బీసీ ఉప కులాల కార్పొరేషన్ చైర్మన్లతో కలిసి సంఘీభావం తెలుపుతున్న మంత్రి చెల్లుబోయిన
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో గీత కార్మికుల జీవన కష్టాన్ని కళ్లతో కాకుండా మనసుతో చూశారని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. అందుకే బీసీల ఆత్మగౌవరం పెంచేలా, జీవన భద్రత కల్పించేలా పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. గీత కార్మికుల కోసం కొత్త పాలసీ తెచ్చి, వారికి భద్రత కల్పించారని తెలిపారు.
మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బీసీ ఉప కులాల కార్పొరేషన్ చైర్మన్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో గౌడ, శెట్టిబలిజ, శ్రీశైన, యాత, ఈడిగ ఉపకులాలతో పాటు షెడ్యూల్ కులాలు, తెగల వాళ్లు కూడా కల్లు గీత వృత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరి జీవన విధానం మెరుగు పడేలా ఈ నెల 5న జీవో 693 ద్వారా సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రమాదవశాత్తు గీత కార్మికులు మృతి చెందితే, ఆ కుటుంబాలు రోడ్డునపడకుండా ఆదుకునేందుకు ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచారు’ అని చెప్పారు. ఈ గొప్ప నిర్ణయంపై రాష్ట్రంలోని గీత, గీత ఉప కులాలన్నీ ముక్త కంఠంతో హర్షం వ్యక్తం చేస్తూ ర్యాలీలు నిర్వహించి, సీఎం జగన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఇంకా ఏమన్నారంటే..
బీసీలకు అన్ని విధాలుగా అండగా నిలిచిన సీఎం
► సీఎం జగన్ అన్ని విధాలా బీసీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. నన్ను బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా, మరో ఐదుగురిని గీత ఉప కులాల కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమించడం పట్ల మాకు ఎంతో ఆనందంగా ఉంది. గీత కులాల వారు సీఎం జగన్‌ను తమ బిడ్డగా భావిస్తున్నారు.
► గీత ఉప కులాల వారు.. శ్రీకాకుళం ప్రాంతంలో శ్రీశైనులుగా, విజయనగరం, విశాఖపట్నంలో యాతలుగా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో శెట్టిబలిజలుగా, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గౌడలుగా, రాయలసీమ జిల్లాల్లో ఈడిగలుగా జీవనం సాగిస్తున్నారు.
► ఈ ఐదు కులాల ప్రధాన వృత్తి గీత. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కాకముందు, గీత వృత్తిదారుల్లో చదువు పట్ల ఆసక్తి చూపించిన వారి సంఖ్య చాలా తక్కువ. వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి రూపకల్పన చేసి, అమలు చేశాక, లక్షలాది మంది పిల్లలు ఉన్నత చదువులు చదివి, విదేశాలకు వెళ్లారు. సీఎం జగన్ పాలనలో ఇప్పుడు ఆ సంఖ్య ఇంకా పెరిగింది.
► టీడీపీకి గీత కులాల గురించి మాట్లాడే అర్హతే లేదు. బీసీలను చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ మోసం చేశారు. ఓట్లు కోసం మాత్రమే మమ్మల్ని వాడుకున్నారు. దేశంలో ఎక్కడా ఎక్స్‌గ్రేషియా రూ.లక్షకు మించి లేదు. అదే సీఎం జగన్ రూ.10 లక్షలకు పెంచడం హర్షణీయం. గీత కార్మికులకు ఏపీలో అందుతున్న సహకారం దేశంలో మరెక్కడా లేదు.
► ఈ సమావేశంలో కార్పొరేషన్ల చైర్మన్లు డాక్టర్ గుబ్బాల తమ్మయ్య (శెట్టి బలిజ), మాదు శివరామకృష్ణ (గౌడ), పిల్లి సుజాత (యాత), కె.సంతు (ఈడిగ) పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment