
కోర్టుకు హాజరైన చెవిరెడ్డి, జక్కంపూడి రాజా
తిరుపతి రూరల్: ప్రత్యేక హోదా కోసం గళమెత్తిన వారిపై తెలుగుదేశం ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు నేటికీ వదలిపెట్టడం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ 2015లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఆ ఉద్యమాలను అణచివేసేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు, ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు నమోదు చేసింది.
ఆ కేసులకు సంబంధించి ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా రాజా నగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అతని సోదరుడు గణేష్, తల్లి విజయలక్ష్మి మంగళవారం అమరావతిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ జరిగిన ఉద్యమాల్లో ప్రజల తరఫున గళమెత్తిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, ప్రస్తుత రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, గణేష్, విజయలక్ష్మి, కార్యకర్తలు కలిపి మొత్తం 26 మందిపై 2015లో అప్పటి ప్రభుత్వం కేసులు పెట్టింది.
న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. అప్పట్లో వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఆనాటి ఆందోళనలకు సంఘీభావం తెలిపిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపైనా రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి అమరావతి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో మంగళవారం వాయిదా ఉండటంతో ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, జక్కంపూడి రాజా, గణేష్, విజయలక్ష్మి విచారణ నిమిత్తం హాజరయ్యారు.