సాక్షి, అమరావతి: టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి సీఐడీ అధికారులు మంగళవారం నోటీసులిచ్చారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి వెలువడుతున్న ‘చైతన్య రథం’ పత్రిక ద్వారా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆర్థి క మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన ఫిర్యాదు మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరిట ఈ నోటీసులిచ్చారు.
‘చైతన్య రథం’ పత్రికలో గత ఏడాది నవంబరు 23వ తేదీ ఎడిషన్‌లో ‘అపరిచితుడు’, ‘బుగ్గనగారి బాగోతం’ శీర్షికలతో అవాస్తవ కథనాలు ప్రచురించి తనపై దుష్ప్రచారం చేశారని మంత్రి బుగ్గన... సీఐడీకి ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల్లో తాను సమర్పిం చిన నామినేషన్ పత్రాలను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసి అందులో పేర్కొన్న ఆస్తుల వివరాలను ఫోర్జరీ చేశారని బుగ్గన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ విధంగా తన భూముల విస్తీర్ణం, వాటి విలువను అమాంతంగా పెంచేసి దుష్ప్రచారం చేశారన్నారు.
సీఐడీ అధికారులు ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, విచారించి ఈ నోటీసులిచ్చారు. సెక్షన్ 92 సీఆర్‌పీసీ కింద టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరిట నోటీసులు ఇచ్చారు. 2022, నవంబరు 23 నాటి చైతన్య రథం పత్రిక కాపీ, ఆ పత్రిక ఎడిటర్, ఆ వార్తలు రాసిన విలేకరి వివరాలు తెలపాలని నోటీసులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment