కీర్తి (ఫైల్)
సాక్షి, పెదకూరపాడు: పాపా.. కీర్తీ... ఎక్కడ ఉన్నావమ్మా.. ఎలా ఉన్నావు తల్లీ.. పుట్టిన రోజు అని నాన్న కేక్ తెచ్చాడు.. పెదనాన్న కొత్త డ్రస్సు కొన్నాడు.. జాలిలేని దేవుడు నా బిడ్డ జాడ చూపలేదు.. కళ్ల ముందు తిరిగే పాప 40 గంటలు గడిచినా కనిపించలేదంటూ చిన్నారి కీర్తి తల్లి రోదిస్తున్న తీరు అందరినీ కంట తడి పెట్టిస్తోంది. మండలంలోని పాటిబండ్ల గ్రామానికి చెందిన పాటిబండ్ల రమేష్, శ్రీలక్ష్మి అలియాస్ తిరుపతమ్మ రెండో కుమార్తె నాలుగేళ్ల కీర్తి సోమవారం ఉదయం 11 గంటల నుంచి కనిపించకుండా పోయిన సంగతి విదితమే.
చిన్నారి కీర్తి జాడ కనుగొనేందుకు సోమవారం రాత్రి నుంచి తుళ్ళూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. గుంటూరు, విజయవాడ, ఒంగోలు, సత్తెనపల్లి పట్టణాల్లోని బస్టాండ్, రైల్వే స్టేషన్ ఇతర ప్రాంతాల్లో గాలించారు. పాటిబండ్ల గ్రామంలో మంగళవారం ఏఎన్‌ఎస్ బృందాలు అణువణువు గాలించాయి. అయినప్పటికీ పాప ఆచూకీ దొరకకపోవటంతో కుటుంబ సభ్యులు మరింత ఆందోళన చెందుతున్నారు. (జన్మదినం రోజే బలవన్మరణం)
యాచకురాలిపై అనుమానం
సోమవారం గ్రామంలో ఓ గుర్తు తెలియని యాచకురాలు పసుపు రంగు చీర ధరించి బ్లూమాస్క్ పెట్టుకుని అనుమానాస్పదంగా సంచరించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ కోణంలో పోలీసులు గ్రామంలో ఉన్న సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండటంతో తల్లిదండ్రులు చిన్నారులను ఇళ్ల వద్ద వదిలివెళుతున్నారు. ఈ నేపథ్యంలో యాచకురాలు కీర్తిని అపహరించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment