సాక్షి, విజయవాడ: విజయవాడలో బుడమేరు వరద బాధితులు నెల రోజులుగా పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. వరదకు సర్వం కోల్పోయి, కట్టుబట్టలతో మిగిలిన తమకు ప్రభుత్వం సహాయం చేస్తుందేమోనన్న ఆశతో వేలాది బాధితులు నిత్యం విజయవాడలోని కలెక్టర్ కార్యాలయానికి వస్తున్నారు.
..కార్యాలయం గేట్లు మూసేసి పోలీసులు దూరంగా తోసేస్తున్నా, అధికారులు ఛీత్కరించుకుంటున్నా ‘వరదకు బలైపోయాం.. సాయం చేయండయ్యా’ అని వేడుకొంటున్న తీరు అందరినీ కదిలిస్తోంది తప్ప చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం చలనం రావడంలేదు. వరద బాధితులకు ఏదో చేసేశామంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రకటనలే తప్ప.. వాస్తవంగా ఒరిగిందేమీ లేదు.
మరోవైపు.. విజయవాడ వరద ఖర్చుల్లో భారీ అవినీతి జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విరాళాలన్నీ ఖర్ఛు చేసినట్టు కూటమి ప్రభుత్వం లెక్క సెట్ చేసింది. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23కోట్లుగా ప్రభుత్వం రాసేసింది. వరద బాధితులకు భోజనం కోసం ఏకంగా రూ.368కోట్లుగా సర్కార్ లెక్క చెప్పింది. ఒక్కో భోజనానికి రూ.264 ఖర్చు చేసినట్టు లెక్కల్లో చూపించారు.
పులిహోర, సాంబార్ రైస్, వెబ్ బిర్యానీకి భారీ ధర కనిపిస్తోంది. అన్నా క్యాంటీన్ భోజనం రూ.95కు సరఫరా చేశారు. వరదల్లో మాత్రం భారీగా ధర చెల్లించినట్టు గోల్‌మాల్ చేశారు. వరదల్లో డ్రోన్ల కోసం రూ.2కోట్లు ఖర్చు చేసినట్టు అధికారులు చూపించారు. రూ.534కోట్లలో ఆహారం, నీళ్లు, వసతి, పారిశుద్ధ్యం కోసం ఖర్చు చేసినట్టు తెలిపారు. అయితే, వరదల సందర్భంగా తమకు 10 రోజుల పాటు ఆహారం, నీళ్లు అందక బాధితులు గగ్గోలు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సైతం చక్కర్లు కొట్టాయి. అయినా, బాధితులకు అన్నీ ఏర్పాట్లు చేసి డబ్బులు ఖర్చు చేసినట్టు కరెక్ట్‌గా లెక్కల్లో చూపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు రాసేశారని సీపీఎం, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. దాతల సాయాన్ని కూడా ప్రభుత్వం లెక్కల్లో రాసేసిందని మండిపడుతున్నారు.
ఇది కూడా చదవండి: శ్రీవారి నిధుల దోపిడీకి బాబు సర్కారు స్కెచ్
Comments
Please login to add a commentAdd a comment