పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న మహిళలపై దౌర్జన్యం
కుర్చిలు విరగ్గొట్టి భయభ్రాంతులకు గురి చేసిన వైనం
బయట నుంచి తలుపులు వేసిన జనసేన నేతలు
ఓ గర్భిణి ఉందని వేడుకున్నా వినిపించుకోని వైనం
భయంతో స్పృహ తప్పిన గర్భిణి.. ఓ యువతి
ఫోన్‌తో రంగంలోకి పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్
పోలీసులు వచ్చి తలుపులు తెరిచే వరకు గృహ నిర్బంధంలోనే మహిళలు
జనసేన అభ్యర్థి నానాజీ, మరికొందరిపై క్రిమినల్ కేసు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకులందరినీ గుండాలు, రౌడీలంటూ నోరు పారేసుకుంటుంటారు. కానీ, ఆయన పార్టీ అభ్యర్థులు, నాయకులు మహిళా వలంటీర్ల పైన కూడా దౌర్జన్యానికి దిగి, గృహ నిర్బంధానికి పాల్పడ్డారు. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ సహా ఆ పార్టీ నాయకులు గురువారం సాగించిన గూండాగిరీతో మహిళా వలంటీర్లు బెంబేలెత్తిపోయారు. ఓ మహిళా వలంటీరు పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటుండగా ఆ భవనంలోకి చొరబడటమే కాకుండా, ఆమెతో పాటు వేడుకలకు వచ్చిన మిగతా మహిళా వలంటీర్లపై దౌర్జన్యం చేసి, కుర్చిలు విరగ్గొట్టి, వారిని గృహ నిర్బంధం చేసి భయభ్రాంతులకు గురి చేశారు. భయంతో మహిళలు కేకలు వేసినా, గర్భిణి ఉందని మొత్తుకున్నా ఖాతరు చేయలేదు.
గంటన్నర పాటు మహిళలు ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రాణ భయంతో పోలీసులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి ఆ మహిళలను విడిపించారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మహిళా వలంటీరు మొయ్యా దుర్గా భవాని కాకినాడ రూరల్ నియోజకవర్గం వినాయక కేఫ్ సమీపంలోని ఓ భవనంలో గురువారం ముందస్తు పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. ఈ వేడుకలకు ఆమె స్నేహితురాళ్లైన పలువురు మహిళా వలంటీర్లు హాజరయ్యారు. పుట్టిన రోజు కేకు, కూల్ డ్రింక్‌లు సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే హఠాత్తుగా 30 మందిని వెంట బెట్టుకుని కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) అక్కడకు వచ్చారు.
ఇక్కడ పార్టీ సమావేశం పెట్టుకుంటున్నారంటూ పెద్దగా కేకలు వేస్తూ వారిపై విరుచుకుపడ్డారు. పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటున్నామని చెబుతున్నా వినకుండా తలుపులు తన్నుకుంటూ లోపలకు వెళ్లి వీరంగం సృష్టించారు. దీంతో మహిళా వలంటీర్లు భయాందోళనలకు గురయ్యారు. తమతో పాటు గర్భిణి ఉన్నారని, ఆమె భయపడిపోతున్నారని, కేకలు వేయవద్దని బతిమిలాడారు. అయినా వారు వినలేదు. నానా రచ్చ చేసి, వలంటీర్లు కూర్చున్న కుర్చిలను ధ్వంసం చేశారు. మహిళా వలంటీర్లు లోపల ఉండగానే నానాజీ కనుసైగలతో ఆ పార్టీ కార్యకర్తలు గది తలుపులు మూసేసి గొళ్లేలు పెట్టేసి, భవనం కింది భాగంలోకి వెళ్లిపోయారు.
మహిళా వలంటీర్లు కిటికీల వద్దకు వచ్చి తలుపులు తీయాలని, ఊపిరి ఆడటంలేదని ఎంతసేపు అర్థించినా వినిపించుకోలేదు. జనసేన నాయకుల విధ్వంసంతో గర్భిణి నున్న చిట్టమ్మ గదిలోనే సొమ్మసిల్లి పడిపోవడంతో అంతా భయకంపితులయ్యారు. వారిలో ఒక వలంటీరు తన మొబైల్ ఫోను ద్వారా కాకినాడ డీఎస్పీ హనుమంతరావుకు సమాచారం అందించింది. దీంతో సర్పవరం సీఐ వైఆర్‌కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ అక్కడకు చేరుకున్నాయి. పోలీసులు తలుపులు తెరిచి మహిళా వలంటీర్లను విడిపించారు.
అక్కడ రాజకీయ పార్టీ సమావేశం జరుగుతోందంటూ పంతం నానాజీ పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆ కార్యాలయంలో రాజకీయ పార్టీకి సంబంధించి ఎటువంటి ఆధారాలూ లేవని ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్‌చార్జి బీబీబీ రాజు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీశామని, అన్ని వివరాలు రిటర్నింగ్ అధికారి ఇట్ల కిషోర్‌కు నివేదిస్తామని రాజు తెలిపారు.
పోలీసులకు ఫిర్యాదు
జనసేన నాయకుల దాడిపై రమణయ్యపేట కూరగాయల మార్కెట్ వీధికి చెందిన బాధిత వలంటీరు దుర్గాభవాని సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు జనసేన అభ్యర్థి పంతం నానాజీతో పాటు పలువురిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మహిళల గృహ నిర్బంధం, భయభ్రాంతులకు గురి చేయడం, మూకుమ్మడిగా వచ్చి దౌర్జన్యం చేశారనే అభియోగాలపై ఐపీసీ 143, 452, 341, 342, 506 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.
భయంతో వణికిపోయాం
ఒకేసారి మూకుమ్మడిగా వచ్చి పడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. నాకు ఏడో నెల. గర్భిణి అని కూడా కనీసం జాలి, కరుణ కూడా లేకుండా గదిలో నిర్బంధించి తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. ఏం జరుగుతుందోనని భయంతో వణికిపోయాం. తీవ్ర ఆందోళనతో సొమ్మసిల్లి పడిపోయాను. – నున్న చిట్టమ్మ, రమణయ్యపేట
మహిళలని కూడా చూడలేదు
జనసేన నాయకులు, కార్యకర్తలు అమానుషంగా ప్రవర్తించారు. పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటున్న వారు మహిళలని కూడా చూడకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారు. కుర్చీలు విరగ్గొట్టేశారు. అసలు ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే దౌర్జన్యం చేసి, తలుపు గడియ పెట్టేసి వెళ్లిపోయారు. ఏ రాజకీయ పార్టీ సమావేశం పెట్టుకోవడంలేదని ఎంత చెప్పినా వినలేదు. – కుసనం శాంతకుమారి, రమణయ్యపేట
పుట్టిన రోజు చేసుకుంటుంటే నిర్బంధించారు
నా పుట్టిన రోజు శుక్రవారం అయినప్పటికీ స్నేహితులందరూ అందుబాటులో ఉండరని చెప్పడంతో గురువారమే వేడుకలు చేసుకునేందుకు వారందరినీ ఆహా్వనించాను. కేకు తెచ్చుకొని పార్టీ సిద్ధమవుతుండగా ఒకేసారి గుంపుగా వచ్చిన జనసేన నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మా కార్యాలయం గది తలుపులు మూసేసి, గడియ పెట్టి నిర్బంధించారు. ఎంత వేడుకున్నా తలుపులు తీయలేదు. – మొయ్యా దుర్గాభవాని, రమణయ్యపేట, కాకినాడ రూరల్
Comments
Please login to add a commentAdd a comment