సాక్షి, అమరావతి / సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి ఉప ఎన్నిక వేళ చంద్రబాబు మరో కొత్త డ్రామాకు తెరలేపారు. రాజకీయ డ్రామాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆయన ఈ ఎన్నికలో డిపాజిట్లయినా వస్తాయో లేదోననే ఆందోళనలో తనపై రాయి విసిరారంటూ సోమవారం రాత్రి అప్పటికప్పుడు ఒక కట్టుకథ అల్లారు. అది నిజమని నమ్మించేందుకు అక్కడే బైఠాయించి హంగామా సృష్టించారు. జాతీయ మీడియాని రప్పించి ఏపీలో ఏదో జరిగిపోతోందంటూ పారా మిలటరీ బలగాలతో ఎన్నికలు జరిపించాలని కొత్త డిమాండ్‌తో నాటకాన్ని మరింత రక్తి కట్టించారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు టీడీపీ నేతల్ని పంపి తనపై దాడి జరిగిందంటూ ఫిర్యాదు చేయించారు. ఇంతా చేస్తే.. రాయి ఎవరికి తగిలిందో.. ఎవరికేం అయిందో చెప్పలేక తుదకు అభాసుపాలయ్యారు.
అసలు ఏం జరిగిందంటే..
సోమవారం సాయంత్రం తిరుపతిలో రోడ్‌షో అనంతరం కృష్ణాపురం ఠాణా వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రసంగం ప్రారంభం కాగానే, సభకు వచ్చిన అద్దె జనం తిరుగుముఖం పట్టారు. జనం గుంపుగా వెళ్తున్న సమయంలో ఒక చిన్న రాయి ఓ మహిళ పాదరక్షకు తగిలి.. ప్రక్కన నడుస్తున్న మరో మహిళ కాలుకు తగిలింది. ఆ మహిళ కిందకు వంగి చూసుకోవడంతో తోటి మహిళలు ఏమైందంటూ గుమికూడారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు.. హైడ్రామాకు తెరలేపారు. ‘అక్కడెవరో రాళ్లతో కొట్టారు. ఆ రాళ్లు ఇటు తీసుకురండి’ అని తెలుగు తమ్ముళ్లను మైకులో ఉసిగొల్పారు. వారు వెంటనే అక్కడున్న చిన్న చిన్న రాళ్లను వెతికి తీసుకొచ్చి చంద్రబాబు చేతికి అందించారు.
రాయి తగిలిన మహిళ తన వద్దకు రావాలని బాబు పదే పదే మైకులో పిలిచినా ఎవరూ రాలేదు. దీంతో అసహనంతో సీఎంను, ప్రభుత్వాన్ని దూషిస్తూ అక్కడే బైఠాయించారు. రాళ్ల దాడి నుంచి తాను తృటిలో తప్పించుకున్నట్లు, తమ కార్యకర్తలకు గాయాలైనట్లు అప్పటికప్పుడు ఒక కట్టుకథ అల్లేశారు. ప్రచారం వాహనం నుంచి దిగి రోడ్డుపై బైఠాయించారు. రాళ్లతో దాడి చేసిన వారిని 5 నిమిషాల్లో పట్టుకోవాలని, రౌడీ రాజ్యం నశించాలని నినాదాలు చేశారు. ‘నా సభలో రాళ్లు రవ్వుతారా? మీకెంత ధైర్యం.. యూజ్‌లెస్ ఫెలోస్.. మీ అంతు చూస్తాం.. పోలీసులు 5 నిమిషాలల్లో జవాబు చెప్పకపోతే మీ కథ తేలుస్తాం. ఇక్కడే పడుకుని నిరశన చేపడతా..’ అంటూ కేకలు వేశారు. పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగి వారిని దుర్భాషలాడారు. తర్వాత సమీపంలోని ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న బాబు అక్కడ ధర్నా నిర్వహించారు. తర్వాత తాను బస చేసిన హోటల్‌కి వెళ్లిపోయారు.
పోలీసులను బెదిరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు
సానుభూతి కోసం డ్రామా
డ్రామాలు సృష్టించడంలో దిట్టగా పేరొందిన ఆయన ఎన్నికల వేళ కావాలని దీన్ని సృష్టించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఎన్నికలో టీడీపీ గెలవడం సంగతి అటుంచి అసలు డిపాజిట్లయినా వస్తాయో లేదోననే ఆందోళన ఆ పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతోంది. జనం తన ప్రసంగాలు వినకుండా వెళ్లిపోతుండడంతో చంద్రబాబు వారిపైనే విరుచుకుపడి తిడుతుండడం గత నాలుగు రోజుల ప్రచారంలో కనిపిస్తోంది. దీంతో చవకబారు రాజకీయాలు, డ్రామాలకు మళ్లీ పదును పెట్టారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మల్లెల బాబ్జితో మొదలైన చంద్రబాబు డ్రామా రాజకీయం నిరంతరం కొనసాగుతోంది.
గత నెల ఒకటో తేదీన తిరుపతి ఎయిర్‌పోర్టులో హైడ్రామా సృష్టించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో దౌర్జన్యాలు జరిగిపోతున్నాయని అలజడులు సృష్టించే ప్రయత్నంలో చిత్తూరు వెళుతున్న ఆయన్ను పోలీసులు ఎయిర్‌పోర్టులో అడ్డుకోవడంతో అక్కడే మూడు గంటలు బైఠాయించి నాటకాన్ని రక్తి కట్టించారు. గత ఏడాది జనవరి 8న అమరావతి పరిరక్షణ సమితి బస్సు యాత్ర ప్రారంభించే పేరుతో విజయవాడ బెంజి సర్కిల్ వద్ద బైఠాయించి హడావుడి చేశారు. గత సంవత్సరం ఫిబ్రవరి 27న విశాఖపట్నం ఎయిర్‌పోర్టు వద్ద నాలుగు గంటలు కార్యకర్తలతో బైఠాయించి హడావుడి చేశారు.
ఎన్నికల వేళ ఎన్నెన్ని వేషాలో!
Published Tue, Apr 13 2021 3:31 AM | Last Updated on Tue, Apr 13 2021 8:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment