సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్లను సులభతరం చేసే ఇ–స్టాంపింగ్ సేవలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా సురక్షితంగా రూపొందించిన ఇ–స్టాంపింగ్ విధానం వల్ల ప్రజలకు అనేక ప్రయోజనాలు అందనున్నాయి. www. shcilestamp. com వెబ్‌సైట్, ఇ–స్టాంపింగ్ మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ఇ–స్టాంపులను పొందవచ్చు. నగదు, చెక్కు, ఆన్‌లైన్ (నెఫ్ట్, ఆ ర్టీజీఎస్, పీఓఎస్, యూపీఐ) ద్వారా సులభంగా చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఎస్‌బీఐ, ఆప్కాబ్, యూనియన్ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన బ్రాంచిలు, సీఎస్‌సీ కేంద్రాలు, స్టాంప్ అమ్మకందార్లు, స్టాక్ హోల్డింగ్ బ్రాంచ్‌లు కలిపి మొత్తం 1400 పైగా కేంద్రాల వద్ద ఇ–స్టాంపింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో వెయ్యికిపైగా కేంద్రాల వద్ద త్వరలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఆస్తుల క్రయవిక్రయాలు నిర్వహించే పౌరులందరూ 1400 పైగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఇ–స్టాంపింగ్ ద్వారా స్టాంప్ పేపర్లు కొనుగోలు చేసి సులభంగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీలను చెల్లించవచ్చు.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సెంట్రల్ రికార్డు నిర్వహించే ఏజెన్సీ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సులభంగా సేవలందించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ విధానంలో వినియోగదారులే స్వయంగా తమ డాక్యుమెంట్లను తయారు చేసుకుని ఇ–స్టాంపింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉంటుంది.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఐటీ సలహాదారు శేషిరెడ్డి, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ రామకృష్ణ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గుంటూరు డీఐజీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment