వ్యాపార లావాదేవీల నేపథ్యంలో హత్య
డబ్బుల కోసం మాట్లాడుకుందామని పిలిచి గొంతు బిగించి చంపిన స్నేహితుడు
మృతదేహంతో పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు యత్నించిన మృతుడి కుటుంబ సభ్యులు
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నగరం నడిరోడ్డున మంగళవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మాట్లాడుకుందాం రమ్మని పిలిచిన స్నేహితుడే ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన, సేకరించిన వివరాల ప్రకారం.. యనమలకుదురు డొంకరోడ్డులోని శ్రీనివాస అపార్ట్‌మెంట్స్‌లో మహ్మద్ రఫీ(54), అజ్మరీ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. రఫీ వారి ఇంటి సమీపంలోనే ఆదిల్ డిజిటల్ సేవా కేంద్రాన్ని నడుపుతూ జీవనం సాగిస్తూ పిల్లలిద్దరినీ ఉన్నత చదువులు చదివిస్తున్నాడు.
రఫీతో కలిసి లయోలా కళాశాలలో చదువుకున్న సాగి వెంకట నరసింహరాజు(54) అనే స్నేహితుడు హైదరాబాద్‌లో నివసిస్తూ ఓ ఫార్మసీ కంపెనీని నడుపుతున్నాడు. సోమవారం నగరానికి వచ్చిన నరసింహరాజు తన స్నేహితుడు రఫీకి ఫోన్ చేసి అయోధ్యనగర్‌లోని లోటస్ ల్యాండ్‌మార్క్‌లో ఉన్న తన ఫ్లాట్‌కు రమ్మని పిలిచాడు. దీంతో రఫీ సోమవారం తన స్నేహితుడు ఉన్న ఫ్లాట్‌కు వెళ్లాడు. రఫీకి మద్యం తాగే అలవాటు ఉంది. నరసింహరాజు మాత్రం మద్యం ముట్టడు. దీంతో నరసింహరాజు తన స్నేహితుడు రఫీకి మద్యం తెప్పించాడు.
రఫీ మద్యం తాగాడు. అనంతరం రఫీకి, నరసింహరాజుకు మధ్య డబ్బుల విషయమై వివాదం నెలకొంది. ఈ క్రమంలో రఫీ సమీపంలో ఉన్న కత్తెరను తీసుకొని నరసింహరాజును పొడిచేందుకు ప్రయత్నించగా అతను తన మెడలో ఉన్న కండువాను తీసి రఫీ మెడకు గట్టిగా బిగించేయడంతో రఫీ ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయాడు. నరసింహరాజు విషయాన్ని 100కు ఫోన్ చేసి పోలీసులకు, 108కు ఫోను చేసి జరిగిన విషయాన్ని చెప్పగా వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రఫీని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్థారించారు.
కత్తితో దాడి చేయబోతే ప్రతిఘటించా...
తన స్నేహితుడు రఫీ ఇటీవల బాగా అప్పులపాలయ్యాడని ఈ క్రమంలో తనను రూ.3 లక్షలు అప్పుగా అడగడంతో తాను నిరాకరించానన్నారు. ఆ విషయంలో తమ ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిందని, రఫీ పక్కనున్న కత్తెరతో తనపై దాడికి ప్రయతి్నంచగా తాను అతన్ని ఆపేందుకు కండువాతో గట్టిగా గొంతు నులిమానంటూ నిందితుడు నరసింహరాజు పోలీసులకు చెప్పుకొచ్చాడు. తన బాల్య స్నేహితుడిని తానెందుకు చంపుకొంటానంటూ వాపోయాడు.
అన్నీ అబద్ధాలే.. కావాలనే నా భర్తను హతమార్చారు...
నరసింహరాజు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని రఫీ భార్య అజ్మిరీ ఆరోపించింది. తన భర్త రఫీయే నరసింహరాజుకు డబ్బులు ఇచ్చాడని, వాటిని ఇవ్వమని అనేకసార్లు అడుగుతుంటే మాట దాట వేసుకుంటూ వస్తున్నాడన్నారు. ఈ విషయమే మాట్లాడేందుకు వారిద్దరూ కలిశారని తెలిపింది. పథకం ప్రకారమే తన భర్తకు ఫుల్‌గా మద్యం తాగించి, తన భర్త పైనే కత్తెరతో దాడిచేసి నైలాన్ కండువాతో గొంతు నులిమి హత్య చేశాడని ఆమె ఆరోపించింది. నరసింహరాజుతో పాటు మరో ఇద్దరు ముగ్గురు కలిసి తన భర్తను హతమార్చి ఉంటారని, పోలీసు ఉన్నతాధికారులు దీనిపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఆమె కోరింది.
రఫీ బంధువుల ఆందోళన
రఫీ కుటుంబ సభ్యులు, బంధువులు తమకు న్యాయం చేయాలని మంగళవారం సాయంత్రం రఫీ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చేందుకు ప్రయతి్నంచారు. పోలీసులు వారిని ప్రభుత్వ హాస్పిటల్ వద్దే అడ్డుకుని గేటు మూసేసి బయటకు రాకుండా నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment