డ్రోన్స్ టెక్నాలజీ భవిష్యత్‌లో గేమ్ ఛేంజర్ కానుంది
కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర డ్రోన్ హబ్ కోసం 300 ఎకరాలు
15 రోజుల్లో డ్రోన్స్ విధానం తీసుకువస్తాం
డ్రోన్ సిటీ ఆఫ్ ఇండియాగా అమరావతి
డ్రోన్స్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి/భవానీపురం (విజయవాడపశ్చిమ) : డ్రోన్స్ తయారీ, వినియోగంలో ఎక్కువ ఆంక్షలు పెట్టవద్దని, పరిమితమైన నియంత్రణ ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. డ్రోన్స్ టెక్నాలజీ భవిష్యత్‌లో గేమ్ ఛేంజర్ అవుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. రెండు రోజులు జరిగే అమరావతి డ్రోన్స్ సమ్మిట్–2024ను చంద్రబాబు మంగళవారం మంగళగిరిలో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్స్ హబ్ కోసం 300 ఎకరాలు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో 20,000 మందికి డ్రోన్ పైలట్ శిక్షణ ఇస్తామన్నారు. అమరావతిని డ్రోన్ సిటీ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దుతామన్నారు. డ్రోన్స్ తయారీదారులు, ఆవిష్కర్తలకు వ్యాపార అనుకూల వాతావరణాన్ని కల్పించేలా 15 రోజుల్లో సమగ్ర విధానాన్ని తెస్తామని చెప్పారు. డ్రోన్ ప్రాజెక్టుల కోసం రాష్ట్రాన్ని టెస్టింగ్ క్షేత్రంగా ఉపయోగించుకోవాలని సూచించారు. తయారీదారులకు తానే అంబాసిడర్‌గా ఉంటానని, మార్కెట్‌ను ప్రోత్సహిస్తానని అన్నారు.
వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పనలో డ్రోన్స్ కీలకం కానున్నాయని తెలిపారు. రోడ్లు, ట్రాఫిక్, చెత్త నిర్వహణలో డ్రోన్లు వినియోగిస్తామన్నారు. నేరాలు చేసే వారిపై డ్రోన్స్ ద్వారా నిఘా పెడతామన్నారు. సదస్సులో భాగంగా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో, ఐఐటీ తిరుపతితో రెండు ఒప్పందాలు చేసుకున్నారు.
ఏపీ డ్రోన్స్ ముసాయిదా విధానాన్ని విడుదల చేశారు.ప్రపంచంలో భారత దేశాన్ని డ్రోన్ హబ్‌గా తయారు చేయాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని కేంద్ర పౌర వియానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
అన్నీ నేనే తెచ్చా
1995లో హైదరాబాద్‌కు ఐటీ తీసుకువచ్చింది తానేనని చంద్రబాబు చెప్పారు. పైసా పెట్టుబడి లేకుండా పీపీపీ విధానంలో హైటెక్ సిటీని నిర్మించినట్లు తెలిపారు. దేశంలో మొబైల్ టెక్నాలజీని, తొలిసారిగా ఎమిరేట్స్ విదేశీ విమానాన్ని నేరుగా హైదరాబాద్‌కు రప్పించింది తానేనని చెప్పారు.
సార్... బూట్లు..
అమరావతి డ్రోన్స్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో జ్యోతి వెలిగించే సమయంలో సీఎం చంద్రబాబు బూట్లు ధరించే ఉన్నారు. ఆయన కొవ్వొత్తితో జ్యోతి వెలిగించబోగా.. పక్కనే ఉన్న పెట్టుబడులు, మౌలిక సదుపాయల కార్యదర్శి సురేష్ కుమార్ దగ్గరకు వెళ్లి బూట్లు చూపెట్టారు. దీంతో చంద్రబాబు వెనక్కి వచ్చి బూట్లు విప్పి జ్యోతి ప్రజ్వలన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment