AP: మూడేళ్లల్లో 34.88 శాతం పెరిగిన రాష్ట్ర తలసరి ఆదాయం | Per capita income of state has crossed two lakh rupees AP | Sakshi
Sakshi News home page

AP: మూడేళ్లల్లో 34.88 శాతం పెరిగిన రాష్ట్ర తలసరి ఆదాయం

Published Sun, Sep 18 2022 3:49 AM | Last Updated on Sun, Sep 18 2022 8:19 AM

Per capita income of state has crossed two lakh rupees AP - Sakshi

మూడేళ్లుగా రాష్ట్ర తలసరి ఆదాయంలో పెరుగుదల (రూ.ల్లో..)

సాక్షి, అమరావతి: తొలిసారిగా రాష్ట్ర తలసరి ఆదాయం రెండు లక్షల రూపాయలు దాటింది. 2021–22కి సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా విడుదల చేసిన ఆర్థిక వ్యవస్థ గణాంకాల నివేదికలో వివిధ రాష్ట్రాల తలసరి ఆదాయ వివరాలను వెల్లడించింది. ఆర్బీఐ విడుదల చేసిన ప్రొవిజనల్‌ గణాంకాల మేరకు రాష్ట్ర తలసరి ఆదాయం 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,07,771కి పెరిగింది. ఇదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం రూ.1,50,007 మాత్రమే నమోదు కావడం గమనార్హం. 

ఆదుకున్న నవరత్నాలు..
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఆర్థిక మందగమనం నెలకొనగా ఆ తరువాత కోవిడ్‌ సంక్షోభం తలెత్తింది. అయినప్పటికీ 2019 – 20 నుంచి వరుసగా రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుండటం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణం నవరత్నాల ద్వారా వివిధ పధకాలను నేరుగా లబ్ధిదారులకు చేరవేయడమేనని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ప్రజల కొనుగోలు శక్తి, వస్తు వినియోగం పడిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ సంక్షోభంలోనూ వివిధ పథకాల ద్వారా ప్రజల చేతికి నగదు అందించింది. దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు స్తంభించకుండా కొనసాగాయి. చాలా రాష్ట్రాలు వృద్ధిలో తిరోగమనంలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగంలో పెద్దఎత్తున మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టడంతో పాటు పేదలకు గృహ నిర్మాణాలను జోరుగా కొనసాగించడంతో మూడేళ్లుగా వృద్ధితో పాటు తలసరి ఆదాయంలో పెరుగుదల నమోదవుతోందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు.

లాక్‌డౌన్, కోవిడ్‌ సంక్షోభ సమయంలో కూడా వ్యవసాయంతో పాటు ఎంఎస్‌ఎంఈల కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఫలితంగా ముగిసిన ఆర్థిక సంవత్సరం (2021–22)లో రాష్ట్ర తలసరి ఆదాయం ఏకంగా 17.57 శాతం  పెరిగింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 31,064 పెరిగింది.

మూడేళ్లల్లో 34.88 శాతం పెరుగుదల
గత సర్కారు దిగిపోయే నాటికి 2018 – 19లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031 మాత్రమే ఉండగా 2021 – 22లో ఏకంగా రూ.2,07,771కి పెరిగింది. వైఎస్సార్‌సీపీ పాలనలో మూడేళ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం 34.88 శాతం మేర పెరిగినట్లు స్పష్టమవుతోంది. తలసరి ఆదాయం పెరుగుదల వార్షిక సగటు వృద్ధి 11.62 శాతంగా ఉంది.

మూడేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నేరుగా నగదు బదిలీ పథకాల ద్వారా రూ.1.65 లక్షల కోట్లను ప్రజల చేతికి పారదర్శకంగా అందించింది. సంక్షోభ సమయంలోనూ పథకాలను నిర్విఘ్నంగా కొనసాగించి పేదలను ఆదుకుంది. ఉపాధి పనులు, పేదల ఇళ్ల నిర్మాణాలను పెద్ద ఎత్తున కొనసాగించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతం అందించింది. వీటి ఫలితంగా జాతీయ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయమే ఎక్కువగా నమోదైంది. 

డీబీటీ కీలకం
జాతీయ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయమే అధికంగా ఉంది. రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదలలో డీబీటీ (నేరుగా నగదు బదిలీ)ప్రధాన పాత్ర పోషించింది. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా సుమారు రూ.1.65 లక్షల కోట్లకుపైగా నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించింది.

దీనికి తోడు నాడు – నేడు ద్వారా పాఠశాలలు, ఆస్పత్రుల నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపట్టడం తయారీ రంగానికి ఊతమిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పురోగతి కనిపిస్తోంది.
– ప్రొఫెసర్‌ ప్రసాదరావు, ఆర్థిక శాస్త్ర విభాగం మాజీ అధిపతి, ఆంధ్రా యూనివర్సిటీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement