గొడవ పడుతున్న న్యాయవాదులు
సాక్షి, అమరావతి: బెజవాడ బార్ అసోసియేషన్‌కు చెందిన కొందరు న్యాయవాదులు.. హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యకలాపాల్లో జోక్యానికి ప్రయత్నించడం, హైకోర్టు వద్ద సర్వసభ్య సమావేశానికి పిలుపునివ్వడం వివాదాస్పదమైంది. ఇది గురువారం న్యాయవాదుల మధ్య ఘర్షణకు దారి తీసింది. హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శి, అధ్యక్షులను విజయవాడ న్యాయవాదులు నిర్ణయించడం ఏమిటంటూ హైకోర్టు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. సర్వసభ్య సమావేశం తీర్మానాలను కొందరు చించివేయగా.. మరికొందరు కుర్చీలు విసిరేశారు. బయట నుంచి వచ్చిన న్యాయవాదులు విసిరేసిన కుర్చీ తగలడం వల్ల బార్ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్‌కు గాయమైందంటూ.. ఆయన జూనియర్లు ఆందోళనకు దిగారు.
ఈ సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం అజయ్‌కుమార్ తదితరులు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే న్యాయవాదుల మధ్య వివాదంలో తాను ఏరకంగానూ జోక్యం చేసుకోనని ప్రధాన న్యాయమూర్తి వారికి స్పష్టం చేసినట్లు తెలిసింది. మరోవైపు హైకోర్టు న్యాయవాదులు మెట్టా చంద్రశేఖర్‌తో పాటు మరికొందరు ఎస్‌పీఎఫ్ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. హైకోర్టు న్యాయవాదుల సంఘంలో సభ్యులు కాని వ్యక్తులు తమపై దాడికి ప్రయత్నించారంటూ డీఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో వారు పేర్కొన్నారు.
దీనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. వాస్తవానికి హైకోర్టు న్యాయవాదుల సంఘం పాలకవర్గం కాల పరిమితి ఎప్పుడో ముగిసింది. గతేడాది ఎన్నికలు జరగాల్సి ఉన్నా కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీకి తెలియకుండా సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించడం వివాదానికి కారణమైంది. చలసాని అజయ్ ఇటీవల జరిగిన బెజవాడ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకున్నారని, అతనికి హైకోర్టు న్యాయవాదుల సంఘంలో ఓటు హక్కు లేదని పలువురు న్యాయవాదులు చెబుతున్నారు. బయట వ్యక్తులను తీసుకొచ్చి ఉద్దేశపూర్వకంగా ఆయనే గొడవ సృష్టించారని చెబుతున్నారు.
చదవండి:
వీడియో వైరల్: హైదరాబాద్‌కు రజనీకాంత్
రోజుకు 6 లక్షల మందికి టీకా: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment