గుంటూరు జిల్లాలోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూమి
సాక్షి, అమరావతి: పరిశ్రమలను అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగించేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎంపీ రాఘురామకృష్ణరాజు ద్వయం సరికొత్త కుట్రకు తెరతీసింది. నిబంధనల ప్రకారం మైనింగ్ లీజులు పొందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్(ఎస్‌పీఐపీఎల్)పై రాజకీయ దురుద్దేశంతో పన్నాగానికి పథక రచన జరుగుతోంది. ప్రభుత్వం నుంచి భూములు తీసుకోకుండా మార్కెట్ ధరకు ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన భూముల్లో మైనింగ్ నిర్వహిస్తున్న సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు వ్యతిరేకంగా ఇలాంటి కుట్రలకు పాల్పడుతుండటం విస్మయపరుస్తోంది.
మైనింగ్ లీజు రద్దుకు టీడీపీ హయాంలో చేసిన కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు ప్రస్తుతం బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో నిందితుడైన రఘురామరాజును అడ్డం పెట్టుకుని కథ నడిపిస్తున్నారు. వేల కోట్ల రూపాయల రుణం తీసుకుని బ్యాంకులను మోసగించి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు.. సరస్వతి పవర్ మైనింగ్ లీజులను రద్దు చేయాలని కోరడం విస్మయపరుస్తోందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
కొన్నది ప్రైవేటు భూములే..
సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్(ఎస్‌పీఐపీఎల్) 2008లో గుంటూరు జిల్లాలో 266 హెక్టార్ల ప్రైవేటు భూమిని కొనుగోలు చేసింది. సాధారణంగా ఏ పారిశ్రామిక సంస్థ అయినా ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు భూములు తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేస్తుంది. కానీ రాజకీయ ఆరోపణలకు అవకాశం ఇవ్వకూడదని భావించిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ యాజమాన్యం తమకు భూములు కేటాయించాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరలేదు. పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన భూముల్లో సున్నపురాయి మైనింగ్‌కు దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందింది. పూర్తి పారదర్శకతతో జరిగిన ఈ వ్యవహారంపై భూములు అమ్మిన ప్రైవేట్ వ్యక్తులు కూడా దానిపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
రాజకీయ కక్షతో లీజు రద్దు.. చెల్లదని కోర్టు తీర్పు
2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష పూరితంగా వ్యవహరించింది. మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభించలేదంటూ సరస్వతి పవర్ కంపెనీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై సరస్వతి యాజమాన్యం సహేతుకమైన వివరణ ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా మైనింగ్ లీజును 2014 అక్టోబర్ 9న రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం కేటాయించిన భూములైతే మైనింగ్ లీజు రద్దు చేసి వాటిని మరొకరికి ఇవ్వవచ్చు. కానీ అవి పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన భూములు. లీజు రద్దు చేసినా సరే ఆ భూములు ప్రభుత్వానికి చెందవు.
కేవలం రాజకీయ కక్షతోనే నాడు టీడీపీ సర్కారు అడ్డగోలుగా వ్యవహరించింది. చంద్రబాబు సర్కారు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన న్యాయస్థానం సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. మైనింగ్ లీజును రద్దు చేస్తూ టీడీపీ సర్కారు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఆ భూముల్లో మైనింగ్ చేసుకోవచ్చని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు అనుమతినిచ్చింది.
ఆర్థిక నేరాల నిందితుడితో కలసి...
సున్నపురాయి గనుల మైనింగ్ లీజు రద్దుకు తమ ప్రభుత్వ హయాంలో చేసిన కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు ఈసారి కొత్త పన్నాగానికి తెరతీశారు. తన చేతిలో కీలుబొమ్మగా మారిన రఘురామకృష్ణరాజును తెరముందు పెట్టి కుట్ర పన్నారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు ఇచ్చిన మైనింగ్ లీజు రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం విడ్డూరంగా ఉంది. జాతీయ బ్యాంకుల నుంచి రూ.2,655 కోట్ల మేర రుణాలు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించి అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. అటువంటి కేసులో నిందితుడు కోర్టును ఆశ్రయించి సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ మైనింగ్ లీజును రద్దు చేయాలని కోరడం వెనుక కచ్చితంగా రాజకీయ కుట్ర ఉందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్ర...
రాష్ట్రం అభివృద్ధి చెందడం ఏమాత్రం సహించలేని చంద్రబాబు అండ్ కో రాజకీయ కుట్రతోనే సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ మైనింగ్ లీజు రద్దు చేయించేందుకు పన్నాగం పన్నారన్నది సుస్పష్టమవుతోంది. పరిశ్రమలు ఎక్కువగా వస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందన్నది ఆర్థికవేత్తలు చెబుతున్న మాట. అందుకే ప్రభుత్వాలే పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకు భూములు కేటాయించి మరీ పరిశ్రమల స్థాపనకు చొరవ చూపిస్తాయి. కానీ ప్రభుత్వం నుంచి భూములుగానీ ఇతరత్రా ప్రయోజనాలను ఆశించకుండానే సరస్వతి పవర్ ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు కొని నిబంధనల మేరకు మైనింగ్ కార్యకలాపాలు చేపట్టింది. ఓ పారిశ్రామిక సంస్థ ఇంతటి ఉదారతతో వ్యవహరించడం అరుదని పారిశ్రామిక, న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
ఆగితే ఉపాధికి విఘాతం..
రాజకీయ దురుద్దేశంతో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ మైనింగ్ లీజును అడ్డుకునేందుకు యత్నిస్తూ పారిశ్రామిక అభివృద్ధిని అడ్డుకునేందుకు పన్నాగం పన్నుతుండటాన్ని పరిశీలకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. మైనింగ్ లీజును రద్దు చేస్తే ఆ భూములు ప్రభుత్వానికి చెందవు. సర్వస్వతి పవర్ ఇండస్ట్రీస్ వద్దే ఉంటాయి. ఎందుకంటే అవి ఆ కంపెనీ ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన భూములు కాబట్టి. కానీ లీజు రద్దు చేస్తే ఆ భూములు నిష్ప్రయోజనంగా మారతాయి.
పారిశ్రామిక కార్యకలాపాలు నిలిచిపోతే ఎంతోమంది ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ప్రభుత్వం కల్పిస్తున్న సానుకూల వాతావరణానికి విఘాతం కలుగుతుంది. పారిశ్రామిక ప్రగతి దెబ్బతింటే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది. రాష్ట్ర అభివృద్ధి కంటే రాజకీయ కుట్రలకే ప్రాధాన్యమిస్తూ చంద్రబాబు, రఘురామరాజు ద్వయం తమ పన్నాగాలను కొనసాగిస్తుండటం వారి దురుద్దేశాలను వెల్లడిస్తోంది. ఇటువంటి రాజకీయ పరిణితిలేని, కుట్రపూరిత చర్యలు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి విఘాతమని, పెట్టుబడులను ప్రోత్సహించాలన్న జాతీయ విధానానికి వ్యతిరేకమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
చదవండి: పేదలందరికీ సొంతిళ్లు.. ఇదీ నా కల: సీఎం జగన్
ఇదేమి సుమోటో..!
Comments
Please login to add a commentAdd a comment