kothavalasa
-
విజయనగరం: కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం, ఆరుగురు మృతి
Train accident Updates ►ఘటనా స్థలానికి చేరుకున్న యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్.. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ ►సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ►రాయగడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల చేశారు. ►08912746330, 08912744619, 8106053051, 8106053052, 8500041670, 8500041671లకు సంప్రదించవచ్చు. ►ఘటనాస్థలానికి చేరుకున్న మంత్రి బొత్స సత్యనారాయణ. ►ఘటనా స్థలంలో పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాద స్థలికి విజయనగరం ఎస్పీ బయల్దేరారు. ఇప్పటి వరకు ముగ్గురు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ► రైలు ప్రమాదంలో ఒక బోగీలో చిన్నారులు ఇరుక్కుపోయారు. ఆర్తనాదాల మధ్య ప్రయాణికులు చీకటిలో చిక్కుకుపోయారు. ఎలక్ట్రికల్ సిబ్బంది, రైల్వే సహాయక సిబ్బంది, ఉన్నతాధికారులు ప్రత్యేక రైలులో ఘటనా స్థలికి చేరుకున్నారు. సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి రైలు ప్రమాదం జరిగింది. కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద పట్టాలపై ఉన్న విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలును పలాస-విశాఖ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రాయగడ ప్యాసింజర్ చివరి నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో అరుగురు మృతిచెందగా, పలువురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా ఓవర్ హెడ్ కేబుల్ తెగడంతో విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలపై నిలిచిపోయింది. ఆగిపోయిన ప్యాసింజర్ రైలును పలాస ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో సంఘటనా ప్రాంతం అంధకారంగా మారింది. కరెంట్ లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. -
రైలు పట్టాలపై జారిపడిన కొండ చరియలు
అనంతగిరి: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని కొత్తవలస–కిరండూల్ రైల్వేలైన్‌లో బొర్రా, కరకవలస మధ్య (82వ కిలోమీటర్ వద్ద) కొండ చరియలు జారిపడటంతో ఓహెచ్సీ విద్యుత్ స్తంభం, రైలు పట్టాలు దెబ్బతిన్నాయి. కేకే లైన్లో రెండోలైన్‌కు సంబంధించిన పనులు జరుగుతుండటంతో సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో 82వ కిలోమీటర్ వద్ద ఒక్కసారిగా కొండచరియలు జారిపడ్డాయి. దీంతో ఓహెచ్సీ విద్యుత్‌లైన్ స్తంభం విరిగిపడింది. పట్టాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యుత్ సాంకేతిక సమస్య కారణంగా విశాఖపట్నం వెళుతున్న కిరండూల్ పాసింజర్ రైలును కొంతసేపు బొర్రా రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. సాంకేతిక సమస్య పరిష్కరించిన అనంతరం కిరండూల్ పాసింజర్ రైలు విశాఖపట్నం బయలుదేరింది. ఈ కారణంగా సోమవారం రాత్రి విశాఖ నుంచి కిరండూల్ వెళ్లే నైట్ ఎక్స్‌ప్రెస్ రద్దు చేశారు. మంగళవారం కిరండూల్ నుంచి విశాఖపట్నం వెళ్లే నైట్ ఎక్స్‌ప్రెస్, అదే రోజు విశాఖ నుంచి కిరండూల్ వెళ్లే పాసింజర్, బుధవారం కిరండూల్ నుంచి విశాఖపట్నం వెళ్లే పాసింజర్ రైళ్ల రద్దు చేశారు. సోమవారం రాత్రి కిరండూల్ నుంచి విశాఖపట్నం వెళ్లే నైట్ ఎక్స్‌ప్రెస్ రైలు కోరాపుట్, దమంజోడి, రాయగడ, విజయనగరం మీదుగా విశాఖపట్నం చేరుకుంటుందని సీనియర్ డివిజన్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు. -
అగ్నిపథ్ ఆందోళనలతో నిలిచిన రైలు.. సమయానికి వైద్యం అందక వ్యక్తి మృతి
సాక్షి, విజయనగరం: త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు దేశ వ్యాప్తంగా హింసాత్మకంగా మారిన విషయం తెలిసింది. ఆర్మీ అభ్యర్థులు సృష్టించిన అల్లర్లు రూ.కోట్లలో ఆస్తినష్టాన్ని మిగల్చడమే కాకుండా పలుచోట్ల ప్రాణాలను కూడా బలితీసుకున్నాయి. అగ్నిపథ్ ఆందోళన నేపథ్యంలో కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను కొత్తవలసలో నిలిపివేయడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. గుండె జబ్బు చికిత్స కోసం ఒడిశా నుంచి వస్తున్న జోగేష్ బెహరా(70) అనే వృద్ధుడు మృతి చెందాడు. విశాఖలో రైల్వే స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు బెహరా కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే చికిత్స కోసం ఒడిశా నుంచి విశాఖకు అతని కుటుంబ సభ్యులు కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. అయితే అగ్నిపథ్ అల్లర్లతో విశాఖ వెళ్లాల్సిన రైలును అధికారులు కొత్తవలసలోనే నిలిపివేశారు. సమయానికి అంబులెన్స్ లేక కొత్తవలసలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేస్తుండగానే జోగేష్ బెహరా మృతి చెందారు. సమయానికి వైద్యం అందకనే జోగేష్ మృతిచెందాడని బాధితుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విశాఖలో రైల్వే స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు చదవండి: అగ్నిపథ్ ఆందోళనలు: ఏపీ ప్రభుత్వం అప్రమత్తం -
మేనకోడలితో వివాహేతర సంబంధం.. సినీఫక్కీలో భార్యను..
సాక్షి, కొత్తవలస (విజయనగరం): కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెం పంచాయతీ జోడిమెరక గ్రామానికి చెందిన గిరిజనుడు జోడు నాగరాజు(33)..భార్య లక్ష్మిని తానే హత్య చేసినట్లు పోలీసుల ముందు శుక్రవారం అంగీకరించాడు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. తెర్లాం మండలం ఉద్దవోలుకు చెందిన లక్ష్మిని ఎనిమిదేళ్ల క్రితం నాగరాజు ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ బాబు యశ్వంత్(7) ఉన్నాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన నాగరాజు ఆమెను తరచూ వేధిస్తూ వివాహేతర సంబంధాలు అంటగడుతూ అదే గ్రామానికి చెందిన వరుసకు మేనకోడలు మౌనికతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తలు నిత్యం గొడవలు పడుతుండడంతో గ్రామస్తులు పలుమార్లు పంచాయితీ నిర్వహించి నాగరాజును మందలించారు. చదవండి: (తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అమానుషం.. ఫొటోలు, వీడియోలు తీసి) సినీఫక్కీలో హత్యకు పథకం భార్య లక్ష్మి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న నాగరాజు పథకం రచించి జనవరి 28న రాత్రి 7.30గంటల సమయంలో లక్ష్మి స్వీట్‌షాప్‌లో విధులు ముగించుకుని వస్తుండడంతో దారిలో కాపుకాసి తీర్థానికి రావాలని అడిగాడు. దీంతో నమ్మిన ఆమె భర్త స్కూటీ ఎక్కింది. తొలుత ఏపీ మోడల్‌స్కూల్ వైపు తీసుకువెళ్లగా అనుమానం వచ్చి బండిపైనుంచి భార్య దూకి పారిపోయే ప్రయత్నం చేసింది. తిరిగి ఆమెను స్కూటీపై ఎక్కించి బలిఘట్టం రెవెన్యూ పరిధిలోగల అర్ధాన్నపాలెం దారిలో జీడి తోటలోకి తీసుకువెళ్లి తనకు విడాకులు ఇవ్వాలని నాగరాజు కోరగా ఆమె తిరస్కరించడంతో బలంగా తోసేశాడు. దీంతో ఆమె రాళ్లకుప్పపై పడి స్పృహ కోల్పోయింది. అదే అదునుగా రాయితో ఆమె తలపై కొట్టి హత్యచేసి అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా పక్కనే ఉన్న గోతిలో వేసి ఎండు పుల్లలు వేసి పెట్రోల్ పోసి తగుల బెట్టినట్లు నిందితుడు వాంగ్మూలంలో స్పష్టం చేశాడు. చదవండి: (సోషల్ మీడియా పరిచయం, పెళ్లి.. ఆ తర్వాతే అసలు కథ..) స్టేషన్ ముందు గ్రామస్తుల ధర్నా అభంశుభం తెలియని భార్య లక్ష్మిని వేధింపులకు గురిచేసి కిరాతకంగా హత్యచేసిన నాగరాజును ఉరితీయాలంటూ గ్రామస్తులు ధర్నాకు దిగారు. జోడిమెరక గ్రామ నుంచి గిరిజనులు నినాదాలు చేస్తూ కొత్తవలస పోలీస్‌స్టేషన్‌కు ర్యాలీగా చేరుకుని ఆందోళన చేశారు. -
స్వామిపేరు చెప్పి రూ.కోట్లు విలువైన భూమిని కొల్లగొట్టే స్కెచ్
పేరు దేవుడిది.. దందా రియల్ ఎస్టేట్ వ్యాపారులది. స్వామిపేరు చెప్పి రూ.కోట్లు విలువైన భూమిని కొల్లగొట్టే స్కెచ్ గీశారు. పచ్చని కొండను జేసీబీలతో ఇష్టారాజ్యంగా చదును చేసేస్తున్నారు. ప్లాట్లుగా మలిచే పనులను చకచకా పూర్తిచేస్తున్నారు. అధికారులు అడ్డుచెప్పినా ఫిరంగి కొండను కైంకర్యం చేసేపనులు సాగిస్తున్నారు. కొత్తవలసలో రెవెన్యూ పరిధిలో దేవుడి ముసుగులో సాగుతున్న భూదందాకు ‘సాక్షి’ అక్షరరూపం. సాక్షి ప్రతినిధి, విజయనగరం: కుక్కను చంపాలంటే దానికి పిచ్చికుక్క అని ముద్ర వేయాలి. అదే ప్రభుత్వ భూమిని కొట్టేయాలంటే ఆ పక్కనే కొంత స్థలంలో దేవుడికో గుడి కట్టాలి. అక్కడ విలువ పెరిగిన తర్వాత చుట్టుపక్కల ఉన్న స్థలాలను హాట్‌కేక్‌ల్లా అమ్మేసుకోవాలి. సరిగ్గా ఇదే ఫార్ములాను కొత్తవలసలో అక్రమార్కులు పక్కాగా ఫాలో అవుతున్నారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి ఫిరంగి కొండనే జేసీబీలతో దొలిచేస్తున్నారు. అక్కడ రేకుల షెడ్లో తాత్కాలికంగా దేవుడిని పెట్టారు. అక్కడికి కాస్త ఎగువన కొండపై గుడి నిర్మాణం ప్రారంభించారు. అదే సమయంలో పరిసరాలతో పాటు రోడ్డు వేసే పేరుతో రూ.20 కోట్ల విలువైన దాదాపు ఐదు ఎకరాల మేర ప్రభుత్వ స్థలాన్ని చదును చేసేశారు. ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని కలెక్టర్ ఎ.సూర్యకుమారి స్వయంగా హెచ్చరించినా అక్రమార్కులు తగ్గలేదు. తహసీల్దార్ దేవుపల్లి ప్రసాదరావు నేతృత్వంలో రెవెన్యూ అధికారులు ఆ మార్గంలోని కల్వర్టును ధ్వంసం చేయించారు. వారి ఆదేశాలనూ బేఖాతరు చేస్తూ అక్రమార్కులు ఆ పక్కనుంచే రోడ్డు నిర్మాణ పనులు చేసుకుపోతున్నారు. స్వామిపేరు చెప్పి భూ కైంకర్యం... కొత్తవలస రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 168లో దాదాపు 415.38 ఎకరాల విస్తీర్ణంలో ఫిరంగికొండ విస్తరించి ఉంది. గతంలో గిరిజన రైతులకు అక్కడ 150 ఎకరాల్లో డీ పట్టాలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరా రూ.5 కోట్ల వరకూ ధర పలుకుతోంది. దీంతో కొండపై వేంకటేశ్వర స్వామి గుడికడతాం అంటూ కబ్జాదారులు స్కెచ్ వేశారు. దీనికి కొత్తవలస రెవెన్యూ కార్యాయలంలోనే కొంతమంది సిబ్బంది యథాశక్తిగా సాయం అందించారు. దీంతో అర ఎకరంలో గుడి నిర్మాణ పనులు ప్రారంభించారు. దేవుడికి భారీ ప్రాంగణం ఉండాలని చెబుతూ పరిసరాల్లో దాదాపు 4.5 ఎకరాల వరకూ చదును చేసేశారు. ఆ తర్వాత ఆ భూమిని ప్లాట్లుగా వేసి సొమ్ము చేసుకోవాలనేది అసలు పన్నాగంగా తెలుస్తోంది. అనుమతుల్లేకుండా నిర్మాణాలు... వాస్తవానికి ఫిరంగికొండ పచ్చదనం పరచుకొని ఉంటుంది. ప్రకృతికి విఘాతం కలిగిస్తూ రోడ్లు, భవనాల వంటి నిర్మాణాలు చేపడితే పర్యావరణ నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. గుడి నిర్మాణమే అయినా సరే ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా పనులు చేయకూడదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా గుడి నిర్మాణం పనులు చేపట్టారు. రోడ్డు వేసేశారు. భారీ ఖర్చుతో కల్వర్టు కూడా నిర్మించారు. స్వాగతద్వారం ఏర్పాటు చేశారు. అధికారుల ఆదేశాలు బేఖాతరు... కలెక్టర్ ఎ.సూర్యకుమారి గత డిసెంబర్ 17వ తేదీన కొత్తవలస పర్యటనకు వచ్చినపుడు ఫిరంగికొండపై తవ్వకాలను చూశారు. వాటిపై ఆరా తీశారు. పర్యావరణ అనుమతులు ఉన్నాయా? పట్టాలు ఉన్నాయా? గుడి నిర్మాణం చేయడానికి టీటీడీగానీ, దేవాదాయ శాఖ గానీ అనుమతులు ఏమైనా ఇచ్చిందా? రెవెన్యూ అనుమతులు ఏమైనా ఉన్నాయా? అని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. అలాంటివేమీ లేకుండా పనులు ఎలా చేస్తున్నారంటూ ఆశ్చర్యపోయారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ భవానీశంకర్‌ను ఆదేశించారు. దర్జాగా నిర్మాణ పనులు... ఫిరంగి కొండపై చేస్తున్న పనులు నిలిపేసేందుకు తహసీల్దార్ ప్రసాదరావు, రెవెన్యూ సిబ్బంది జనవరి 18న కొండపైకి వెళ్లారు. కొండపైకి వెళ్లేందుకు నిర్మించిన రోడ్డు మార్గంలోనున్న కల్వర్టును జేసేబీతో ధ్వంసం చేయించారు. అక్కడ నిర్మాణ పనులు తక్షణం నిలిపేయాలని ఆదేశించారు. వీటిని అక్రమార్కులు బేఖాతరు చేశారు. కూలిన కల్వర్టు పక్కనే మళ్లీ రోడ్డువేసి పనులు చేస్తున్నారు. నీరుగారిన క్రిమినల్ కేసు... ఫిరంగి కొండను ఆక్రమించి తవ్వకాలు చేసినవారిపై, నిర్మాణాలు చేపట్టిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. గత తహసీల్దార్ రమణారావు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడంతో ముగ్గురిపై భూ ఆక్రమణ (ల్యాండ్ గ్రాబింగ్) కేసు నమోదైంది. వాస్తవానికి అసలు సూత్రధారులను వదిలేసి ఏదో తూతూమంత్రంగానే ఆ ఫిర్యాదు ఉందని ఇటు రెవెన్యూ వర్గాల్లోను, అటు స్థానికుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. రకరకాల పైరవీలతో ఈ కేసు కాస్తా నీరుగారిపోయింది. ఫిరంగి కొండ కాస్త కరిగిపోతోంది. ప్రభుత్వ స్థలాలకు ఎసరు... కొత్తవలస నుంచి గతంలో గిరిజన యూనివర్సిటీకి భూసేకరణ జరిగిన రెల్లి–గిరిజాల రోడ్డులో ఫిరంగి కొండ ఉంది. దీనికి దిగువన టీచర్స్ కాలనీ, ఎన్జీఓ కాలనీ ఉన్నాయి. అక్కడ ఎవరెవరికీ పట్టాలు ఇచ్చారో, ఇంకా మిగిలిపోయిన ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిపే రెవెన్యూ రికార్డు కాస్త అక్రమార్కుల చేతికి వచ్చింది. దాని ఆధారంగా వంద గజాలకు రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ధరకు ప్రభుత్వ స్థలాలను అమ్మేస్తున్నారు. ఇలా రికార్డు లీకేజీ వెనుక స్థానికంగా ఉన్న కొంతమంది రెవెన్యూ విశ్రాంత ఉద్యోగుల సహకారం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కల్వర్టును ధ్వంసం చేయించాం.. ఫిరంగి కొండ అంతా ప్రభుత్వ స్థలమే. అక్కడ అనుమతుల్లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి. అందుకే ట్రాక్టర్లు, జేసీబీలు కొండపైకి వెళ్లకుండా ఆ మార్గంలో కల్వర్టును ధ్వంసం చేయించాం. ఆ కల్వర్టును నిర్మించినదీ ఆక్రమణదారులే. దీనిపై పూర్తి నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు నివేదించాం. – దేవుపల్లి ప్రసాదరావు, తహసీల్దార్, కొత్తవలస -
చిరునవ్వుతో భర్తకు ఎదురెళ్లింది.. ఏమైందో తెలియదు.. కొద్ది నిమిషాల్లోనే..
పెళ్లి ముచ్చట తీరనేలేదు.. ఇంటిముంగిట కట్టిన తోరణాలు తొలగనేలేదు.. అన్యోన్యంగా జీవించే నవదంపతులు క్షణికావేశానికి గురయ్యారు. ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకరితర్వాత ఒకరు మృత్యుఒడికి చేరుకున్నారు. ఇరు కుటుంబాల్లో విషాదాన్ని నింపారు. సాక్షి, కొత్తవలస (విజయనగరం): జీవనోపాధికోసం బైక్‌పై బయలుదేరిన భర్తకు చిరునవ్వుతో ఎదురెళ్లిన భార్య.. ఏమైందో తెలియదు.. కొద్ది నిమిషాల్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని తనువు చాలించింది. ఈ వార్త తెలుసుకున్న భర్త సైతం భార్య మార్గంలోనే మృత్యుఒడికి చేరుకున్న విషాదకర ఘటన కొత్తవలస మండలం చీపురువలస గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తవలస మండలం చీపురువలస గ్రామానికి చెందిన కర్రి రాము (30) జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. రాము తల్లి ఈశ్వరమ్మ అనారోగ్యంతో మృతిచెందడంతో తండ్రి అప్పారావు, చెల్లి కనకలు, బావ అప్పారావు కలిసి ఒకే ఇంటిలో నివసిస్తున్నారు. ఈ ఏడాది జూలై 1న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన కొండల వెంకటహేమదుర్గ(29)తో రాము వివాహం జరిగింది. ఇద్దరూ అన్యోన్యంగానే జీవించేవారు. కూలి పనులు చేసుకుంటూ ఉన్నంతంలో సర్దుకుపోతూ ఆనందంగా గడిపేవారు. ఈ జంటను చూసి గ్రామస్తులు ముచ్చటపడ్డారు. శనివారం ఉదయం 9 గంటల సమయంలో భర్తతో పాటు ఆడపడుచు భర్త అప్పారావు బైక్‌పై విధులకు వెళ్లే సమయంలో హేమదుర్గ చిరునవ్వుతో ఎదురొచ్చింది. అనంతరం మేడపైకి వెళ్లి ఎంతసేపటికీ కిందకి రాకపోవడంతో పిలిచేందుకు ఆడపడుచు వెళ్లింది. అప్పటికే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండడాన్ని గమనించింది. ఇరురుపొరుగువారిని పిలిచి వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. చదవండి: (విషాదం: పెళ్లి విషయంలో ధైర్యం చూపారు.. బతికే విషయంలో తెగువ చూపలేక..) తమ్ముడు,మరదలు చనిపోవడంతో విలపిస్తున్న రాము అక్క లక్ష్మి సెల్‌ఫోన్ వల్లేనా? హేమదుర్గ పెళ్లికి ముందు పెద్దాపురంటౌన్‌లోని 8వ వార్డు వలంటీరుగా పనిచేసేది. వివాహానంతరం మానేసింది. విషయం తెలియని అక్కడి గ్రామస్తులు ఏదో ఒక సమస్య చెప్పేందుకు తరచూ ఫోన్లు చేసేవారు. విధులు మానేశాక కూడా ఫోన్లు రావడంతో సున్నిత మనస్కుడైన రాము సిమ్‌ను తీసేయాలని హేమకు సూచించాడు. ఇదే క్రమంలో ఈనెల 23న దంపతులిద్దరూ పెద్దాపురం వెళ్లినప్పుడు సెల్‌సిమ్ మార్చమని బావమరిది జగదీశ్వరరావుకు రాము చెప్పాడు. ఆయన వద్దే సెల్ వదిలి వీరిద్దరూ ఈ నెల 27న తిరిగి చీపురువలస చేరుకున్నారు. ఎప్పటిలాగే కలసిమెలసి ఉన్న హేమదుర్గ భర్తను విధులకు సాగనంపి ఆత్మహత్యకు పాల్పడింది. చెల్లి ద్వారా విషయం తెలుసుకున్న రాము మనస్థాపానికి గురయ్యాడు. తను కూడా చనిపోతానంటూ స్నేహితులకు ఫోన్లో తెలిపి స్విచ్ఆఫ్ చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆయన కోసం రెండుగంటల పాటు వెతికారు. చివరకు ఉదయం 11 గంటల సమయంలో చీపురువలస గ్రామ సరిహద్దుల్లో ఉన్న దాట్లాహోం వద్ద కాగుచెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న సీఐ బాలసూర్యారావు, ఎస్సై జనార్దన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాలను పరిశీలించారు. తహసీల్దార్ రమణారావు, సర్పంచ్ మచ్చ ఎర్రయ్యస్వామి, గ్రామపెద్దల సమక్షంలో ఇద్దరి మృతదేహాలకు శవ పంచనామా చేసి పోస్టుమార్టం కోసం ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. హేమదుర్గ సోద రుడు జగదీశ్వరరావు (పెద్దాపురం) సెల్‌ఫోన్ విషయమై గొడవలు పడుతున్నారని ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. -
ఇక బోరుబావుల్లో పడ్డ చిన్నారులు సురక్షితం!
