ఒక్కసారిగా నీట మునిగిన గ్రామాలు
పరుగులు తీసిన గ్రామాల ప్రజలు
పొంగిపొర్లుతున్న వేళ్లవాగు, ఎద్దెల వాగు
కొట్టుకుపోయిన ఎద్దెల వాగు వంతెన అప్రోచ్
బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు
వేలేరుపాడు: కుండపోత వర్షాలు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలాన్ని ముంచెత్తాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నీటి ప్రవాహం ఉధృతం కావడంతో పెదవాగు ప్రాజెక్టు గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో తెగిపోయింది. దీంతో మండలంలోని మేడేపల్లి, కమ్మరగూడెం, అల్లూరి నగర్, ఒంటిబండ, రామవరం ఊటగుంపు, ఉదయ్‌నగర్, సొంబే గొల్లగూడెం, గుల్లవాయి, పాత పూచిరాల గ్రామాల్లో ఇళ్లు నీట మునిగాయి. అకస్మాత్తుగా ప్రాజెక్టు నీరు రావడంతో ఆయా గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగు తీశారు.
పెదవాగు ప్రాజెక్టుకు చేరువలో ఉన్న మేడేపల్లి, అల్లూరి నగర్, ఒంటి బండ, కమ్మరగూడెం గ్రామాల ప్రజలు ఒక్కసారిగా నీరు రావడంతో సమీపంలోని గుట్టల పైకి, భవనాల పైకి ఎక్కారు. వరద ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. సహాయక చర్యలు అందించేందుకు ఆయా గ్రామాలకు అధికారులు వెళ్లాలన్నా రహదారి సౌకర్యం లేదు. ఆయా గ్రామాల ప్రజలే సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
వేలేరుపాడు మండలం మేడేపల్లి మొదలుకొని అల్లూరి నగర్, కోయ మాధవరం, గుల్లవాయి తదితర ప్రాంతాల్లో రహదారులన్నీ నీట మునిగాయి. వేలేరుపాడు నుంచి కొయిదా వెళ్లే రహదారిలో వేళ్లవాగు, ఎద్దెల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎద్దెల వాగు వద్ద వంతెన అప్రోచ్ కొట్టుకుపోయింది. వేలేరుపాడు నుంచి రుద్రమ్మకోటకు వెళ్లే రహదారిలో పెదవాగు వంతెన వద్ద రహదారి అంతా నీట మునిగింది.
Comments
Please login to add a commentAdd a comment