సాక్షి, భీమవరం/పాలకొల్లు సెంట్రల్: కేంద్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, దీనిలో భాగంగానే వైద్య కళాశాలలను పెంచుతున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీప్రవీణ్ పవార్ చెప్పారు. కేంద్ర మంత్రి గురువారం పశ్చిమగోదావరి జిల్లాలో టిడ్కో గృహాలను సందర్శించి అక్కడ స్థానికులతో, భీమవరంలో మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం వచ్చాక దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలు 387 నుంచి 648కి పెంచారని వివరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించిన ఘనత ప్రధాని మోదీదేనని అన్నారు.
దేశంలో 2014 వరకు 60 లక్షల ఇళ్లు నిర్మాణం చేస్తే మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత 3.50 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నారు. అయినా మోదీ చిత్రపటం ఎక్కడా లేదని అన్నారు. రెండు నెలల్లో మళ్లీ వస్తానని, ఇక్కడ ప్రతి అపార్ట్‌మెంట్‌పై ప్రధాని మోదీ ఫొటో ఉండాలని, ప్రధాని ఆవాస్ యోజన అని రాసి ఉండాలని స్పష్టం చేశారు. ఇక్కడ 6,144 గృహాలు మంజూరవ్వగా 1854 మందికే ఇళ్లు అప్పగించారని, సౌకర్యాలు కూడా కల్పించలేదని అన్నారు.
తాను మళ్లీ వచ్చేసరికి మిగిలిన ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించాలని చెప్పారు. సబ్ కలెక్టర్ ఎం.సూర్యతేజ మాట్లాడుతూ టిడ్కో గృహాల్లో కేంద్ర ప్రభుత్వం వాటా 20 శాతమని, రాష్ట్ర ప్రభుత్వం వాటా 35 శాతమని, లబ్ధిదారుల వాటా 45 శాతం ఉందని తెలిపారు. కాగా, కేంద్ర మంత్రి ఎదుట రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేక భావన కలిగించాలని కొందరు బీజేపీ నాయకులు చేసిన ప్రయత్నం విఫలమైంది. సమస్యలున్న వారు చేతులెత్తాలని వారు ప్రజలను కోరగా, ఎటువంటి స్పందన రాలేదు. దీంతో వారు ఖంగుతిన్నారు.
Comments
Please login to add a commentAdd a comment