అడ్డతీగల: కోతుల బెడద నివారణ కోసం వరి చేను చుట్టూ అమర్చిన వలలో చిక్కిన చిరుత పులి తప్పించుకుపోవడానికి చెట్టు పైకి ఎక్కి.. దానికి వేలాడుతూ రాత్రంతా అవస్థ పడింది. అటవీ అధికారులు వచ్చి రక్షించినా.. తీవ్ర గాయంతో చివరకు ప్రాణాలు విడిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం ఎల్లవరం శివారున రేగులపాడు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం రేగులపాడు వద్ద చెట్టుకు వేలాడుతున్న చిరుతను చూసిన స్ధానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే రంపచోడవరం డీఎఫ్‌వో జీజీ నరేంద్రన్, అడ్డతీగల సబ్ డీఎఫ్‌వో బి.శ్రీరామారావు, అడ్డతీగల రేంజి అధికారి షేక్ షెహన్షా, ఎస్‌ఐ అప్పలరాజు ఇతర సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. వల నడుముకు చుట్టుకుపోయి వేలాడుతున్న చిరుతను రక్షించేందుకు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. విశాఖపట్నం జూ నుంచి రెస్క్యూ టీంని రప్పించి రాజమహేంద్రవరం నుంచి బోను తెప్పించారు.
రాత్రి నుంచి చెట్టుకు వేలాడడంతో చిరుత అలసిపోయిన విషయం గమనించి.. ట్రాక్టర్‌లో నిచ్చెన ఉంచి దాని మీద ఆధారపడి చిరుత సేదతీరేలా చేశారు. మంచినీటిని అందించారు. అనంతరం రెస్క్యూ టీం సభ్యులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చిరుతను బోనులోకి చేరవేశారు. అయితే కొద్దిసేపటి అనంతరం చిరుత మరణించింది. దీంతో అటవీ అధికారులు పోస్ట్‌మార్టం నిర్వహించి ఘటనా స్ధలంలోనే చిరుతను దహనం చేశారు.
కొన్నిగంటల పాటు వల నడుం చుట్టూ చుట్టుకుపోవడంతో చిరుత పెనుగులాడటం, ఆహారం లేక నీరసించి పోవడంతో మృతి చెందిందని డీఎఫ్‌వో నరేంద్రన్ చెప్పారు. ఈ ప్రాంతంలో చిరుతలు మరిన్ని ఉండవచ్చని, ప్రజలు రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. వన్యప్రాణులకు ఎటువంటి హాని తలపెట్టకుండా అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment