![Chandramouli carafe for solution of Talapatra book](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/talapatra.jpg.webp?itok=4taFFoqa)
రాష్ట్రంలో రెండో వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు
పదిపైగా తాళపత్రాలకు శుద్ధ ప్రతుల తయారీ
తాళపత్ర మన్నిక 300 సంవత్సరాలకు పైమాటే
తాళపత్రాల సేకరణకు ప్రోత్సాహం ఇవ్వాలంటున్న చంద్రమౌళి
అద్దంకి: తాళ పత్రాల గ్రంథాలను పరిష్కరించడంలో బాపట్ల జిల్లా అద్దంకి పట్టణానికి చెందిన జ్యోతి చంద్రమౌళి కేరాఫ్‌గా నిలుస్తున్నారు. ఈయన తాళపత్ర గ్రంథాలను పరిష్కరించడంలో కృష్ణా జిల్లాకు చెందిన తంగిరాల సుబ్బారావు తరువాత రాష్ట్రంలోనే రెండో వ్యక్తిగా నిలిచాడు. ఈయన వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిగా పనిచేసే సమయం నుంచి రిటైరైన తరువాత తాళపత్రాలను సేకరించి వాటిని శుభ్రం చేసి వాటికి పుస్తక రూపం ఇచ్చి భావితరాలకు అందేలా కృషి చేస్తున్నారు.
ఆయన ఇప్పటికి పది తాళపత్రాల గ్రంథాలను పరిష్కరించి శుద్ధ ప్రతులను తయారు చేశారు. ఇప్పటికే ఒక గ్రంథం అచ్చయింది. మిగిలిన వాటికి పుస్తకం రూపం ఇవ్వడం ఖర్చుతో కూడుకున్న పని. ప్రభుత్వం ప్రోత్సాహమో, లేక ఏదైనా సంఘాల చేయూత ఉంటేనే అవి అచ్చు అవుతాయి.
ఇప్పటి వరకు పరిష్కరించిన తాళపత్ర గ్రంథాలు
చంద్రమౌళి తన దగ్గరకు తెచ్చి ఇచ్చిన తాళపత్ర గ్రంథాల్లో ఇప్పటికి పోచయ్య బొంగరాలాట, కాటంరాజు కథ, వల్లురాజు కథ, ఆవుల మేపు, భట్టు రాయభారం, తరిగొండ వెంగమాంబ కథ, రాజయేగామృత సారం, గ్రామీణ వైద్యం అనే గ్రంథాలకు పుస్తకం రూపం ఇచ్చారు. పురాతన తాళపత్రాల గ్రంథాలను పరిష్కరించడం అంత తేలికైనపని కాదు. ఒక్కో ఆకు భద్రంగా బయటకు తీసి వాటికి రెండు రకాల రసాయనాలు పూస్తేనే అందులోని అక్షరాలు కనిపించి పరిష్కారానికి ఉపయోగిస్తాయి.
తాళపత్ర పూర్వ చరిత్ర..
జ్యోతి చంద్రమౌళి అందించిన వివరాల మేరకు ప్రస్తుతం, ఏదైనా రచన చేయాలన్నా ఉత్తరం రాయాలన్నా కాగితం అవసరం. అయితే అది ఇప్పటి మాట. ఒకప్పుడు కాగితాలు లేవు. అప్పుడు గ్రంథాలను రాయాలన్నా ఉత్తరాలు రాయాలన్నా తాళ (తాటి ఆకులు) పత్రాలను వాడేవారు. ప్రముఖంగా గ్రంథాలను రాయడానికి వీటిని ఎక్కువగా ఉపయేగించేవారు. అంతకు మునుపు తామ్ర పత్రాలు అంటే సన్నగా చేసిన రేకులపైన రాసేవారు. ఇవి 300 సంవత్సరాలకు పైగానే మన్నుతాయి.
తాళపత్రాల సేకరణకు ప్రోత్సహించాలి
తాళపత్ర గ్రంథాలు ఇప్పటికే వేటపాలెం, రాజమండ్రి, కడప వంటి గ్రంథాలయాల్లో ఉన్నాయి. అయితే ఇంకా చాలా గ్రంథాలు తరతరాల నుంచి ఇళ్లల్లో ఉన్నాయి. ఆయా గ్రంథాలను బయటకు తీసి వాటికి పుస్తక రూపం ఇస్తే ఆయా గ్రంథాలు వెలుగు చూస్తాయి. – విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, రచయిత, శాస్త్ర పరిశోధకుడు
Comments
Please login to add a commentAdd a comment