సాక్షి, అమరావతి : ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్థికాభివృద్ధిని సాధించిందని చెప్పడానికి ఉపయోగపడే ప్రధాన సూచికల్లో విద్యుత్ వినియోగం ఒకటి. అందుకే విద్యుత్ వినియోగం ఎంత ఎక్కువగా ఉంటే అక్కడ పారిశ్రామిక, వాణిజ్య రంగాలు, జీవన ప్రమాణాలు అభివృద్ధి పథంలో ఉన్నాయని లెక్కిస్తుంటారు. అలాంటి విద్యుత్ సరఫరాకు దీర్ఘకాలంగా ఆటంకం ఏర్పడితే ఆర్థిక వ్యవస్థ మందగించే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రభుత్వాలు భవిష్యత్ విద్యుత్ సరఫరాకు ముందుగానే ప్రణాళికలు వేస్తుంటాయి.
ఈ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం దేశానికి మరోసారి ఆదర్శంగా నిలిచింది. ఏపీ చర్యలను స్ఫూర్తిగా తీసుకుని అన్ని రాష్ట్రాలూ పదేళ్ల విద్యుత్ వినియోగానికి ముందుగానే ప్రణాళికలు వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు తొమ్మిదేళ్ల ముందుగానే విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్దేశించింది.
జల విద్యుత్ కొనాలంటే తొమ్మిదేళ్ల ముందు, థర్మల్‌కు ఏడేళ్ల ముందు, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లకు ఐదేళ్లు, పవన విద్యుత్‌కు మూడేళ్లు, సౌర విద్యుత్‌కు రెండేళ్ల ముందు ఒప్పందాలు కుదుర్చుకోవాలని కేంద్రం వెల్లడించింది.
2031 నాటికి రెట్టింపు వినియోగం..
రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ ఆధారంగా రానున్న పదేళ్లలో వినియోగం ఎంత ఉంటుందో అంచనా వేయాలని కేంద్రం కోరింది. దీంతో.. 2031 నాటికి ఏపీలో ఇంధన వినియోగం రెట్టింపు అవుతుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తన 20వ ఎలక్ట్రిక్ పవర్ సర్వే (ఈపీఎస్) నివేదికలో ఇప్పటికే వెల్లడించగా, ఇటీవల జాతీయ విద్యుత్ ప్రణాళిక కమిటీ దానిని ధుృవీకరించింది.
ఇక రాష్ట్రంలో 2021–22 ఏడాదిలో విద్యుత్ వినియోగం 60,495 మిలియన్ యూనిట్లు ఉండగా, 2031–32 నాటికి 1,21,798 మిలియన్ యూనిట్లకు చేరుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. దానికి తగ్గట్లుగా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కూడా మరో 13,510 మెగావాట్లు పెరగనుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా.. థర్మల్ విద్యుత్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఇప్పటికే కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్కేంద్రంలో 800 మెగావాట్లను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతికి అంకితమిచ్చారు. అలాగే, ఈ నెలలోనే డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్‌లో మరో 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఇంధన శాఖ, ఏపీ జెన్‌కో సన్నాహాలు చేస్తున్నాయి.
పునరుత్పాదక విద్యుత్‌కు పెద్దపీట..
ఇక 2030 నాటికి వినియోగించే విద్యుత్‌లో 50 శాతం పునరుత్పాదక విద్యుత్ ఉండాలని కేంద్రం స్పష్టంచేసింది. ఈ విషయంలోనూ రాష్ట్రం ముందంజలోనే ఉంది. వ్యవసాయానికి ఏకంగా ముప్పై ఏళ్ల పాటు పగటివేళలోనే 9 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరాను అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు ఇప్పటికే యూనిట్‌కు రూ.2.49 పైసల చొప్పున ఒప్పందం చేసుకున్నాయి.
సెకీ నుంచి తీసుకుంటున్న 7 వేల మెగావాట్ల విద్యుత్ సౌర విద్యుత్ కావడం విశేషం. దీంతోపాటు 44,250 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ.9.47 లక్షల కోట్ల విలువైన పునరుత్పాదక ప్రాజెక్టుల స్థాపనకు ఒప్పందాలు కూడా చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment