రెండు నెలలైనా ఒక్క నామినేటెడ్ పదవీ భర్తీ చేయని చంద్రబాబు
కీలకమైన టీటీడీ, ఆర్టీసీ, ఏపీఐఐసీ వంటి వాటిపైనా అస్పష్టత
టీటీడీ చైర్మన్ పదవి కోసం ముఖ్యుల పట్టు
మూడు పార్టీల మధ్య అవగాహన కుదరకపోవడమే కారణం
త్వరలో 30 కార్పొరేషన్లను భర్తీ చేసే అవకాశం ఉందంటున్న నేతలు
సాక్షి, అమరావతి : రాష్ట్ర ఎన్డీఏ కూటమిలో నామినేటెడ్ పదవుల పంపకం ఎటూ తేలడంలేదు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా ఒక్క నామినేటెడ్ పదవిని కూడా సీఎం చంద్రబాబు భర్తీ చేయలేదు. అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), ఏపీఐఐసీ, ఆర్టీసీ వంటి కార్పొరేషన్ పదవులు సైతం ఇంకా ఎవరికీ ఇవ్వకపోవడంతో మూడు పార్టీల శ్రేణుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.
ప్రధానంగా టీడీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సహజంగానే నాన్చుడు ధోరణి ప్రదర్శించే చంద్రబాబు ఇప్పుడు కూటమిలో మూడు పార్టీల మధ్య పదవుల పంపకం జరగాల్సి ఉండటంతో మరింత తాత్సారం చేస్తున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీలకు ఏ నిష్పత్తిలో పదవులు ఇవ్వాలనే దానిపై ఒక అవగాహన కుదిరినా ఆశావహులు ఎక్కువగా ఉండడంతో చంద్రబాబు త్వరగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాష్ట్ర స్థాయిలో 90కి పైగా కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యుల పదవులు వందల సంఖ్యలో ఉన్నాయి. మొత్తం పదవుల్లో 70 శాతం టీడీపీకి, 25 శాతం జనసేనకు, 5 శాతం బీజేపీకి కేటాయించాలనే ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. తొలి విడతగా వాటిలో 30 శాతం పదవులనైనా భర్తీ చేయాలని ప్రయత్నిస్తున్నా పార్టీలు, సమీకరణలు, లాబీయింగ్‌తో గందరగోళం ఏర్పడి ఇప్పటివరకు ఒక్క పదవినీ భర్తీ చేయలేకపోయారు. నియోజకవర్గాలకు సంబంధించిన పదవుల్లో గెలిచిన ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.
టీటీడీకి తీవ్ర పోటీ
అత్యంత కీలకమైన టీటీడీ చైర్మన్ పదవిపై కూటమిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చైర్మన్ పదవిని టీడీపీకి కేటాయించుకున్నా దాన్ని ఎవరికి ఇవ్వాలనే దానిపై చంద్రబాబు ఎటూ తేల్చలేకపోతున్నారు. ఎల్లో మీడియాకి చెందిన ఓ ఛానల్ యజమానికి ఈ పదవి ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే అంత ప్రాధాన్యత ఉన్న పదవిని పార్టీకి చెందిన వారికి కాకుండా బయటి వ్యక్తులకు ఎలా ఇస్తారనే అభ్యంతరాలు టీడీపీ నుంచి వచ్చినట్లు తెలిసింది. దీంతో సీనియర్ నేత కళా వెంకట్రావు పేరును పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఎల్లో మీడియా తరఫున ఓ ఛానల్ అధినేతకు చంద్రబాబు మాట ఇచ్చేశారని, ఆయనకే టీటీడీ ఛైర్మన్ పదవి లభిస్తుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. టీటీడీ బోర్డు సభ్యుల పదవుల కోసం కూడా విపరీతమైన పోటీ నెలకొంది.
ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు, పారిశ్రామికవేత్తల నుంచి కూడా బోర్డు సభ్యత్వం కావాలని వినతులు వచ్చాయి. పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యులు, ఇతర రాష్ట్రాల పెద్దల నుంచి బోర్డు మెంబర్ల కోసం సిఫారసులు రావడంతో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. అయితే జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నుంచి కూన రవికుమార్, వేమిరెడ్డి ప్రశాంతికి బోర్డు సభ్యులుగా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.
ప్రచారంలో ఉన్న పేర్లు ఇవే?
ఎన్టీఆర్ జిల్లా మైలవరం సీటును వదులుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కడప జిల్లాకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ఏపీఐఐసీ చైర్మన్, టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కి పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా మాజీ మంత్రి పీతల సుజాత, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పేర్లు ఖరారైనట్లు చెబుతున్నారు. తెనాలి సీటు వదులుకున్న ఆలపాటి రాజాకి కీలకమైన పదవి దక్కుతుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment