
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: విభజన చట్టంలోని హామీలన్నీ పూర్తయ్యేలా నూతన బడ్జెట్ ఉండాలని కేంద్రానికి ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సూచించారు. ఈ మేరకు అదనపు నిధులు కేటాయించాలని కోరారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ నేతృత్వంలో న్యూఢిల్లీలో గురువారం నిర్వహించిన ఆర్థిక మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 90:10 నిష్పత్తిలో నిధులు అందజేయాలని కోరారు. కౌలు రైతులకు ప్రయోజనాలు అందించేలా కొత్త పథకాన్ని రూపొందించాలని, కేంద్ర ప్రాయోజిత పథకాలను రాష్ట్రాల అవసరాలకనుగుణంగా మార్చుకునేందుకు సౌలభ్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ఎప్పటికప్పుడు జాప్యం లేకుండా నిధులు విడుదల చేయాలన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ కరువు నివారణ పథకాలకు నిధులను కేటాయించాలని, షెడ్యూలు 12లో ఉన్న సంస్థలన్నింటికీ నిధులు ఇవ్వాలని కోరారు. సమావేశం అనంతరం నిర్మలాసీతారామన్‌తో ప్రత్యేకంగా భేటీ అయిన రాజేంద్రనాథ్ రాష్ట్ర సమస్యలు వివరించారు.
‘టెక్స్‌టైల్‌పై పన్నుపెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’
జనవరి 1వ తేదీ నుంచి టెక్స్‌టైల్స్, పాదరక్షలపై జీఎస్టీ రేటును 5 నుంచి 12 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయనుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన శుక్రవారం న్యూఢిల్లీలో జరిగే 46వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ అంశంపై గట్టిగా డిమాండ్ చేయనున్నారు. కోవిడ్‌తో ఇప్పటికే దెబ్బతిన్న టెక్స్‌టైల్ రంగం జీఎస్టీ పన్ను పెంపుతో భారీగా దెబ్బతింటుందని, దీనివల్ల లక్షలాదిమంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. రూ.వెయ్యిలోపు దుస్తులపై ఇప్పటివరకు 5 శాతం ఉన్న జీఎస్టీ రేటు జనవరి 1 నుంచి 12 శాతానికి పెరగనుంది.
మన రాష్ట్రంలో సుమారు 50 వేల వస్త్ర దుకాణాలున్నాయి. వీటిద్వారా ఏటా రూ.30 వేలకోట్ల టర్నోవర్ జరుగుతోందని అంచనా. ఇప్పుడు 5% చొప్పున ఏటా రూ.1,500 కోట్లు జీఎస్టీ రూపంలో చెల్లిస్తుండగా 12 శాతానికి పెరిగితే రూ.3,600 కోట్లు అవుతుందని, అంటే ప్రజలపై అదనంగా రూ.2,100 కోట్ల భారం పడుతుందని వస్త్రవ్యాపారులు పేర్కొంటున్నారు. జీఎస్టీ పెంపు ఎంతోమంది చేతి వృత్తి కళాకారుల ఉపాధి దెబ్బతీసే అవకాశం ఉండటంతో పన్ను పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా డిమాండ్ చేయాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment