సుపరిపాలన వల్లే హరియాణాలో బీజేపీ గెలిచింది
కచ్చితంగా వరద సాయం అందరికీ వెళ్లలేదు
మీడియాతో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: జమిలి ఎన్నికలకు దేశం మొత్తం మద్దతు తెలపాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానం వల్ల ప్రజలకు, రాష్ట్రాలకు మేలు జరుగుతుందని చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో మీడియాతో బుధవారం మాట్లాడుతూ.. హరియాణాలో మూడోసారి బీజేపీ గెలవడం కేంద్ర సుపరిపాలనకు నిదర్శనమన్నారు. జమ్మూకశ్మీర్‌లో బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందన్నారు.
విభజన వల్ల జరిగిన నష్టం కంటే గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన నష్టం ఎక్కువని చెప్పారు. రాబోయే రోజుల్లో ఒక్క ఏపీలోనే రూ.75 వేల కోట్లను ఒక్క రైల్వే మౌలిక సదుపాయాల కోసమే ఖర్చు చేస్తున్నారని తెలిపారు. బెంగళూరు–చెన్నయ్–అమరావతి–హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలను కలిపేలా బుల్లెట్ రైలు తెచ్చే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.
కేంద్ర మంత్రుల్ని కలిసి చర్చిస్తా
విశాఖ రైల్వే జోన్, 90–95 రైల్వే బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిలతోపాటు అమరావతి అవుటర్ రింగ్‌రోడ్డు, విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణంపై కేంద్ర మంత్రులతో చర్చించానని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదన్నారు. బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ కోసం రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలను పరిశీలిస్తున్నారని, దాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.
వరద సాయం చాలామందికి వెళ్లలేదు
వరద సాయం చాలామందికి వెళ్లలేదని చంద్రబాబు అన్నారు. చివరివరకూ సాయాన్ని అందించలేకపోయామని ఒప్పుకున్నారు. కచ్చితంగా 5,10 శాతం వేస్ట్ అవుతుందని, దానికి ఎవరూ ఏమీ చేయలేరని తెలిపారు.
అగ్గిపెట్టెలు ఇవ్వలేదనడం సిగ్గుచేటన్నారు. ప్రకాశం బ్యారేజీని బోట్లతో గుద్దించి ధ్వంసం చేయాలనుకున్న వాళ్లు తమను విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. తిరుమల బ్రహ్మోత్సవాలు, దసరా ఉత్సవాలు ఎంతో కన్నుల పండువగా జరుగుతున్నాయని, గత ఐదేళ్లలో ఎప్పుడైనా ఇలా జరిగాయా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment