
పట్నంబజారు(గుంటూరుఈస్ట్): పన్నెండేళ్ల బాలికకు తీరని అన్యాయం.. కొంతమంది మోసగాళ్ల చేతికి చిక్కి వ్యభిచార కూపంలో మగ్గిపోయింది.. ఆఖరుకు ఎలాగో తప్పించుకుని ఒక మహిళా అధికారి వద్దకు చేరుకుంది. బాలిక పట్ల మృగాళ్లు వ్యవహరించిన తీరు.. పలువురు మహిళలు చేయించిన అఘాయిత్యాలను చూసిన ఆ అధికారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎలాగైనా సరే నిందితులకు శిక్షలు పడేదాక విశ్రమించకూడదని నిర్ణయం తీసుకున్నారు.
కేసు విచారణలో చూపిన ప్రతిభకు గాను గుంటూరు జిల్లా అడ్మిన్ అడిషనల్ ఎస్పీ కొర్లకుంట సుప్రజకు కేంద్ర ప్రభుత్వం ‘సెంట్రల్ హోం మినిస్టర్ బెస్ట్ ఇన్వెస్టిగేషన్’ అవార్డును ప్రకటించింది. గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గతేడాది 12 ఏళ్ల బాలికను అపహరించి, వ్యభిచార కూపంలోకి దించిన కేసు విచారణ బాధ్యతలను అప్పటి వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీగా ఉన్న ప్రస్తుత ఏఎస్పీ కె.సుప్రజకు అప్పగించారు.
అన్నీ తానై ఏపీ, తెలంగాణ, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్వయంగా విచారణ జరిపారు. తన నాలుగు నెలల పసిబిడ్డను తీసుకుని.. ఆఖరుకు ఆమె ప్రయాణిస్తున్న వాహనంలోనే ఆ చిన్నారికి ఊయల కట్టి వెళ్లిన పరిస్థితులున్నాయి. కేసులో వ్యభిచారం చేయించిన నిర్వాహకులు, వ్యభిచారానికి పాల్పడిన 80 మంది నిందితులను అరెస్ట్ చేశారు.
డీఎస్పీ నుంచి ఏఎస్పీగా పదోన్నతి పొందాక సైతం ఈ కేసును పూర్తిస్థాయిలో సుప్రజతోనే విచారణ చేయించాలని కోర్టు ఆదేశించటంతో పాటు, కేసులో భారీ పురోగతి సాధించిన ఆమెను న్యాయస్థానం అభినందించింది. ఈ కేసులో సుమారు 500 పేజీల చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు. మరో బాలికకు ఇలాంటి పరిస్థితి రాకూడదన్న పట్టుదలతో ఉన్నతాధికారుల సహకారంతో విచారణ చేసినట్టు ఏఎస్పీ సుప్రజ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment