
గుంటూరు ఎడ్యుకేషన్: సీఎం వైఎస్ జగన్‌కున్న చిత్తశుద్ధి వల్లే ప్రభుత్వ విద్యా రంగం అభివృద్ధి చెందుతోందని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు పేర్కొన్నారు. ‘మనబడి:నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విద్యాలయాల్లో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే ఆధునిక వసతులను సమకూరుస్తున్నారని వివరించారు. గుంటూరులోని హిందూ కాలేజ్‌లో సోమవారం భారతీయ శిక్షణా మండల్, నీతి ఆయోగ్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ నూతన విద్యా విధానంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో చినవీరభద్రుడు మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద పిల్లలకు కూడా ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా సకల వసతులతో నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు.
మొదటి దశలో 15 వేలకు పైగా పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని.. మిగిలిన 30 వేల స్కూళ్లతో పాటు జూనియర్, డిగ్రీ కాలేజీల రూపురేఖలు మార్చేందుకు కూడా అవసరమైన ప్రణాళిక సిద్ధం చేశారని వివరించారు. విద్యా బోధనలో వర్చువల్, ఆన్‌లైన్ వంటి సదుపాయాలు ఎన్ని వచి్చనా.. తరగతి గదిలో విద్యార్థుల ఎదుట పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం కాదన్నారు. పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు గతంలో అదే గ్రామాల్లో నివసిస్తూ, విద్యార్థుల తల్లిదండ్రులకు అందుబాటులో ఉండేవారని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనుమరుగైందన్నారు. పనిచేసే చోట నివాసముండి, పాఠశాలే తన సర్వస్వంగా భావించే ఉపాధ్యాయులే సమాజంలో గౌరవాన్ని పొందగలరని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులకు కూడా సివిల్స్ స్థాయిలో శిక్షణ అవసరమని భావించి, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుకు రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న స్కూల్ కాంప్లెక్స్‌ల విధానాన్ని ఎన్‌ఈపీలో పొందుపర్చిన విషయాన్ని ఈ సందర్భంగా చిన వీరభద్రుడు ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment