Chandrababu Naidu Government Not Payed Electricity Bills In His Rule - Sakshi
Sakshi News home page

గ్రామాల నెత్తిన బాబు బండ

Published Wed, Dec 1 2021 4:09 AM | Last Updated on Wed, Dec 1 2021 12:06 PM

Chandrababu Govt Not payed electricity bills in his rule - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన పాపం ఇప్పుడు రాష్ట్రంలోని గ్రామీణ ప్రజానీకానికి శాపంగా మారింది. పంచాయతీల్లో వీధి దీపాలు, మంచి నీటి పథకాలకు విద్యుత్‌ బిల్లులు చెల్లించకుండా పంచాయతీలపై వేల కోట్లు బకాయిల బండ వేశారు. 2019 మేలో చంద్రబాబు అధికారం నుంచి దిగేనాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల విద్యుత్‌ బిల్లుల బకాయిలు రూ. 3,481 కోట్లు ఉన్నాయి. బాబు సర్కారు ఉన్న ఐదేళ్లలో కేంద్రం నుంచి నిధులు విరివిగా వచ్చినప్పటికీ, వాటిని విద్యుత్‌ బిల్లులకు, గ్రామాల అభివృద్ధికి వినియోగించలేదు. దీంతో విద్యుత్‌ బకాయిలు పేరుకుపోయాయి. 2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్‌ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తోంది.

చంద్రబాబు హయాంలో ఉన్న బకాయిలను కూడా వడ్డీతో సహా చెల్లిస్తోంది. దీంతో అప్పటి బకాయిలు రూ. 2,963 కోట్లకు తగ్గాయి. బకాయిల వివరాలను విద్యుత్‌ సంస్థలు ప్రతి నెలా పంచాయతీలకు పంపుతూనే ఉంటాయి. కొన్ని చోట్ల వీటిని గ్రామ పంచాయతీల నిధుల నుంచి విద్యుత్‌ సంస్థలు జమ చేసుకుంటున్నాయి. దానిని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు తప్పు పడుతున్నారు. ప్రభుత్వం పంచాయతీల నిధులను మళ్లిస్తోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారి ప్రభుత్వ హయాంలోనే బకాయిలు పెట్టి, వాటిని విద్యుత్‌ సంస్థలు జమ చేసుకుంటుంటే విమర్శలు చేయడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

ఆ బకాయిలు కట్టకపోతే ప్రజలపైనే భారం
ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన సంస్కరణల ప్రకారం.. బకాయిలు పేరుకుపోయి విద్యుత్‌ సంస్థలు అప్పుల పాలైతే, నష్టాన్ని పూడ్చుకోవడానికి విద్యుత్‌ చార్జీలు పెంచి సాధారణ ప్రజలపైనా ఆ భారం మోపుతాయి. వినియోగదారుడు సకాలంలో బిల్లు చెల్లించకపోతే, వందకు ఏడాదికి 18 శాతం చొప్పున అపరాధ రుసుం వసూలు చేస్తాయి. ఈ నిబంధనలే గ్రామ పంచాయతీలకు కూడా వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు. అయినా, 2014 – 2019 మధ్య కేంద్రం నుంచి పంచాయతీలకు విరివిగా నిధులు వచ్చినప్పటికీ, చంద్రబాబు సర్కారు వాటిని వేరే పనులకు మళ్లించి, పంచాయతీల నెత్తిన విద్యుత్‌ బిల్లుల భారాన్ని మోపింది. అవి అపరాధ రుసుముతో కలిపి తడిసిమోపెడయ్యాయి.

ఈ రెండున్నర ఏళ్లు ఎప్పటి కరెంటు బిల్లులు అప్పుడే చెల్లింపు..
2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకు చెందిన కరెంటు బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించేస్తోంది. పైగా, తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టిన బకాయిలు, వాటిపై వడ్డీని కూడా కొంతమేరకు చెల్లించింది. ఈ విధంగా చంద్రబబు సర్కారు పెట్టిన బకాయిల్లో రూ. 518 కోట్లు కూడా ఈ ప్రభుత్వంలో చెల్లించినట్టు అధికారులు వెల్లడించారు. 2020 ఏప్రిల్‌ నుంచి గ్రామాల అభివృద్దికి కేంద్రమిచ్చే అర్థిక సంఘం నిధుల్లో 70 శాతమే పంచాయతీలకు కేటాయించారు. మండల , జిల్లా పరిషత్‌లకు 30 శాతం కేటాయించారు. నిధులు తక్కువగా ఉన్నప్పటికీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పంచాయతీల విద్యుత్‌ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించడమే కాకుండా, పాత బకాయిలనూ చెల్లిస్తోంది. 

ఆ ఐదేళ్లలో రూ. 6,667 కోట్ల పంచాయతీల నిధులున్నా..
2015కు ముందు, 2020 తర్వాత గ్రామాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్‌లకు కూడా కలిపి కేటాయించింది. పంచాయతీలకు 70 శాతం, మండల , జిల్లా పరిషత్‌లకు 15 శాతం చొప్పున కేటాయించింది. అయితే, చంద్రబాబు సీఎంగా ఉన్న ఆ ఐదేళ్లు కేంద్రం మొత్తం నిధులను గ్రామ పంచాయతీలకే ఇచ్చింది. ఈ విధంగా 2015 ఏప్రిల్‌ నుంచి 2019 మార్చి మధ్య 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.4,917.34 కోట్లు  గ్రామ పంచాయతీల ఖాతాల్లో  జమ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2011 – 13 మధ్య పంచాయతీ ఎన్నికలు జరగలేదు.

అప్పట్లో నిలిపివేసిన 13వ ఆర్థిక సంఘం నిధులలో రూ. 1,750 కోట్లను కూడా 2014 జూన్‌ –2015 మార్చి మధ్య కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా చంద్రబాబు సీఎంగా ఉన్న ఐదేళ్లలో రూ. 6,667 కోట్లు పంచాయతీలకు సమకూరాయి. అయినా,  బాబు సర్కారు పంచాయతీల విద్యుత్‌ బిల్లులు చెల్లించలేదు. పెద్ద మొత్తంలో గ్రామ పంచాయతీల కరెంటు బకాయిలు పేరుకుపోవడంపై అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో గ్రామాల్లో సిమెంట్‌ రోడ్ల నిర్మాణం జరిగినా, అవి ‘ఉపాధి’ నిధులతో జరిగాయి. ఆర్థిక సంఘం నిధులు వెచ్చించింది లేదు. దీంతో ఆర్థిక సంఘం నిధులను అప్పటి  ప్రభుత్వం వేరే కార్యక్రమాలకు మళ్లించిందన్న ఆరోపణలున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement