సాక్షి ప్రతినిధి, ఏలూరు, తాడేపల్లిగూడెం/సాక్షి నెట్‌వర్క్: మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు(60) అనారోగ్యంతో కన్నుమూశారు. విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. కోవిడ్–19 వైరస్‌తోపాటు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్, మధుమేహం ఆయన ఆరోగ్యాన్ని కుంగదీశాయి. గత నెల 3వ తేదీన ఆయనకు కరోనా పాజిటివ్ రాగా, ఈ వ్యాధికి భయపడాల్సిందేమి లేదని, ఆరోగ్యంగా తిరిగి వస్తానంటూ వీడియో సందేశం ఇచ్చి ఆసుపత్రికి వెళ్లారు. పది రోజులక్రితం పరీక్షించగా కరోనా నెగిటివ్ వచ్చింది. మనోధైర్యంతో పోరాడి కరోనాను జయించి నప్పటికీ.. ఇతర సమస్యల కారణంగా శనివారం ఒక్కసారిగా ఆరోగ్యంలో మార్పు రావడంతో ఆయన ప్రాణాలు విడిచారు. ఆయన భౌతిక కాయానికి తాడేపల్లిగూడెం మామిడాల చెరువు వద్ద ఉన్న స్మశానవాటికలో శనివారం రాత్రి 9 గంటల సమయంలో అంత్యక్రియలు జరిపారు. ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు.
ప్రధాని మోదీతో మాణిక్యాలరావు (ఫైల్)
ఉప రాష్ట్రపతి, గవర్నర్, సీఎం సంతాపం
► మాణిక్యాలరావు మృతి పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తన సంతాపం తెలియజేస్తూ.. ఎమ్మెల్యేగా, మంత్రిగా మాణిక్యాలరావు ఏపీకి మంచి సేవలందించారని కొనియాడారు. పైడికొండల మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు.
► మాణిక్యాలరావు మృతి పట్ల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ థియోధర్, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కూడా సంతాపం తెలియజేశారు.
స్వయం సేవక్ నుంచి మంత్రి వరకూ..
మాణిక్యాలరావు స్వయం సేవక్‌గా రాష్ట్రీయ స్వయం సేవక్‌లో చురుగ్గా పనిచేస్తూ 1989లో భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ కేబినెట్‌లో ఆయన దేవదాయ, ధర్మాదాయశాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆయనకు భార్య సూర్యకుమారి, కుమార్తె సింధు ఉన్నారు.
మాజీ మంత్రి పైడికొండల కన్నుమూత
Published Sun, Aug 2 2020 3:55 AM | Last Updated on Sun, Aug 2 2020 9:42 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment