సాక్షి, న్యూఢిల్లీ: ఉన్నత విద్యారంగంలో వెనకబడిన ఏపీలోని ఏడు జిల్లాల్లో మోడల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటు, కాలేజీలు, యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.317 కోట్ల్ల గ్రాంట్ విడుదలకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్ సర్కార్ చెప్పారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. దేశంలో 374 జిల్లాలు విద్యాపరంగా వెనకబడినట్లు యూజీసీ నిపుణుల సంఘం గుర్తించిందని తెలిపారు. ఏపీలోని అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు విద్యలో వెనకబడిన జిల్లాలుగా గుర్తించినట్లు చెప్పారు.
ఈ జిల్లాల్లో విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) జాతీయ సగటు అయిన 12.4 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు యూజీసీ నిపుణుల సంఘం నిర్ధారించినట్లు తెలిపారు. విద్యాపరంగా వెనకబడిన జిల్లాల్లో పరిస్థితిని మెరుగుపరచేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సాయం అవసరమని గుర్తించి అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.
ఉన్నత విద్యను సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసురావడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా)ను ప్రారంభించిందన్నారు. దీనికింద విద్యాపరంగా వెనకబడిన జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం మోడల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు, కాలేజీలు, యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులను గ్రాంట్‌గా మంజూరు చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే ఏపీలో గుర్తించిన ఏడు జిల్లాల్లో ఉన్నత విద్యావకాశాలు మెరుగుపరచడానికి రూ.317 కోట్లు విడుదల చేయాలని రూసా (ప్రాజెక్ట్ ఆమోదం బోర్డు) నిర్ణయించిందని మంత్రి తెలిపారు.
పౌష్టికాహార లోపం నివారణే లక్ష్యంగా..
చిన్నారులు, యుక్తవయసు బాలికలు, గర్భిణులు, బాలింతల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా సాక్షం అంగన్‌వాడీ, పోషణ్ 2.0 పథకాలను తీసుకొచ్చినట్లు కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. దేశంలో పౌష్టికాహార లోపాన్ని సమర్థంగా ఎదుర్కొని ఉత్తమ ఫలితాలను రాబట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం 2018లో పోషణ్ అభియాన్‌ను ప్రారంభించిందన్నారు. ఆరేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల, బరువు, రక్తహీనత లోపాల నివారణను 2 నుంచి 3 శాతం తగ్గించడం లక్ష్యంగా సాక్షం అంగన్‌వాడీ, పోషణ్ 2.0 అభియాన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు.
పారా మిలటరీలో మహిళలకు 33శాతం పోస్టులు
పారా మిలటరీలో మహిళలకు 33 శాతం పోస్టుల రిజర్వు చేయాలని 2016 జనవరిలో నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. సరిహద్దు కాపలా దళాల పోస్టుల్లో 14 నుంచి 15 శాతం పోస్టులు మహిళలకు రిజర్వు చేసినట్లు చెప్పారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్, అస్సాం రైఫిల్స్‌లో ప్రస్తుతం 34,151 మంది మహిళా సిబ్బంది ఉన్నారని తెలిపారు.
ఎస్‌పీపీఈఎల్‌లో తోటి, గోరుం భాషలు
దేశంలో అంతరించిపోతున్న భాషల రక్షణ, సంరక్షణ పథకంలో ఏపీకి చెందిన తోటి, గోరుం భాషలు చేర్చినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్ సర్కార్ తెలిపారు. దేశంలో అంతరించిపోతున్న భాషల రక్షణ నిమిత్తం 2015–16 నుంచి 2021–22 వరకు యూజీసీ, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ రూ.48.90 కోట్లు విడుదల చేసినట్లు ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు.
అసెంబ్లీ సీట్లు ఇప్పుడే పెంచలేం
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లోని సెక్షన్ 26కు అనుగుణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించేవరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచలేమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం 2026వ సంవత్సరం తర్వాత మొదటి జనాభా గణనను ప్రచురించేవరకు ప్రతి రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్యను తిరిగి సర్దుబాటు చేయరాదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు జవాబిచ్చారు.
విద్యలో వెనకబడిన 7 జిల్లాలకు రూ.317 కోట్లు
Published Thu, Jul 28 2022 4:36 AM | Last Updated on Thu, Jul 28 2022 8:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment