సాక్షి, విశాఖపట్నం: ఒకటి కాదు.. రెండు కాదు.. 30 రకాలకు చెందిన స్వదేశీ, వలస పక్షుల్ని చూసి వారంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. స్టింట్స్.. గుల్స్.. ఇలా.. విభిన్న రకాల పక్షులతో ఓ రోజంతా గడుపుతూ సరికొత్త అనుభూతికి గురయ్యారు. మెరైన్ ఫెస్టివల్–2021 మూడో ఎడిషన్‌లో భాగంగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్(డబ్ల్యూడబ్ల్యూఎఫ్), వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ త్రూ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్(డబ్ల్యూసీటీఆర్‌ఈ) సంయుక్తంగా షోర్ బర్డ్ వాచింగ్ వాక్ సెషన్‌ని తగరపువలసలో ఆదివారం నిర్వహించారు.
ఈ వాక్‌ని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా సీనియర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సుధా ప్రారంభించారు. 4 ఏళ్ల నుంచి 50 ఏళ్లు పైబడిన వారు వాక్‌లో పాల్గొని ప్రకృతి అందాల్ని తిలకిస్తూ.. పక్షుల్ని చూస్తూ సరదాగా గడిపారు. వైజాగ్‌లో శీతాకాలంలో కనిపించే పక్షుల వైవిధ్యం గురించి డబ్ల్యూసీటీఆర్‌ఈ బయాలజిస్ట్ భాగ్యశ్రీ వివరించారు. అరుదైన పక్షుల ఉనికి, వాటి ప్రాముఖ్యత, జీవిత చక్రం, పర్యావరణంతో వాటికున్న అనుబంధం గురించి ప్రజలకు చాటిచెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment