రైల్వే ప్రమాదాల పెరుగుదలపై కాగ్ ఆక్షేపణ
ఈ ఏడాది ఇప్పటికే 19 దుర్ఘటనలు
ట్రాక్‌ల నిర్వహణ నిధుల్లో కోత
కొత్త లైన్ల నిర్మాణానికి అరకొర నిధులతో సరి
రైల్వే శాఖ నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు
సాక్షి, అమరావతి: రైల్వేలను ఆధునికీకరిస్తున్నాం.. బుల్లెట్ రైళ్లు, హైస్పీడ్ రైళ్లు ప్రవేశపెడుతున్నాం.. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఘనమైన ప్రకటనలివి. అయినా.. దేశంలో రైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. దేశంలో రైళ్లు పట్టాలు తప్పి.. ప్రమాదానికి గురవుతున్న దుర్ఘటనలు గణనీయంగా పెరుగుతుండడంఆందోళన కలిగిస్తోంది.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు 19 రైళ్లు పట్టాలు తప్పిన ప్రమాదాలు సంభవించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. రైల్వే శాఖ ఘనమైన చర్యలు చేపడుతున్నా దేశంలో రైలు ప్రమాదాలు పెరుగుతుండటంపై కం్రప్టోలర్ ఆడిట్ జనరల్ (కాగ్) తీవ్రంగా ఆక్షేపించింది. కేంద్ర ప్రభుత్వం రైల్వే ట్రాక్‌ల నిర్వహణ, గేజ్ మార్పిడి, కొత్త లైన్ల నిర్మాణానికి కేటాయించే నిధుల్లో కోత విధిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
గాడి తప్పుతున్న రైళ్లు
నాలుగేళ్లుగా రైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురవుతున్న దుర్ఘటనలు పెరుగుతున్నాయి. 2021–22లో 27 ప్రమాదాలు సంభవించగా... 2022–23లో 36 చోట్ల రైళ్లు పట్టాలు తప్పాయి. ఒకే ట్రాక్ మీదకు ఎదురెదురుగా రైళ్లు వచ్చి ఢీకొన్న ప్రమాదాలు కూడా సంభవిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2021–22లో రెండు ప్రమాదాలు సంభవించగా.. 2022–23లో రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ప్రమాదాలు ఏకంగా ఆరు సంభవించాయి.
కొత్త లైన్ల నిర్మాణానికీ నిధుల తగ్గింపు
రైల్వే భద్రతకు కీలకమైన కొత్త లైన్ల నిర్మాణానికి నిధుల కేటాయింపును కూడా రైల్వే శాఖ క్రమంగా తగ్గిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా రైల్వే బడ్జెట్‌లో కనీసం 15 శాతం నిధులను కొత్త లైన్ల నిర్మాణానికి కేటాయించాలన్నది ప్రామాణికంగా నిర్దేశించారు. కానీ.. రైల్వే శాఖ మూడేళ్లుగా ఈ ప్రమాణాలను పాటించడం లేదు. 2022–23 బడ్జెట్‌లో 14.1 శాతం నిధులు కేటాయించగా.. 2023–24కు కొత్త రైల్వే లైన్ల నిర్మాణ నిధులను 10.3 శాతానికి తగ్గించారు.
ఇటీవల ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్‌లో కొత్త లైన్ల నిర్మాణం కోసం కేవలం 7 శాతం నిధులనే కేటాయించడం విస్మయం కలిగిస్తోంది. అదే విధంగా గేజ్ మారి్పడి కోసం మొత్తం బడ్జెట్‌లో కనీసం 3 శాతం నిధులు కేటాయించాలన్న ప్రామాణిక నిర్దేశం. రైల్వే శాఖ మాత్రం 2022–23లో 2 శాతం నిధులు కేటాయించగా.. 2023–24లో కేవలం 1.6 శాతం నిధులే కేటాయించారు.
ఇటీవల ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్‌లో కొద్దిగా పెంచి 1.8 శాతం నిధులతో సరిపెట్టారు. మరోవైపు కేటాయిస్తున్న అరకొర నిధులను కూడా రైల్వే శాఖ ఆయా పనులకు పూర్తిగా వెచ్చించడం లేదు. దాంతో రైల్వే ట్రాక్‌ల నిర్వహణ లోపభూయిష్టంగా మారి తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
వేధిస్తున్న నిర్వహణ వ్యయంతో
కోత రైళ్లు పట్టాలు తప్పి.. ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చి ప్రమాదాలు సంభవించడానికి 24 రకాల కారణాలు ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది. ఇందుకు ట్రాక్‌ల నిర్వహణ వ్యయంలో కోత, ట్రాక్‌ల నిర్వహణ ప్రమాణాల ఉల్లంఘన, రైల్వే కోచ్‌లు, వ్యాగన్ల నిర్మాణంలో నాణ్యత లోపాలు అత్యంత ప్రధానమైనవి. కాగా.. రైల్వే శాఖ కొన్నేళ్లుగా రైల్వే ట్రాక్‌ల నిర్వహణ వ్యయంలో కోత విధిస్తుండటం ఇటువంటి ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోంది.
2017–2021 వరకు రైళ్లు పట్టాలు తప్పిన ప్రమాదాల్లో 26 శాతం రైల్వే ట్రాక్‌ల నిర్వహణల లోపమే కారణమని కాగ్ నివేదిక వెల్లడించింది. ఇంత జరుగుతున్నా రైల్వే శాఖ నిర్లక్ష్యం వీడటం లేదు. రైల్వే ట్రాక్‌ల నిర్వహణ వ్యయంలో కోత విధించడాన్ని కొనసాగిస్తోంది. ఏటా రైల్వే బడ్జెట్ పెరుగుతోంది కానీ.. అందులో ట్రాక్‌ల నిర్వహణ వ్యయం వాటాను మాత్రం తగ్గిస్తుండటం గమనార్హం.
2022–23 రైల్వే బడ్జెట్‌రూ.1.2 లక్షల కోట్లు కాగా.. అందులో రైల్వే ట్రాక్‌ల రెన్యువల్, నిర్వహణ కోసం 13.5 శాతం నిధులు కేటాయించారు. కాగా.. 2023–24 రైల్వే బడ్జెట్ 1.5 లక్షల కోట్లకు పెరిగినా అందులోనూ రైల్వే ట్రాక్‌ల రెన్యూవల్, నిర్వహణ నిధులను 11 శాతానికి తగ్గించడం గమనార్హం. గత వారం ప్రవేశపెట్టిన 2024–25 రైల్వే బడ్జెట్‌లో 1.8 లక్షల కోట్లు కేటాయించారు. కానీ,, రైల్వే ట్రాక్‌ల రెన్యువల్, నిర్వహణ నిధులను కేవలం 9.7 శాతానికే పరిమితం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment