‘అమ్మకు వందనం’ పథకంపై చంద్రబాబు యూటర్న్
సర్వత్రా విమర్శలతో సంకటస్థితిలో టీడీపీ ప్రభుత్వం
సరిగ్గా ఈ సమయంలో నేనున్నానంటూ రంగంలోకి దిగిన షర్మిల
సాక్షి, అమరావతి: ‘అమ్మ ఒడి’ పథకం విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారని ఏపీసీసీ చీఫ్ షర్మిల వ్యాఖ్యానించడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో చెప్పింది చెప్పినట్లు అమలు చేసి చూపిన చరిత్ర వైఎస్ జగన్‌ది. పిల్లలను బడికి పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు మాట నిలుపుకున్నారు. జగన్ ప్రతి తల్లికి రూ.15 వేలు ఇచ్చారని, తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు సహా కూటమి నేతలంతా హామీ ఇచ్చారు.
జగన్, చంద్రబాబు హామీ మధ్య తేడా ఇంత స్పష్టంగా కనిపిస్తోంటే ఎవరు మోసం చేసింది షర్మిలకు కనిపించడం లేదు కాబోలు. జగన్ కూడా ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇస్తానని చెప్పారని ఇప్పుడు షర్మిల చెప్పడం.. ముమ్మాటికీ మాట తప్పిన చంద్రబాబును కాపాడటానికేనని స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా కనిపించే మూడు పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ అయితే.. కనిపించని నాలుగో పార్టీనే రాష్ట్ర కాంగ్రెస్ అన్నది షర్మిల మాటలను బట్టి మరోసారి నిరూపితమైంది.
వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను చూడకుండానే శుక్రవారం ఆమె విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో వైఎస్ జగన్‌పై ఆరోపణలు గుప్పించడం విస్తుగొలుపుతోంది. ప్రతిపక్ష పార్టీగా అధికార పక్ష హామీలపై నిలదీయాల్సింది పోయి.. జగన్‌ను తప్పు పట్టడం విస్తుగొలుపుతోంది. అసాధ్యమైన హామీలతో ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మేనిఫెస్టో అమలు చేయలేక ఆత్మరక్షణలో పడగానే షర్మిల హఠాత్తుగా తెరపైకి వచ్చారు. తల్లికి వందనం పథకంపై చంద్రబాబు యూటర్న్ తీసుకోవడాన్ని ప్రశ్నిస్తారని అంతా భావించారు.
సూపర్ సిక్స్ మేనిఫెస్టోను ఎప్పటి నుంచి అమలు చేస్తారని నిలదీస్తారనుకున్నారు. కానీ అందుకు విరుద్ధంగా షర్మిల చంద్రబాబుకు రాజకీయంగా వత్తాసు పలకడం ద్వారా చంద్రబాబు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకేనని స్పష్టమైంది. చంద్రబాబు ‘తల్లికి వందనం’ పథకం అమలులో ప్రజలను మోసగించిన తీరును వివరిస్తూ సాక్షి పత్రిక ప్రచురించిన కథనాన్ని చూపిస్తూ షర్మిల వైఎస్సార్‌సీపీని విమర్శిస్తూ చంద్రబాబు స్క్రిప్‌్టను వినిపించడం విస్మయపరిచింది.
జగనన్న అమ్మ ఒడితో విద్యా విప్లవం
» ‘జగనన్న అమ్మ ఒడి పథకం’ దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. విద్యా రంగంలో విప్లవాన్ని తీసుకురావడమే కాకుండా సామాజిక, సాంఘిక సంస్కరణగా గుర్తింపు పొందింది. జగన్ కచ్చితమైన క్యాలండర్‌ను అనుసరిస్తూ ఈ పథకం కింద నాలుగేళ్లలో రూ.26,067.28 కోట్లు తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేశారు.
» వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే అన్ని పథకాలు ఈపాటికి సక్రమంగా అమలయ్యేవని ప్రజలు ఇప్పటికే గుర్తించారు. ఇప్పటికే జగనన్న అమ్మ ఒడి పథకం రూ.6,500 కోట్లు తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అయ్యేవి. విద్యా దీవెన పథకం రెండు విడతల్లో రూ.1,400 కోట్లు ఖాతాల్లో వేసేవారు.
వసతి దీవెన పథకం కింద రెండు విడతల కింద రూ.1,100 కోట్లు లబ్ధిదారులకు అందేవి. వైఎస్సార్ రైతు భరోసా మొదటి విడత కింద రూ.7 వేల కోట్లకుపైగా అన్నదాతలకు జమ చేసేవారు. మత్స్యకార భరోసా కింద రూ.130 కోట్లు మత్సకారులకు దక్కేవి. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద రూ.1,400 కోట్లు అందేవి.
» ఈ విషయాలన్నీ చెబుతూ షర్మిల చంద్రబాబును నిలదీయాలి. సూపర్ సిక్స్ పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారని ప్రశ్ని0చాలి. రైతులకు రూ.20 వేలు పెట్టుబడి సాయం, పిల్లలందరికీ రూ.15 వేలు, మత్స్యకార భరోసా, 1.85కోట్ల మంది మహిళలకు నెలకు రూ.1,500, 1.60 కోట్ల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం, ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు ఇస్తారని అడగాలి.
బాబుకు మేలు చేసేందుకే ఆమె రాజకీయం చేస్తున్నారని ప్రజలు గమనించారు. అందుకే ఆమెకు కడప లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్ దక్కలేదు. రాష్ట్రంలో పేదల గొంతును వినిపించేది.. సంక్షేమం, అభివృద్ధి కోసం పోరాడేది వైఎస్సార్‌సీపీయేనని ప్రజలు గుర్తించారన్నది సుస్పష్టం.
షర్మిల ఇకనైనా తెలుసుకో..
Comments
Please login to add a commentAdd a comment