దృష్టిసారించాలి. రూ.2,500 కోట్లతో అన్ని మున్సిపాలిటీల్లో రోడ్లు, మంచినీరు, విద్యుత్ వంటి అన్ని రకాల మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నాం. గ్రామీణ టెక్నాలజీ పాలసీతో జనగాం, కామారెడ్డి, హుజూరాబాద్ వంటి ప్రాంతాల్లో బీపీఓ కేంద్రాలు రానున్నాయి. నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి జిల్లాల్లో కూడా డెవలపర్లు ప్రాజెక్ట్‌లను చేపట్టాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటూ క్వాలిటీ ఆఫ్ బిజినెస్ పెరగాలి. కాస్ట్ ఆఫ్ బిజినెస్ తగ్గాలని సూచించారు. అతిత్వరలోనే టీఎస్–బీపాస్ చట్టాన్ని అమలు చేయనున్నాం. ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. టీఎస్–ఐపాస్ తరహాలో దీన్నికూడా వంద శాతం సమర్థవంతంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘డెవలపర్లు ఎంత సేపు ఇళ్లు కట్టడం, అమ్మడం మాత్రమే కాకుండా రాష్ట్రాభివృద్ధిలోనూ పాలు పంచుకోవాలి. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. కొత్తరకం ప్రాజెక్ట్‌లతో టూరిజం డెవలప్ అవుతుంది. దీంతో డెవలపర్లకే జీవిత కాలం ఆదాయం వస్తుందని’’ తెలిపారు. తెలంగాణలో ఉన్న క్రీడా మైదానాలు, కాంప్లెక్స్‌లు, సాంస్కృతిక వేదికలను డెవలపర్లు దత్తత లేదా నిర్వహణ చేయాలి. అవసరమైతే వాటికి వాళ్ల పేర్లే పెడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, జీవన్ రెడ్డిలతో పాటూ క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ గుమ్మి రాంరెడ్డి, ప్రెసిడెంట్ సీహెచ్ రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉప్పల్ – నాగోల్‌లో 20 లక్షల చ.అ. పశ్చిమ హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీల్లో పనిచేసే చాలా మంది ఉద్యోగులు ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్ వంటి ఈస్ట్ జోన్ నుంచి వస్తున్నవాళ్లే. అందుకే ఆయా కంపెనీలు ఉద్యోగులున్న చోటే పని ప్రదేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఇప్పటికే ఉప్పల్– నాగోల్ ప్రాంతంలో మూడు ప్రధాన కంపెనీలు 20 లక్షల చ.అ. కమర్షియల్ స్పేస్ అభివృద్ధి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. త్వరలోనే వాటికి అనుమతులు మంజూరు చేయనున్నాం. ఆయా ప్రాంతంలో ఐటీ, ఇతర కంపెనీల ఏర్పాటుకు ప్రయత్నిస్తామని కేటీఆర్ తెలిపారు. ♦ డెవలపర్లు ఎంత సేపు పశ్చిమ హైదరాబాద్ మీదే దృష్టి పెడుతున్నారు. ఇది సరైంది కాదు. ఈస్ట్, నార్త్, సౌత్ జోన్స్‌లోనూ ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసింది. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్ వంటి ఈస్ట్ జోన్ త్వరలోనే ఐటీ పార్క్, సౌత్ జోన్లో చైనీస్ కంపెనీతో కలిసి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)ను, పేట్‌బషీరాబాద్ – కొంపల్లి వంటి నార్త్ జోన్లో ఐటీ పార్క్‌లను ప్రారంభించనున్నాం. కో–లివింగ్కుమార్గదర్శకాలుఅవసరం.. ఈ మధ్య కాలంలో కో–లివింగ్‌కు డిమాండ్ పెరుగుతుంది. పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు నగరంలో కో–లివింగ్ ప్రాజెక్ట్‌లకు ప్రణాళికలు చేస్తున్నాయి. అయితే ఈ కో–లివింగ్ ప్రాజెక్ట్‌లకు ప్రత్యేకమైన మార్గదర్శకాలు ఉండాల్సిన అవసరముంది. ఎందుకంటే ఆయా కో–లివింగ్ ప్రాజెక్ట్‌లు ఫ్యామిలీ ప్రాజెక్ట్స్ ఉన్న చోట ఉంటే నివాసితులకు ఇబ్బంది. కో–లివింగ్‌లో ఉండేది యువతేనని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రామకృష్ణా రావు అభిప్రాయపడ్డారు. పరిశ్రమలకు ఎలాగైతే బల్క్ వాటర్‌ను అందిస్తున్నారో అలాగే నిర్మాణ రంగ అవసరాలకూ నీటిని అందించాలని కోరారు. రెసిడెన్షియల్ అసోసియేషన్స్‌కు ఫైర్ సేఫ్టీ, నిర్వహణ వంటి వాటిపై అగ్నిమాపక శాఖతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను కల్పించాలని కోరారు. అవసరమైతే స్థానిక విద్యా సంస్థలు ప్రొఫెషనల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కోర్స్‌లను తీసుకురావాలని సూచించారు. క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. పశ్చిమ హైదరాబాద్‌లో మాత్రమే ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఉప్పల్, మేడ్చల్, కొంపల్లి వంటి తూర్పు, ఉత్తర హైదరాబాద్‌లోనూ కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపాలి. దీంతో ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతాయి కాబట్టి ఆయా ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున నివాస, వాణిజ్య సముదాయాల వస్తాయి. సమాంతర అభివృద్ధి జరుగుతుంది. వరంగల్, కరీంనగర్ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐటీ పార్క్‌ల ఏర్పాటుతో జిల్లాల్లోనూ రియల్టీ పరుగులు పెడుతుంది. -
'ఆన్లైన్ లో ప్రాజెక్ట్‌లకు అనుమతులు'
హైదరాబాద్: రియల్ఎస్టేట్ రంగానికి పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలిపారు. హైటెక్స్ లో ఏర్పాటు చేసిన క్రెడాయ్ ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆన్లైన్ పద్దతిలో ప్రాజెక్ట్‌లకు అనుమతులు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. రియాల్టీ ప్రాజెక్ట్‌లకు, విమాన సంస్థ అనుమతులు హైదరాబాద్‌లోనే మంజూరు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. మూడు రోజుల పాటు జరగనున్న క్రెడాయ్ ప్రాపర్టీ షోలో రియార్టీ సంస్థలు పాల్గొంటున్నాయి.