కొత్తవలస (శృంగవరపుకోట): ఎక్కడో చోట బోరుబావుల్లో చిన్నారులు పడిపోవడం.. వారికోసం అంతా హైరానా పడటం అందరికీ తెలిసిందే. బోరుబావుల్లో పడ్డ చిన్నారులను కొన్నిసార్లు రక్షిస్తున్నా.. మరికొన్నిసార్లు వారిని కాపాడుకోలేకపోతున్నాం. ఈ సమస్యకు విజయనగరం జిల్లాకు చెందిన యువ ఇంజనీర్ కురుమోజు శరత్ చంద్ర పరిష్కారం చూపాడు. అతడు చదివింది ఈఈఈలో డిప్లొమా మాత్రమే అయినా తన మేధస్సుతో బోర్వెల్ చిల్డ్రన్ లిఫ్టింగ్ మెషిన్‌ను రూపొందించాడు. ఈ యంత్రంతో 20 అడుగుల లోతులో పడ్డవారిని వెంటనే వెలికి తీయొచ్చని చెబుతున్నాడు. దీనికి మరింత సాంకేతికత జోడిస్తే 300 నుంచి 500 అడుగుల లోతులో ఉన్నవారినైనా రక్షించవచ్చని అంటున్నాడు. వివరాల్లోకెళ్తే.. ► కొత్తవలస మండలం తుమ్మికాపల్లికి చెందిన శరత్ చంద్ర తల్లి అతడి చిన్నతనంలోనే మరణించడంతో అమ్మమ్మ దగ్గర పెరిగాడు. ► పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయ్యాక చిన్న ఉద్యోగం చేసినా లాక్‌డౌన్‌తో జీవనోపాధిని కోల్పోయాడు. ► దీంతో రోజూ కూలి పనులకు వెళ్లి ఆ ఆదాయంతోనే బతుకీడుస్తున్నాడు. అందులో కొంత డబ్బును వెచ్చించి మెషిన్‌ను తయారుచేశాడు. యంత్రం పనితీరు ఇలా.. ► బోరుబావి సైజును బట్టి మూడు ప్రత్యేక మోటార్ల సాయంతో ఈ యంత్రం పనిచేస్తుంది. ► సీసీ కెమెరా, ఎల్ఈడీ లైట్లతోపాటు మానిటర్‌కు అనుసం«ధానమై ఉంటుంది. ఇది సీకాట్ కేబుల్ సాయంతో పనిచేస్తుంది. ► బోరుబావిలో చిన్నారులు పడ్డప్పుడు గేర్‌వైర్ సాయంతో బావిలోకి దింపిన యంత్రం బాలుడిని మూడు మర చేతులతో పట్టుకుంటుంది. ► పై నుంచి నియంత్రించేందుకు సీసీ మానిటర్ నుంచి దీన్ని ఆపరేట్ చేస్తారు. ► విద్యుత్ ఆగిపోయినా, సాంకేతిక ఇబ్బందులు తలెత్తినా చిన్నారిని మాత్రం వదలకుండా పట్టుకుని ఉండటం ఈ యంత్రం ప్రత్యేకత. ► అంతేకాకుండా చిన్నారికి ఆక్సిజన్‌ను అందించే సదుపాయాన్ని ఇందులో అమర్చవచ్చు. ► తన యంత్రాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థలు ఆర్థిక సాయం అందించాలని శరత్ కోరుతున్నాడు. -
కొత్తవలసలో కుప్పకూలిన ప్రభుత్వ కాలేజ్ భవనం
-
కొత్తవలసలో కుప్పకూలిన ప్రభుత్వ కాలేజ్ భవనం
సాక్షి, విజయనగరం : జిల్లాలోని కొత్తవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం కుప్పకూలింది. గత మూడు రోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భవనం కుప్పకూలినట్టుగా తెలుస్తోంది. అయితే విద్యార్థులకు దసరా సెలవులు ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. భవనంలో కొంత భాగం కూలిపోగా.. మిగతా భాగం కూడా నెలకొరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గోడలు చాలా వరకు బీటలు వారి ఉన్నాయి. భవనం శిథిలావస్థకు చేరకున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇలా జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నిండు గర్బిణిని డోలీలో తీసుకెళ్లారు!
సాక్షి, విజయనగరం: గర్బిణికి పురిటినొప్పులు రావడంతో ఆమెను డోలీపై ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ దయనీయ సంఘటన వీ.మాడుగుల మండలం శంకరం పంచాయతీ కొత్తవలసలో ఆదివారం చోటుచేసుకుంది. కొత్తవలస గ్రామానికి చెందిన గర్బిణీ జనపరెడ్డి దేవీకి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. కానీ ఆ గ్రామంలో రోడ్డు సదుపాయం లేకపోవడంతో బంధువులు 15 కిలోమీటర్లు డోలీలో తీసుకెళ్లి కేజేపురం ఆసుపత్రికి చేర్పించారు. అక్కడ ఆమె ఆడపిల్లను ప్రసవించింది. కాగా సరైన సమయానికి ఆసుపత్రికి చేరుకోవడంతో తల్లీబిడ్డలిద్దరికీ ప్రమాదం తప్పింది. కొత్తవలస నుంచి శంకరం వరకు రోడ్డు సదుపాయం లేదు. దీంతో గిరిజనులు అత్యవసర సమయాల్లో డోలీని ఆశ్రయించక తప్పని పరిస్థితి. ఎవరికైన ఆపద వస్తే వారి బంధువులే డోలీ కట్టి, అందులో వారిని కూర్చుండబెట్టి కిలోమీటర్లు నడక సాగించి ఆసుపత్రికి చేరుస్తున్నారు. కొన్నిసార్లు అత్యవసర వైద్యం అందక దారి మధ్యలోనే మృత్యువాత పడ్డ సంఘటనలు ఉన్నాయి. కాగా అక్కడి గిరిజనులు రోడ్డు సదుపాయం కల్పించాలని అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాలేదు. -
జనసంద్రమైన కొత్తవలస
-
అందుకే సిట్ నివేదిక బయటపెట్టడం లేదు
విజయనగరం: విశాఖపట్నం జిల్లాలో రూ.2500 కోట్ల భూ కుంభకోణం జరిగిందని పోరాటాలు చేస్తే సిట్ దర్యాప్తు చేసి సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఇచ్చిందని, మరి ఆ నివేదిక ఎందుకు బయటపెట్టలేదో సీఎం సమాధానం చెప్పాలని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. సిట్ ఇచ్చిన నివేదికలో అధికార పార్టీ నేతలు ఉన్నారని..అందుకే నివేదిక బయటపెట్టడం లేదని వ్యాఖ్యానించారు. ఈ నెల 10వ తేదీ లోపు విశాఖ భూకుంభకోణంపై సిట్ నివేదిక బయటపెట్టాలని లేకపోతే అదే రోజు 4 గంటలకు కబ్జాదార్ల పేర్లు బయటపెడతామని హెచ్చరించారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం బలిఘట్టం గ్రామంలో శుక్రవారం రామకృష్ణ వివాదాస్పద భూములను పరిశీలించారు. బలిఘట్టం గ్రామంలో రూ.500 కోట్ల విలువైన 91 ఎకరాల భూమి ఆక్రమణలకు గురైందని వాఖ్యానించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిథులు కలిసి ఈ భూ కుంభకోణంలో భాగాస్వాములుగా ఉన్నారని చెప్పారు. 2008లో ప్రభుత్వ భూమిని ట్యాంపరింగ్ చేసింది అప్పటి జాయింట్ కలెక్టర్ జగన్మోహన్నేని చెప్పారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. -
మోటారు సైకిల్ దొంగ అరెస్టు
కొత్తవలస: రైల్వేకి చెందిన మోటార్‌సైకిల్‌స్టాండులో మోటార్‌సైకిల్‌ను దొంగిలించిన వారిని పట్టుకుని మంగళవారం అరెస్టుచేసి కొత్తవలస కోర్టుకు తరలించినట్లు ఎస్ఐ కె.నీలకంఠం తెలిపారు. విశాఖపట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నెలరోజులక్రితం మండలంలో కంటాకలిల్లి గ్రామానికి వెళు్తండగా రైల్వేస్టేషన్‌వద్ద మెటార్‌సైకిల్ పార్కుచేసి వెళ్లారు. తిరుగుప్రయాణంలో తమ మోటార్‌సైకిల్ కనిపించకపోవడతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి తాము వాహనాలు తనిఖీ చేస్తుండగా చేస్తుండగా మోటార్‌సైకిల్‌తో పాటు దొంగకూడా దొరికాడని తెలిపారు. మండలంలో అప్పన్నదొరపాలెంకు చెందిన జోడి గణేష్(19) దొంగతనానికి పాల్పడినట్లు తాముచేసిన దర్యాప్తులో తేలిందన్నారు. ఈ మేరకు అరెస్టుచేసి కొత్తవలస కోర్టులో హాజరుపరిచామన్నారు. అగ్ని ప్రమాదాలపై అవగాహన కొత్తవలస: పెట్రోల్ బంకుల్లో అగ్నిప్రమాదాలు జరిగితే తీసుకోవలసిన చర్యలు గురించి అగ్నిమాపక సిబ్బంది మంగళవారం అవగాహన కల్పించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న వాసవీ ఫిల్లింగ్‌స్టేషన్ వద్ద పెట్రోల్‌బంకులో పనిచేస్తున్న సిబ్బందికి అవగాహన కల్పించారు. పెట్రోల్‌బంకు పరిసరాలలో సిగరెట్లు తాగడం, సెల్ఫోన్లు వినియోగించరాదని తెలిపారు.బంకుల్లో ముందుజాగ్రత్త చర్యగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. -
కారుచౌకగా ‘పతంజలి’కి 172 ఎకరాలు
కలెక్టర్ నిర్ణయించిన ధర ఎకరానికి రూ.9.63 లక్షలు ఎకరా రూ.3 లక్షలకే ఇస్తూ జీవో జారీ సాక్షి, అమరావతి: పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్‌కు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చిన్నారావుపల్లిలో కారుచౌకగా 172.84 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో ఇచ్చింది. కలెక్టర్ నేతృత్వంలోని సాంకేతిక కమిటీ ఈ భూమిని ఎకరానికి రూ.9.62 లక్షలకు విక్రయించాలని ప్రభు త్వానికి సిఫార్సు చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం ఎకరానికి రూ.3 లక్షలకే ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. పతంజలికి ఇచ్చే భూమిలో కొంత ప్రభుత్వ, మరికొంత అసైన్డ్ భూమి ఉంది. అసైన్డ్ భూమికి రైతుకు కలెక్టర్ నిర్ణయించిన ధర చెల్లిస్తారు. ఈ మేరకు పతంజలి ఇచ్చే రూ.3 లక్షలు పోను, మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ప్రభుత్వ కార్యదర్శి బి.శ్రీధర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పతంజలి సంస్థ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని ప్రతిపాదనలు పంపింది. ఆయుర్వేద ఉత్పత్తులతో కూడిన ఈ ప్రాజెక్టుతో 6 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వానికి తెలిపింది. అలాగే వైష్ణవి మెగా ఫుడ్ పార్క్‌కు చిత్తూరు జిల్లా పెద్దూరు వద్ద 100 ఎకరాలు కేటా యిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది. ఈ భూమిని ఏపీఐఐసీ ద్వారా ఎకరాన్ని రూ.1.50 లక్షలకు విక్రయించాలని పేర్కొంది. ఎకరా భూమిని రూ.2.93 లక్షలకు కేటాయించాలని ఏపీఐఐసీ సిఫార్సు చేసినా ప్రభుత్వం ఎకరాన్ని రూ.1.50 లక్షలకే కేటాయించింది. -
అరకు అందాలు 'డబ్లింగ్'
రైల్లో అరకు ప్రయాణం.. ఓ అందమైన అనుభవం. కొండలెక్కుతూ.. గుహల్లోంచి సాగిపోతూ.. ఒంపులు తిరిగి ప్రయాణించే కిరండూల్ పాసింజర్ ఎన్నో అనుభూతుల కలబోత. అయితే కేకే లైన్లో రోజుకు ఒక్క రైలే తిరుగుతుంది. ఆ రైలు మిస్సయితే మళ్లీ మర్నాడు ఉదయం వరకు ఆగాల్సిందే. ఐదు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే ఈ రైల్లో వివిధ పనుల మీద విశాఖ వచ్చే ప్రయాణికులూ ఎక్కువే. ఈ లైన్ మీదుగా సాగే రవాణాయే ప్రధాన ఆదాయ వనరన్న సంగతి తెలిసిందే. అందుకే మరిన్ని రైళ్లు తిరిగేందుకు వీలుగా మరో లైన్ నిర్మించాలన్నది చిరకాల డిమాండ్. ఈ కలను నిజం చేస్తూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ రెండో రైల్వే లైన్‌కు ఆమోదముద్ర వేసింది. కేకే రైల్వే మార్గంలో రెండో లైన్ వేసేందుకు ఆమోదం పెరగనున్న రవాణా సదుపాయం.. పర్యాటకానికి ఊతం విస్టాడూమ్ బోగీ వచ్చే మార్చిలో.. విశాఖపట్నం : కొత్తవలస-కిరండూల్ రైల్వే మార్గానికి మహర్దశ పట్టనుంది. ఇప్పటి వరకు వెళ్లే రైలు.. వచ్చే రైలు మాత్రమే ప్రయాణించే ఈ మార్గంలో డబ్లింగ్ పనులకు కేంద్రం బుధవారం పచ్చజెండా ఊపడంతో రైల్వే ట్రాఫిక్ ఇకపై ఈ మార్గంలోనూ పెరగనుంది. ఇప్పుడున్న ఒకే ఒక్క ప్యాసింజర్ స్థానంలో రానున్న రోజుల్లో మరిన్ని రైళ్లు నడిపే అవకాశాలున్నాయి. ప్రకృతి ప్రేమికుల కోసం విస్టా డూమ్ బోగీని ఈ మార్గంలో నడుస్తున్న అరకు ప్యాసింజర్‌కు జత చేసేందుకు ఇప్పటికే తూర్పు కోస్తా రైల్వే ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం ఈ అధునాతన పర్యాటక బోగీ వచ్చే మార్చినాటికి రానుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆ బోగీ ఒక్కటే కాదు. డబ్లింగ్ పనులు వచ్చే ఏడేళ్లలో పూర్తయితే మరిన్ని రైళ్లు అరకు, కోరాపుట్, జగదల్పూర్ వరకు నడిచే అవకాశాలున్నాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రా రాష్ట్రాలకు చెందిన మారుమూల గిరిజన గ్రామాల నుంచి విశాఖ వచ్చే ప్రజలకు ఈ కొత్త రైళ్లు ఎంతో ఉపయోగపడతాయి. విద్య, వైద్యం కోసం అక్కడి నుంచి వచ్చే వారెందరో ఉన్నారు. దక్షిణాదిన ప్రకృతి సౌందర్యరాశిగా ప్రఖ్యాతిగాంచిన అరకు అందాలను తనివితీరా చూడాలనుకునే రైల్వే మార్గమిది. ఎత్తయిన కొండలను చీల్చుకుంటూ...కొండ గుహల్లోంచి దుముకుతూ... కాల్వలు, సెలయేళ్లు, నదులను అమాంతంగా దాటేస్తూ... పిల్ల పర్వతాల నుంచి తల్లి పర్వతాల మీదకు ఎగబాకుతూ చూపరులను కట్టి పడేసే దృశ్యాలతో ఈ మార్గం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సాధారణంగా 100 కిలోమీటర్ల దూరాన్ని రెండు గంటల్లోనే రైళ్లు చేరుకుంటుంటే ఈ మార్గంలో మాత్రం నాలుగు గంటలైనా ప్రయాణికులు ఏ మాత్రం విసుగు చెందరు. సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులోంచి ప్రయాణించే ఈ రైలులోంచి అంతా ఎంతో ఆసక్తితో చూస్తుంటారు. ప్రకృతి ప్రేమికులు కెమెరా పట్టుకుని, సెల్ఫోన్లో సెల్ఫీలు దిగుతూ గుహల్లోంచి రైలు దూసుకుపోయే ప్రతిసారీ అరుపులతో సందడి చేస్తుంటారు. ఈ రైల్వే మార్గాన్ని 1974-76 మధ్య కాలంలో ప్రారంభించారు. అరకు అందాలను రైల్లోంచే చూసేందుకు పర్యాటకులు ఇష్టపడుతుంటారు. ఈ రైల్వే లైన్ బంగారు బాతు కొత్తవలస-కిరండూల్ రైల్వే లైన్ అంటే తూర్పు కోస్తా రైల్వేకి బంగారు బాతులాంటిది. పెద్దగా ఖర్చు పెట్టకుండానే ఏటా రూ. 5 వేల కోట్ల ఆదాయాన్నిచ్చే ఈ మార్గం అంటే భారతీయ రైల్వేకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్యాసింజర్ రైలు ఒక్కటే రోజుకు రాకపోకలు సాగిస్తుంది. మిగిలిన రోజంతా ఈ మార్గంలో సరకు రవాణా రైళ్లే తిరుగుతుంటాయి. దాదాపు 463 కిలోమీటర్ల మేర సింగిల్ ట్రాక్‌తోనే భారీ ఎత్తున ఆదాయం సమకూరుస్తున్న ఈ మార్గంలో భారీ వర్షాలు కురిసినప్పుడు రైల్వే ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఒకే ట్రాక్ కావడంతో ఈ సమస్య ఉంది. అందుకే ఎప్పటి నుంచో డబ్లింగ్ చేయాలని వాల్తేరు రైల్వే, తూర్పు కోస్తా రైల్వేలు ప్రభుత్వానికి నివేదిస్తున్నాయి. ఎట్టకేలకు ఈ నివేదికలకు మోక్షం కలిగింది. డబ్లింగ్‌కు రూ.7,178 కోట్లు కొత్తవలస-కిరండూల్ రైల్వే మార్గాన్ని (కేకే లైన్) డబ్లింగ్ చేసేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ బుధవారం ఆమోదముద్ర వేసింది. గత రైల్వే బడ్జెట్లో ప్రకటించిన ఈ రైల్వే లైన్ ఆధునికీకరణకు ఆర్థిక వ్యవహారాల మంత్రి త్వ శాఖ పచ్చజెండా ఊపడంతో సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ మార్గం డబ్లింగ్ అయ్యే అవకాశాలున్నాయి. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ రైల్వే మార్గం ఆధునికీకరణకు రూ.7,178.40 కోట్ల మొత్తా న్ని కేంద్రం ప్రకటించింది. కిరండూల్-జగదల్పూర్ మధ్య కొన్ని కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులు పూర్తయిన నేపథ్యంలో జగదల్పూర్ నుంచి కొత్తవలస మధ్య నూతన రైల్వే మార్గాన్ని అదనంగా నిర్మించాల్సి ఉంది. దాదాపు 463 కిలోమీటర్ల మేర కొత్త మార్గాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో ఒకే ఒక్క ప్యాసింజర్ రైలు (1వీకే/2వీకే) రోజుకు నడుస్తుండగా సరకు రవాణా రైళ్లు మా త్రం 12 వరకు నడుస్తున్నాయి. ప్రధానంగా ఈ మార్గం ద్వారా ఐరన్ ఓర్, బొగ్గు రవాణా చేస్తుంటాయి. వచ్చే ఏడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేకే లైన్ విశేషాలు జగదల్పూర్-కోరాపుట్ మధ్య 110 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మించడానికి రూ.1,839 కోట్లు కేటాయించారు. ఈ మార్గం పూర్తిగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనే ఉంది. ఐరన్ ఓర్, బొగ్గు రవాణా ప్రధాన ఆదాయ మార్గం. కోరాపుట్-సింగపూర్ మధ్య 164 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించడానికి రూ.2,361 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఒడిశాలోని కోరాపుట్, రాయగడ జిల్లాలకు ప్రయోజనం ఉంటుందని అంచనా వేశారు. ఈ మార్గంలో మినరల్స్ అండ్ మైన్స్ ఎగుమతికి అవకాశాలుంటాయని ప్రభుత్వం గుర్తించింది. కోరాపుట్-కొత్తవలస మధ్య 189 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 2977 కోట్లు కేటాయించారు. ఈ మార్గం నిర్మించడం వల్ల ఒడిశాలోని కోరాపుట్ జిల్లాతోపాటు ఆంధ్రాలోని విజయనగరం, విశాఖ జిల్లాలకు ప్రయోజనం ఉంటుందని అంచనా వేశారు. ఈ మొత్తం ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఏడేళ్ల సమయం పడుతుందని, అందుకు 12, 13 ఆర్థిక ప్రణాళికల నుంచి నిధులు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. -
కొత్తవలస- కోరాపుట్ డబ్లింగ్ పనులకు ఓకే
న్యూఢిల్లీః విజయనగరం జిల్లా కొత్తవలస - ఒడిశాలోని కోరాపుట్ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కొత్తవలస-కోరాపుట్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. 189.278 కి.మీ. పొడవైన ఈ మార్గంలో రూ. 2977.64 కోట్ల అంచనా వ్యయంతో డబ్లింగ్ పనులు చేపడతారు. ఈ డబ్లింగ్ పనుల వల్ల ఆయా ప్రాంతాల మధ్య సరుకు రవాణా సులభతరం కావడమే కాకుండా రైల్వే ఆదాయం పెరుగుతుంది. ఈ పనులు వచ్చే ఏడేళ్లలో పూర్తవుతాయని అంచనావేసింది. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది. ఈ జిల్లాల మధ్య వివిధ రకాల ఖనిజాలు, ముడిసరుకు, ఇతర వస్తు రవాణా అవసరాలు పెరుగుతున్నందున కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. -
పేదల కోసం ఉచిత గ్యాస్ పథకం
కొత్తవలస(లక్కవరపుకోట): దారిద్య్ర రేఖ దిగువన ఉన్న కు టుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ వ ర్తింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం రూపొందించిందని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు కె.హరిబాబు తెలి పారు. కొత్తవలస మండలంలో ఆది వారం జరిగిన ఓ కార్యక్రమంలో పా ల్గొన్న ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఈ ఉచిత గ్యాస్ పథకం రా ష్ర్టంలోని 13 జిల్లాల వారికి వర్తిస్తుందని అన్నారు. పథకం ప్రకారం గ్యాస్ కనెక్షన్ పొందేందుకు దారిద్య్ర రేఖ దిగువన ఉన్నట్లు తెలిపే ధ్రువీకరణ పత్రం, ఆధార్, రేషన్ కార్డు జిరాక్సులు, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను సమీపంలోని గ్యాస్ డీలర్లకు అందించాలని సూచిం చారు. పథకం గురించి గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని స్థానిక ఎమ్మెల్యే లలితకుమారి, టీడీపీ, బీజేపీ నాయకులకు సూచించారు. ఆడపిల్లలను చదివించండి వేములాపల్లి(శృంగవరపుకోట): ఆడపిల్లలను ఉన్నత విద్యావంతుల్ని చేయాలని విశాఖ ఎంపీ హరిబాబు కోరారు. వేములాపల్లి గ్రామంలో ఆదివారం ‘మన విలే జెస్’ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో స్వచ్ఛ భారత్ నిర్వహించాలని, మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఐఎస్ఎల్ నిర్మాణానికి రూ.1000ల ఆర్థిక సాయం అందిస్తామని సంస్థ ప్రతినిధులు చేసిన ప్రకటనపై ఎంపీ స్పందిస్తూ ఆర్థిక పరిస్థితి గుర్తించి ఆ మొత్తాన్ని పెంచాలని కోరా రు. గ్రామంలో పన్నెండేళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ జన్‌ధన్‌యోజన ఖాతాలు తెరవాలని అధికారులను కోరారు. గ్యాస్ కనెక్షన్లు లేని వారికి తెల్లరంగు రేషన్‌కార్డు ఉన్నవారికి ప్రభుత్వం పూర్తి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తుందని ప్రకటించారు. కార్యక్రమంలో ఎస్.కోట నియోజక వర్గ బీజేపీ ఇన్చార్జి రఘురాజు, మన విలేజెస్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు డా క్టర్ బురిడి నాగభూషణం, డాక్టర్ జి.పద్మ సంపూర్ణ కళ్యాణి, డాక్టర్ జి.కాశీపతిరాజు, తహశీల్దార్ రాములమ్మ, ఎంపీడీఓ గౌరీశంకర్ తదితరులు మాట్లాడారు. అనంతరం సంస్థ సభ్యులు ఏర్పా టు చేసిన దుప్పట్లు, దుస్తులు గ్రామస్తులకు ఎంపీ అందించారు. అనంతరం పలువురు నేతలను సత్కరించారు. ‘ఆంధ్రను అగ్రరాష్ట్రం చేస్తాం’ శృంగవరపుకోట : ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నింటా అగ్రగామిగా చేస్తామని విశాఖ ఎంపీ హరిబాబు అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక గౌరీ సేవా సంఘం కల్యాణ మండపంలో బీజేపీ ఎస్.కోట నియోజకవర్గ ఇన్చార్జ్ రఘురాజు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి హరిబాబు ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వాలను సమీక్షించారు. బీజేపీని అతిపెద్ద పార్టీగా నిలబెట్టేందుకు కృషి చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టును తెలంగాణ వ్యతిరేకించినా ప్రధాని భాద్యతీ తీసుకుని క్లియరెన్స్ ఇచ్చారన్నారు. రాష్ట్రానికి ఐఐటీ, ఎ.ఐ.ఎం.ఎస్, ఐఐఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థలు కేటాయించారని తెలిపారు. అలాగే జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. లక్కవరపుకోటను దత్తత తీసుకుని స్మార్ట్ విలేజ్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. -
లిఫ్ట్ ఇచ్చిన పాపానికి..
కొత్తవలస: తెలిసిన వ్యక్తే కదా అని కారు ఆపి లిఫ్ట్ ఇచ్చిన పాపానికి కారులో ఎక్కిన వ్యక్తే పౌల్ట్రీవ్యాపారి గొంతుకోసి రూ.రెండు లక్షల 50వేలతో పరారయ్యాడు. ఇందుకు సంబంధించి కొత్తవలస ఎస్సై ఎస్.ధనుంజయరావు బుధవారం విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖజిల్లా సబ్బవరం మండలం గుల్లిపల్లి గ్రామానికి చెందిన దాసరి వెంకటసత్యనారాయణ (47)అలియాస్ గుల్లిపల్లి వెంకటరావు, కొత్తవలస మండలం లోని నిమ్మలపాలెం గ్రామంలో కోళ్లఫారంతోపాటు స్టాక్‌పాయింట్ నిర్వహిస్తున్నారు. ఈ స్టాక్పాయింట్నుంచి కొత్తవలస ప్రాంతంలో చికెన్ సెంటర్లకు కోళ్లు పంపిణీచేసి వారంలో మూడుపర్యాయాలు వసూళ్లకు వచ్చి తిరిగి గుల్లిపల్లి వెళ్తుంటారు. మంగళవారం యథావిధిగా తన డస్టర్ వాహనంలో వసూళ్లకు వచ్చి రాత్రి పదిగంటల సమయంలో ఇంటికి వెళ్తుండగా నిమ్మలపాలెం గ్రామానికి చెందిన నాయుడు రైల్వేగేట్ సమీపంలో సబ్బవరంరోడ్డులో ఉండి లిఫ్ట్ అడిగాడు. పాతపరిచయం ఉన్న వ్యక్తి అడగడంతో అతనిని కారులో ఎక్కించుకున్నారు. మండలంలోని సంతపాలెం పంచాయతీ శివారు రెల్లి కాలనీ దాటగానే కానావద్ద కారు స్లోచేసే సమయంలో నాయుడు వెనుకనుంచి ఒక్కసారిగా పదునైన ఆయుధంతో వ్యాపారి గొంతుకోశాడు. దీంతో రక్తం కారడంతో అయోమయానికి గురైన యజమాని తనను చంపవద్దని అవసరమైతే డబ్బులు తీసుకుని వదిలిపెట్టాలని ప్రాథేయపడినా డ్రైవర్ వినకుండా చంపడానికి ప్రయత్నించాడు. అయితే ఆ మార్గంలో ఫస్ట్‌షో సినిమాకు వెళ్లివచ్చే వాహనాలు తిరుగుతుండడంతో డ్రైవర్ కాస్త ఆలోచనలో పడ్డాడు. ఇదే అదునుగా వ్యాపారి మెల్లగా కారుడోరుతీసుకుని సమీపంలో ఉన్న తుప్పల్లోకి పరుగు తీసి దాగున్నాడని ఎస్సై తెలిపారు. దీంతో కారులోఉన్న డబ్బుతో సహా కారుతో నాయుడు ఉడాయించాడు. బాధిత వ్యాపారి సమీపంలో ఉన్న ఇళ్లకు వెళ్లి విషయం చెప్పడంతో వెంటనే 108 వాహనంలో విశాఖ కేర్‌ఆస్పత్రికి పంపించారు. ఈ విషయం బంధువులకు తెలియడంతో బాధిత వ్యాపారి మేనల్లుడు శేఖర్ ఫిర్యాదుమేరకు కొత్తవలస ఎస్సై ఎస్.ధనుంజయరావు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యాయత్నానికి పాల్పడిన నాయుడు కారుతోసహా విశాఖజిల్లా కె.కోటపాడు మండలం పిండ్రంగి గ్రామంలో ఉన్న అత్తవారింటికి వెళ్లి అక్కడ కారు వదిలి పరారవడంతో విషయం తెలిసిన కె.కోటపాడు పోలీసులు కారును స్వాధీనం చేసుకుని కొత్తవలస పోలీసులకు తెలియపరిచారు. ఏఎస్సై సయ్యద్ జియాఉద్దీన్ బుధవారం మధ్యాహ్నం పిండ్రంగివెళ్లి నిందితుడి కోసం గాలిస్తున్నారు. గతంలో డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తికి లిఫ్టు ఇచ్చిన పాపానికి ప్రాణాలమీదకు వచ్చిందని వ్యాపారి బంధువులు రోదించారు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
విశాఖపట్నం, కొత్తవలస: ఇందిరాగాంధీ జూ పార్కులో గురువారం ఓ ప్రేమజంట ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. జూ క్యూరేటర్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా కొత్తవలస కొత్త సుంకరిపాలెం గ్రామానికి చెందిన పెదిరెడ్ల రావాలు, లెంక అనూష కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించర నే అనుమానంతో గురువారం విశాఖపట్నం జూ పార్కుకు వెళ్లి జూ సాగర్ ద్వారం సమీపంలో ముసళ్ల కొలను వద్ద కూల్‌డ్రింక్‌లో పురుగు మం దు కలుపుకొని తాగేశారు. దీంతో అనూష అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది. రావాలు మాత్రం స్పృహలో ఉండి సాయంత్రం 5.30 గంటలకు 108కి ఫోన్ చేశాడు. 108 సిబ్బంది వచ్చిన తర్వాత జూ పార్కు సిబ్బందికి విషయం తెలిసింది. దీంతో క్యూరేటర్ జి.రామలింగం అక్కడికి చేరుకొని పీఎం పాలెం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ తిరుపతిరావు వారిని చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. రావాలు గాజువాకలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకునిగా పని చేస్తున్నారు. అనూష కొత్తవలసలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. -
విద్యార్థిని ఆత్మహత్య కేసులో యువకుని అరెస్టు
కొత్తవలస: విద్యార్థిని ఆత్మహత్య కేసులో గనిశెట్టిపాలెం గ్రామానికి చెందిన సూరెడ్డి పాలబాబు(22)ను మంగళవారం ఉదయం స్థానిక గవరపాలెం వద్ద పట్టుకుని అరెస్టు చేసి కొత్తవలస కోర్టుకు తరలించినట్లు కొత్తవలస ఎస్ఐ ఎస్.ధనుంజయరావు తెలిపారు. మండలంలో గనిశెట్టిపాలెం గ్రామానికి చెందిన జామి మమత(15)పై అదే గ్రామానికి చెందిన పాలబాబు ఈ నెల 5వతేది అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడబోగా మమత తల్లి చూసి మందలించింది. అయితే ఆ అవమాన భారం భరించలేక బాలిక తెల్లవారుజామున గ్రామశివారులో ఉన్న నేలబావిలో దూకిఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని మంగళపాలెం గ్రామం సమీపంలో ఉన్న సెయింట్‌ఆన్స్ హైస్కూల్లో పదో తరగతి చదువుతుంది. ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
టీడీపీ మార్కు రాజకీయం!
కొత్తవలస, న్యూస్‌లైన్: టీడీపీ నాయకులు తాము చెప్పిందే వేదమన్నట్టు వ్యవహరిస్తున్నారు. తమ మాట వినకపోతే ఎలాంటి చర్యలకైనా పాల్పడుతున్నారు. గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారుగా పోటీ చేసిన వ్యక్తికి ఓట్లు వేయలేదన్న అక్కసుతో దత్తి, దన్ని న పేట గ్రామాలకు తాగునీరు, విద్యుత్ సరఫరాను బంద్ చేశారు. ఇలా. ఒకటి, రెండు కాదు సుమారు నాలుగు నెలలుగా ప్రజలను ఇబ్బం దులకు గురి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలకు తమ పార్టీ రంగును పులుముతున్నారు. ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా...? టీడీపీ ప్రభుత్వ మా..? అని ముక్కున వేలేసుకుంటున్నారు. గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అప్పన్నపాలెం టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా తిక్కాన చినదేముడు భార్య మహాలక్ష్మి పోటీ చేశారు వాస్తవానికి 20 ఏళ్లుగా వారే అక్కడ సర్పంచ్‌గా ఎన్నుకవుతున్నారు. అరుుతే గతసారి ఎన్నికల్లో వారికి పోటీగా పంచాయతీ శివారు గ్రామాలైన దత్తి, దన్ని నపేట గ్రామాలకు చెందిన కోన దేముడు తన భార్యను కాంగ్రెస్ మద్దతుదారుగా నిలబెట్టారు. ఎన్నికల్లో తిక్కాన మహాలక్ష్మి గెలిచినప్పటికీ.. తక్కువ మెజార్టీ వచ్చింది. ఇం దుకు దత్తి, దన్నినపేట గ్రామాలే కారణం. ఆయూ గ్రామాలకు చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుకి అధికంగా ఓట్లు వేయడంతో మహాలక్ష్మి కేవలం 11 ఓట్లతో తేడాతో గెలిచారు. ప్రత్యర్థికి ఆరు ఓట్లు వస్తే తమ పరిస్థితి ఏమిటన్న ఆలోచన టీడీపీ నాయకులు కలిగింది. దీంతో తమకు ఓట్లు వేయని ఆ రెండు గ్రామాలకు పంచాయతీపరంగా ఎలాంటి పనులు చేయకుండా ఉండాలని నిర్ణరుుంచినట్టు దత్తి, దన్నినపేట గ్రామాలకు చెందిన కోన దేముడు, దన్నిన అప్పలనాయుడు, మొయ్య దేముడుబాబు పెదిరెడ్ల మహాలక్ష్మి, పెదిరెడ్ల శంకరరావు, తదిత రులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే నాలుగు నెలలుగా రక్షిత పథకం మోటారు మరమ్మతుకు గురైనా.. పట్టించుకోవడం లేదని చెబుతు న్నారు. అలాగే పింఛన్ల పంపిణీ, ఉపాధి పనుల్లోనూ జోక్యం చేసుకుంటూ అనర్హులకు కట్టబెడుతున్నారని తెలిపారు. ఇందులో కార్యదర్శి హస్తం కూడా ఉన్నట్టు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో పంచాయతీ సర్పంచ్‌తో పాటు కార్యదర్శిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. విద్యుత్ స్తంభాలు, కుళాయిలకు పసుపు రంగు పంచాయతీలో ఏ గ్రామంలో చూసినా..విద్యుత్ స్తంభాలు, పబ్లిక్ కుళారుులపై పసుపు పచ్చరంగు వేశారు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినా..పంచాయతీ పాలకవర్గ సభ్యులు పట్టించుకోవడం లేదు. ఈ విషయమై ట్రాన్స్‌కో ఏఈ సీహెచ్ దేముడుని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా దీనిపై గతంలోనే తమకు ఫిర్యాదు అందిందని, విద్యుత్ స్తంభాలకు వేసిన రంగును మార్పిస్తామని చెప్పారు. కాగా ఈ విషయమై గ్రామ సర్పంచ్ భర్త తిక్కాన చినదేముడును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా... తమ సొంత నిధులతో గ్రామంలోని విద్యుత్ స్తంభాలు రంగు వేయించామన్నారు. రక్షిత పథకం మరమ్మతుల కోసం గతంలోనే బోరు తీయించామని, అయితే ప్రస్తుతం నిధుల లేమి వల్ల పనులు చేపట్టలేకపోతున్నామని తెలిపారు. నిధులు వచ్చిన వెంటనే పనులు చేస్తామని చెప్పారు. పిచ్చి చేష్టలు మానుకోవాలి... జిల్లాలో అన్ని పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇలాంటి పిచ్చిచేష్టలు ఎక్కడా చేసిన దాఖలాలులేవు. ప్రభుత్వ పథకాలకు పార్టీ రంగు వేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. - ఎం. దేముడుబాబు (ఏఐకెఎంఎస్ నాయకుడు). నాలుగు నెలలుగా మంచినీరు లేదు... నాలుగు నెలలుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. రక్షిత పథకం పని చేయడం లేదని సర్పంచ్‌కి చెప్పినా.. వినడం లేదు. గతసారి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వారికి ఓట్లు వేయలేదని ఇలా చేస్తున్నారు. - దన్నిన లక్ష్మి, దత్తిగ్రామం.