సాక్షి, అమరావతి/సాక్షి బృందం విజయవాడ: బుడమేరు ముంపు వచ్చి నాలుగు రోజులైంది. ముంపునీటిలో ఆరున్నర లక్షల మంది విలవిల్లాడుతున్నారు. ఇన్ని రోజులైనా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనం కారణంగా బాధితులు అన్నమో రామచంద్రా అంటూ అలమటిస్తున్నారు. దాతలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నా వారికి సరిగ్గా దిశానిర్దేశం చేయడంలో సర్కారు ఘోరంగా విఫలమైంది. గుక్కెడు నీళ్లు, పట్టెడన్నం కూడా ఇవ్వలేకపోవడంతో బాధితుల ఆక్రందనలకు అంతులేకుండాపోతోంది. మరోవైపు.. ఆకలితో అలమటిస్తూ పలువురు మృత్యువాత పడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అయినా సరే ప్రభుత్వంలో చలనం కని్పంచడంలేదు. కొద్దోగొప్పో ఆహార పంపిణీ చేస్తున్నప్పటికీ ఫొటోలకు ఫోజులిచ్చేందుకు అందరూ పాకులాడుతున్నారు. ఇక హెలికాçప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహార పంపిణీ పెద్ద ప్రహసనంగా తయారైంది. బురదమయమైన చోట జార విడుస్తున్న ఆహార పొట్లాల కోసం బాధితులు కొట్టుకుంటున్న పరిస్థితి.
ఆకలి తీర్చే యంత్రాంగమేది?
దాతలు అందించే విరాళాలతో పలుచోట్ల ఆహారం తయారుచేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ, ఆ ఆహారాన్ని అవసరమైన వారికి అందించడంలో ఘోరంగా విఫలమవుతోంది. నగరంలో ఏ ఏ డివిజన్లలో ఎంతమంది బాధితులున్నారో ప్రభుత్వం వద్ద స్పష్టమైన సమాచారం ఉన్నా వారికి ఎంతమేర ఆహారం అవసరమవుతుందో అంచనా వేయలేకపోతున్నారు. దీంతో.. మంచినీరు, ఆహార పొట్లాలను తీసుకెళ్తున్న వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలిపివేసి అక్కడకు వచి్చన వారికి మాత్రమే అందిస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. ప్రధాన రోడ్లకు లోపలగా ఉన్న ప్రాంతాలకూ వచ్చి ఆహార పొట్లాలు అందించాలని వేడుకుంటున్నా పట్టించుకునే దిక్కులేదు. చాలాచోట్ల ఆహారం సరిగా లేకపోవడం, తినడానికి పనికిరాకుండా పాడైపోవడం వంటి కారణాలతో ప్యాకెట్లు రోడ్డుపాలవుతున్నాయి.
బాధితులకు ఛీత్కారాలు.. చీదరింపులు
ఇదిలా ఉంటే.. సితార సెంటర్, లేబర్ కాలనీ, కబేళా ప్రాంతాల్లో ఆహారం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న బాధితులు అధికారులు, సిబ్బంది నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారు. వాహనాల్లో ఆహారాన్ని పంపిణీ చేసేందుకు వస్తున్న వారు బాధితులను చులకనగా చూస్తూ మనసు గాయపడేలా మాట్లాడుతున్నారు. కానీ, కొందరు సిబ్బంది పంపిణీ ప్రక్రియను వదిలేసి సెలీ్ఫలు, వీడియోలపైనే ఆసక్తి కనబరుస్తున్నారు.
దాతలకు గైడ్ చేసే నాథుల్లేరు..
ఇక బాధితుల ఆకలి తీర్చేందుకు పెద్ద సంఖ్యలో దాతలు ముందుకొస్తున్నా వారికి దిశానిర్దేశం చేసే నాథులు కని్పంచడంలేదు. నగరానికి చెందిన వారే కాదు.. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో దాతలు సొంతంగా ఆహారం తయారుచేయించుకుని విజయవాడ తీసుకొస్తున్నారు. బాధితులను చేరుకోవాలంటే ఎటువైపు వెళ్లాలో వారికి తెలీడంలేదు. దీంతో వారు ఉన్నచోటే పంచేసి మిగిలిపోయిన ఆహారాన్ని అక్కడే వదిలేస్తున్న పరిస్థితులు కన్పిస్తున్నాయి. కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసినా అధికారులు స్పందించడంలేదని చెబుతున్నారు.
కంపుకొడుతున్న ఆహారం..
ఇక నగరంలోని వరద ముంపు ప్రాంతాలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆహారం వాసనొచ్చి తినేలాలేదని.. వీటిని పిల్లలకు ఎలా పెట్టాలని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అర్థరాత్రి వేళ భోజన ప్యాకెట్లు వస్తున్నాయని.. వాటిని ఇక్కడ పడేసి రేపు ఉదయం తినాలని సూచిస్తున్నారని.. పొద్దున చూస్తే అవి పాడైపోయి కనిపిస్తున్నాయంటున్నారు. ఇలా బస్తాల బస్తాల ఆహార పొట్లాలు నేలపాలవుతున్నాయి. పలువురు వీటిని తిని వాంతులు చేసుకున్నారు.
రెండ్రోజుల నుంచి ఖాళీ కడుపుతో
ఆకలితో అలమటిస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. రెండ్రోజుల నుంచి ఖాళీ కడుపుతోనున్న వారు ఎందరో. హెలికాప్టర్ నుంచి విసురుతున్న పొట్లాలు ఎక్కడో దూరంగా పడి ఎవరికీ అందకుండాపోతున్నాయి. పేదల ఆకలంటే అందరికీ అలుసుగా ఉంది.
– గిరికే ఏడుకొండలు, వాంబే కాలనీ
తిండి, నీరులేక నాలుగు రోజులు విలవిల
కుటుంబమంతా వరద నీటిలో చిక్కుకుని నాలుగు రోజులుగా తిండి, తాగునీరు లేక విలవిల్లాడిపోయాం. చివరికి టైర్ ట్యూబుల సాయంతో బుధవారం నున్న గ్రామానికి చేరుకున్నాం. ఇక్కడ నుంచి గన్నవరంలోని బంధువుల ఇంటికి వెళ్తున్నాం.
– ఎస్. నారాయణరావు, పాయకాపురం, విజయవాడ
ముసలివాళ్లకు ఆహారం అందడంలేదు..
ఇంట్లో నేను, నా భార్య ఇద్దరమే ఉంటున్నాం. నాలుగు రోజులుగా తినడానికి తిండి దొరక్క చాలా ఇబ్బందులు పడ్డాం. ఆహార పొట్లాలు నాలాంటి ముసలివాళ్లకు అందడంలేదు. నా ముసలిదాని ఆకలి తీర్చాలని ఈరోజు కష్టపడి ఆహార పొట్లాన్ని అందుకున్నా.
– గుంజ వెంకటయ్య, రాజీవ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment