సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇరిగేషన్ విభాగానికి మాత్రమే నిధులు కేటాయిస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు సోమవారం రాజ్యసభలో తెలిపారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈమేరకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లను సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) సమావేశంలో ఆమోదించినా రివైజ్డ్ కాస్ట్ కమిటీ కేవలం ఇరిగేషన్ విభాగానికి అయ్యే ఖర్చు రూ.35,950 కోట్లకు ఆమోదం తెలుపుతూ 2020 మార్చిన నివేదికను సమర్పించిందని చెప్పారు. దీనిపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) తుది సిఫార్సుల అనంతరం ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ తీసుకుంటామన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు కేంద్రం పోలవరం పనులకు సంబంధించి రూ.11,600 కోట్లను రీయింబర్స్ చేసిందని, మరో రూ.711 కోట్ల రీయింబర్స్‌పై ఇటీవలే పీపీఏ, సీడబ్ల్యూసీ సిఫార్సు చేసినట్లు తెలిపారు.
పురోగతిపై నెలవారీగా వివరాలు..
పనుల పురోగతిని రాష్ట్ర ప్రభుత్వం నెలవారీగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి నివేదిస్తోందని పేర్కొంటూ 2019 జనవరి నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు పురోగతిని కేంద్ర మంత్రి వివరించారు. హెడ్‌వర్క్స్‌లో భాగంగా 245.62 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, కట్ట పని, 12.83 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరిగిందన్నారు. కుడి ప్రధాన కాలువకు సంబంధించి 3.86 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 1.37 లక్షల క్యూబిక్ మీటర్ల లైనింగ్, 0.42 లక్షల క్యూబిక్ మీటర్ల మేర నిర్మాణాలు జరిగాయని తెలిపారు. ఎడమ ప్రధాన కాలువలో 13.90 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 0.48 లక్షల క్యూబిక్ మీటర్ల లైనింగ్, 1.97 లక్షల క్యూబిక్ మీటర్ల నిర్మాణాలు జరిగాయన్నారు. ప్రాజెక్టు కోసం 995.77 హెక్టార్ల భూ సేకరణ జరగగా 2,429 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించినట్లు వివరించారు.
కాలింగ్ అటెన్షన్ నోటీసిచ్చిన మిధున్‌రెడ్డి
పోలవరంపై చర్చకు లోక్‌సభలో వైఎస్సార్ సీపీ లోక్‌సభా పక్షనేత మిధున్‌రెడ్డి కాలింగ్ అటెన్షన్ నోటీసు ఇచ్చారు. సవరించిన అంచనా వ్యయం రూ.55,657 కోట్లకు ఆమోదం తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆలస్యం వల్ల పునరావాసం పనులకు తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఖర్చు చేసిన రూ.1,920 కోట్లను వెంటనే రీయింబర్స్ చేసి వచ్చే ఏడాది కల్లా ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం సహకరించాలని కోరారు.
కీలక నిర్మాణాలు పూర్తి
పోలవరంలో స్పిల్‌వే, అప్‌స్ట్రీమ్ కాఫర్ డ్యామ్, కాంక్రీట్ డ్యామ్ (గ్యాప్ 3), డయాఫ్రమ్ వాల్ ఆఫ్ ఎర్త్ కమ్ రాక్–ఫిల్ డ్యామ్ లాంటి కీలక భాగాల నిర్మాణం ఇప్పటికే పూర్తైనట్లు రాష్ట్ర ప్రభుత్వం నివేదించిందని బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. స్పిల్‌వే రేడియల్ గేట్లు 88%, స్పిల్ ఛానెల్ 88%, అప్రోచ్ ఛానల్ ఎర్త్‌వర్క్ 73%, పైలట్ ఛానెల్ పని 34%, పవర్ హౌస్ పునాది తవ్వకంలో 97% పురోగతి సాధించినట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వచ్చే ఏడాది ఏప్రిల్ లక్ష్యంగా నిర్దేశించుకున్నా పనుల ప్రస్తుత స్థితి ప్రతిపాదిత షెడ్యూల్‌కు అనుగుణంగా ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. కోవిడ్ మహమ్మారి, ఎర్త్ కమ్ రాక్–ఫిల్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ గ్యాప్–1, గ్యాప్–2 పనులు, పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయడంలో ఆలస్యం తదితర కారణాల వల్ల ఆటంకం కలిగినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment