ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన చంద్రబాబు రోడ్ షో(ఫైల్)
సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రచారపిచ్చికి పేదప్రజలు నిలువునా ప్రాణాలు కోల్పోతున్నారు. మొన్న కందుకూరు, నిన్న గుంటూరు. కార్యక్రమం ఏదైనా సరే తను పాల్గొన్న వాటికి భారీఎత్తున ప్రజలు వచ్చారని చూపుకునేందుకు, ప్రచారం చేసుకునేందుకు గంటల కొద్దీ ఆలస్యం చేయడం బాబుకు షరా మామూలే. ఆదివారం గుంటూరులో చీరలు, సరుకులు పంచిపెడతామని చెప్పిన సమయానికి ప్రారంభించకపోగా మూడు గంటలు ఆలస్యంగా చంద్రబాబు వేదిక వద్దకు చేరుకున్నారు. గంటాపది నిమిషాలు ఉపన్యాసం చెప్పి నామమాత్రంగా పంపిణీ చేసి వెళ్లిపోయారు.
ఆ తరువాత తొక్కిసలాట జరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయాలకు గురై ఆసుపత్రుల పాలైన సంగతి తెలిసిందే. చీరలు, వస్తువులు పంపిణీ చేస్తామని పేదలకు ఆశపెట్టి మధ్యాహ్నం 12 గంటల నుంచే వివిధ ప్రాంతాల నుంచి సమీకరించారు. అసలే జనవరి ఒకటో తేదీ. పండుగ వాతావరణం. ఆ సమయంలో కుటుంబ సభ్యులతో గడపాలని ఎవరైనా కోరుకుంటారు. ఉచితంగా వస్తాయన్న ఉద్దేశంతో అన్ని వయసుల పేద మహిళలు చేరుకున్నారు. అక్కడకు వచ్చిన వారికి కనీసం మంచినీటి వసతి, ఇతరత్రా సరిపడా వసతులు, ఏర్పాట్లు చేసిన దాఖలాలే లేవని బాధితవర్గాలు ముక్తకంఠంతో వాపోయాయి.
చంద్రబాబు వచ్చి ప్రసంగించి తిరిగి వెళ్లిపోయే వరకు వందలు, వేలాది మందిని నాలుగు గంటలకుపైగా కూర్చోపెట్టారు. బాబు వెనుతిరిగేప్పటికీ దాదాపు చీకటి పడుతోంది. గంటల కొద్దీ వేచి ఉన్న వారు ఇళ్లకు త్వరగా తిరిగి వెళ్లాలనే ఆతృతతో ముందుకు చొచ్చుకు రావడంతో తొక్కిసలాట జరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఏదైనా భారీ ఎత్తున పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నప్పడు సమయం చూసుకోవడం నిర్వాహకుల కనీస బాధ్యత. తనది నలభయ్యేళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు అక్కడి పరిస్థితులను కనీసమైనా అంచనా వేసుకోలేకపోయారా అనేది మొదటి ప్రశ్న. ఇదే ప్రశ్న ఇప్పుడు అన్నివైపుల నుంచి వస్తోంది.
జనం కోసం జాప్యం చేయడం అలవాటే..
ఆలస్యం అమృతం విషం.. అంటారు పెద్దలు. ఆలస్యమయ్యే కొద్దీ అనర్థాలు అధికమనేది దీనర్థం. కానీ టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించినంత వరకు ఇది పూర్తిగా భిన్నం. తను పాల్గొనే కార్యక్రమం ఎంత ఆలస్యమైతే అంత మంచిదనేది ఆయన నిశి్చతాభిప్రాయమనేది పరిశీలకుల మాట. అది పాదయాత్ర అయినా, రోడ్ షో, బహిరంగ సభ చివరకు పరామర్శ అయినా సరే లేట్ అంటే బాబుకు భలే మోజని ఉదహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రజలు పాల్గొనే బహిరంగ సభలను ఆలస్యంగా నిర్వహించడానికి స్లీపర్‌సెల్స్‌గా ప్రత్యేక బృందాలూ ఏర్పాటై అంతర్లీనంగా పనిచేస్తుంటాయనేది పబ్లిక్‌టాక్.
మరోవైపు లేట్ అయిపోతోంది, త్వరపడండనే సన్నాయినొక్కుల ‘హెచ్చరిక’లు మైకుల్లో ధ్వనిస్తుంటాయి. ఇవన్నీ పక్కా ప్లానింగ్‌తోనే అనేది పారీ్టలోని ఆయా జిల్లాల ముఖ్యులకు తెలియని రహస్యాలేమీ కావు. సమయం, సందర్భం ఏదని కూడా చూడకుండా, వాస్తవాలను వెల్లడించకుండా ప్రజలు అడగడుగునా బ్రహ్మరథం పట్టారనే పచ్చ మీడియా పైత్యపురాతలు పలుసార్లు వెగటు పుట్టిస్తుంటాయని టీడీపీ నాయకులే వాపోయి న సందర్భాలు లేకపోలేదు. ఇక టీడీపీ సోషల్ మీడి యా బృందాలు హైప్ సృష్టించడం పరాకాష్ట. ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని కార్యక్రమాలను పరిశీలిస్తే..
►బుధవారం కందుకూరు కార్యక్రమం 5.15 గంటల నుంచి రాత్రి ఏడు గంటల్లోగా ముగియాలి. కానీ సింగరాయకొండ సెంటర్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలోని కందుకూరుకు చేరుకోవడానికి మూడు గంటల సమయం పట్టిందని పచ్చ మీడియా విశ్లేషించింది. సభ ముగించాల్సిన సమయానికన్నా మరో అరగంట ఆలస్యంగా ఇరుకు ప్రాంతంలోకి చేరుకోవడం, 8 మంది మృతికి కారణం కావడం చంద్రబాబుకే చెల్లింది.
►చంద్రబాబు కొవ్వూరులో డిసెంబరు ఒకటో తేదీ రాత్రి 8 గంటలకు జరగాల్సిన సభను 10.30 గంటలకు ప్రారంభించి 50 నిమిషాలపాటు ప్రసంగించారు. రెండో తేదీ నిడదవోలులో మధ్యాహ్నం మూడు గంటలకు బదులు సాయంత్రం 6.30 గంటలకు మొదలెట్టి 40 నిమిషాలు మాట్లాడారు. తాడేపల్లిగూడెంకు మూడన్నర గంటలు ఆలస్యంగా రాత్రి 9.30 గంటలకు చేరుకున్నారు.
►వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన పేరిట అక్టోబరు 19న పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేట, గురజాల నియోజకవర్గాలకు చంద్రబాబు వెళ్లారు. గురజాల నుంచి సాయంత్రం 6.15 గంటలకు ఉండవల్లికి బయలుదేరతారని షెడ్యూల్ ప్రకటించగా రాత్రి 12.15 గంటలకు ఉపన్యాసం ముగించారు. రాత్రి 7–11 గంటల మధ్యలో రెండుచోట్ల పొలాలను సందర్శించడం చంద్రబాబుకే సాధ్యమైంది.
►నవంబరు 4వ తేదీ ఎన్‌టీఆర్ జిల్లాలో బాదుడే బాదుడు కార్యక్రమం పేరిట నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. ఏడు గంటలకు జరగాల్సిన మీటింగ్ రాత్రి 11 గంటలకు జరగడం గమనార్హం.
►గోదావరి పుష్కరాలలో ప్రచారపిచ్చి పీక్‌కు చేరి 29 మందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో విశాఖలో తిషే్టసిన చంద్రబాబు ఫొటోలకు ఫోజులిచ్చే క్రమంలో తెల్లవారుజామున 3, 4 గంటలప్పుడు కూడా తెగతిరిగేశారు. బాబు ప్రచారపిచ్చితో తమను పనులు చేసుకోనివ్వకుండా ఆటంకం కలిగిస్తూ ప్రజలకు ఇబ్బందులు పెంచేస్తున్నారని అధికారులు, సిబ్బంది వాపోయిన సందర్భాలు అనేకం. అంతేనా తుపాన్లను సైతం అడ్డుకుంటానని వల్లెవేయడం బాబు ప్రచారానికి పరాకాష్టగా పరిశీలకులు గుర్తుచేస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment