వలంటీర్లకు గుడ్‌ న్యూస్ | Cash awards for volunteers today | Sakshi
Sakshi News home page

వలంటీర్లకు గుడ్‌ న్యూస్.. నేడు నగదు పురస్కారాలు

Published Thu, Feb 15 2024 5:29 AM | Last Updated on Thu, Feb 15 2024 12:53 PM

Cash awards for volunteers today - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావు లేకుండా క్షేత్ర స్థాయిలో విశేష సేవలు అందిస్తున్న వలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నగదు పురస్కారాలతో సత్కరించనుంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కాగా ప్రభుత్వం ఈ ఏడాది నగదు పురస్కారాలను భారీగా పెంచింది.

ప్రతి శాసనసభా నియోజకవర్గంలో ఉత్తమ సేవలు అందించిన ఐదుగురికి సేవావజ్ర అవార్డులను అందించనుంది. వీటి కింద గత మూడేళ్లుగా రూ.30 వేల చొప్పున ప్రభుత్వం నగదు బహుమతి అందజేయగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని 50 శాతం పెంచి ఏకంగా రూ.45 వేలు చేసింది. అలాగే మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన ప్రతి ఐదుగురు వలంటీర్లకు సేవారత్న అవార్డులను అందించనుంది. వీటి కింద గత మూడేళ్లు రూ. 20 వేల చొప్పున నగదు బహుమతి అందజేయగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.30 వేలకు పెంచింది.

అదేవిధంగా కనీసం ఏడాదికాలంగా పనిచేస్తూ.. ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పనిచేసిన మిగిలిన వలంటీర్లందరికీ సేవామిత్ర అవార్డులు అందించనుంది. వీటి కింద గత మూడేళ్లుగా రూ.10 వేల చొప్పున నగదు బహుమతి అందజేయగా.. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.15 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన నగదు బహుమతులను తాజా పురస్కారాల ప్రదానోత్సవంలో వలంటీర్లకు అందించనుంది. 

2.55 లక్షల మంది వలంటీర్లకూ అవార్డులు..
ప్రతి లబ్ధిదారు ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేయడంతోపాటు రేషన్‌ డెలివరీ, ఆరోగ్యశ్రీ కార్డు, ఇళ్ల పట్టాలతో సహా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను, అమలు తేదీలను లబ్ధిదారులకు వలంటీర్లు వివరిస్తున్నారు. లబ్ధిదారులతో ఆయా పథకాలకు దరఖాస్తులు చేయిస్తున్నారు. అలాగే కోవిడ్, వరదలు, విపత్తులు, ప్రమాదాల సమయంలో వలంటీర్లు వివిధ సహాయ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు.

ఇలా విశేష సేవలు అందిస్తున్న వలంటీర్లకు నగదు పురస్కారాలు అందించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సత్కరించనున్నారు. తర్వాత ఈ నెల 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాసనసభా నియోజకవర్గాల పరిధిలో స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వలంటీర్లకు నగదు పురస్కా­రాలు అందించనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వ­హణకు ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.  

పురస్కారాలు ఇలా..
♦ ప్రతి శాసనసభా నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వలంటీర్ల చొప్పున.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 875 మంది వలంటీర్లకు సేవావజ్ర అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్, రూ.45,000 చొప్పున నగదు బహుమతి అందజేస్తారు.  
♦ప్రతి మండలం లేదా మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు చొప్పున, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో 10 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4,150 మందికి సేవారత్న అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్, రూ.30,000 చొప్పున నగదు బహుమతి అందిస్తారు. 
♦రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పనిచేసిన మిగిలిన 2,50,439 మంది వలంటీర్లకు సేవామిత్ర అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, రూ.15,000 చొప్పున నగదు బహుమతిని అందజేయనున్నారు. 
♦  సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర కలిపి మూడు కేటగిరీల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,55,464 మందికి మొత్తం రూ.392.05 కోట్ల నగదును బహుమతుల రూపంలో అందిస్తారు. 
♦ సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర మూడు కేటగిరీ అవార్డులకు అదనంగా వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, ఆసరా తదితర పథకాల లబ్ధిదారుల మనోభావాలను అత్యుత్తమంగా సేకరించి, జిల్లా కలెక్టర్లు ఎంపిక చేసిన 997 మంది వలంటీర్లకు వేరేగా ప్రత్యేకంగా నగదు బహుమతులను కూడా ప్రభుత్వం గురువారం అందించనుంది.

ఈ ప్రత్యేక నగదు బహుమతి కింద మండల, పట్టణ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్థాయిలో ఎంపికయ్యే వలంటీర్లకు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున అందిస్తారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో ఎంపికైన ఒక్కో వలంటీర్‌కు రూ.20 వేలు చొప్పున అందజేస్తారు. జిల్లా స్థాయిలో ఎంపికయ్యే వారికి రూ. 25 వేల చొప్పున అందజేయనున్నారు. మొత్తం 997 మంది వలంటీర్లకు ప్రత్యేక నగదు బహుమతుల రూపంలో మొత్తం రూ.1.61 కోట్లు అందిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement