అనంతగిరి: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని కొత్తవలస–కిరండూల్ రైల్వేలైన్‌లో బొర్రా, కరకవలస మధ్య (82వ కిలోమీటర్ వద్ద) కొండ చరియలు జారిపడటంతో ఓహెచ్‌సీ విద్యుత్ స్తంభం, రైలు పట్టాలు దెబ్బతిన్నాయి. కేకే లైన్‌లో రెండోలైన్‌కు సంబంధించిన పనులు జరుగుతుండటంతో సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో 82వ కిలోమీటర్ వద్ద ఒక్కసారిగా కొండచరియలు జారిపడ్డాయి. దీంతో ఓహెచ్‌సీ విద్యుత్‌లైన్ స్తంభం విరిగిపడింది.
పట్టాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యుత్ సాంకేతిక సమస్య కారణంగా విశాఖపట్నం వెళుతున్న కిరండూల్ పాసింజర్ రైలును కొంతసేపు బొర్రా రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. సాంకేతిక సమస్య పరిష్కరించిన అనంతరం కిరండూల్ పాసింజర్ రైలు విశాఖపట్నం బయలుదేరింది. ఈ కారణంగా సోమవారం రాత్రి విశాఖ నుంచి కిరండూల్ వెళ్లే నైట్ ఎక్స్‌ప్రెస్ రద్దు చేశారు.
మంగళవారం కిరండూల్ నుంచి విశాఖపట్నం వెళ్లే నైట్ ఎక్స్‌ప్రెస్, అదే రోజు విశాఖ నుంచి కిరండూల్ వెళ్లే పాసింజర్, బుధవారం కిరండూల్ నుంచి విశాఖపట్నం వెళ్లే పాసింజర్ రైళ్ల రద్దు చేశారు. సోమవారం రాత్రి కిరండూల్ నుంచి విశాఖపట్నం వెళ్లే నైట్ ఎక్స్‌ప్రెస్ రైలు కోరాపుట్, దమంజోడి, రాయగడ, విజయనగరం మీదుగా విశాఖపట్నం చేరుకుంటుందని సీనియర్ డివిజన్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment