దురుద్దేశంతో మహాపచారం | CM Chandrababu wicked politics with unmade laddoos in TTD | Sakshi
Sakshi News home page

దురుద్దేశంతో మహాపచారం

Published Sun, Sep 22 2024 4:49 AM | Last Updated on Sun, Sep 22 2024 8:35 AM

CM Chandrababu wicked politics with unmade laddoos in TTD

వాడని నెయ్యి.. తయారు కాని లడ్డూతో సీఎం చంద్రబాబు దుర్మార్గ రాజకీయం 

జరగనిది జరిగినట్లుగా దుష్ప్రచారం చేస్తూ ఆ దేవదేవుడిని అప్రతిష్టపాలు చేసే కుతంత్రం

వారే మహాపచారం తలపెట్టి రాజకీయ లబ్ధి కోసం నిందలు

నిర్దేశించిన ప్రమాణాలు లేకుంటే నెయ్యి ట్యాంకర్‌ను గోడౌన్‌లోకే అనుమతించరు 

ప్రతి నెయ్యి ట్యాంకర్, లారీలో సరుకులకు ముగ్గురు టెక్నీషియన్లతో వేర్వేరుగా పరీక్షలు 

మూడు పరీక్షల్లోనూ నాణ్యంగా ఉన్నట్లు తేలితేనే నెయ్యి ట్యాంకర్‌/ సరుకుల లారీకి తిరుపతిలోని గోడౌన్‌లోకి అనుమతి 

ఒక్క పరీక్షలోనైనా నాణ్యత లేదని తేలితే సరుకులు, నెయ్యి తిరిగి వెనక్కి.. 

ఆవు నెయ్యి నాణ్యత కచ్చితంగా లెక్కించేందుకు సీఎఫ్‌టీఆర్‌ఐ నుంచి అధునాతన పరికరాలు 

ఆ ల్యాబ్‌లో నాణ్యత లేదని తేలడంతో 4 ట్యాంకర్ల నెయ్యి తిరుపతి గోడౌన్‌ నుంచి వెనక్కి పంపేసిన టీటీడీ 

అసలు తిరుమల చేరని ‘‘నెయ్యి’’పై చంద్రబాబు క్షుద్ర రాజకీయం

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వైకుంఠం నుంచి భూమిపై అడుగుపెట్టి నడయాడిన దివ్యక్షేత్రం తిరుమల. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులకు పరమపవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామివారి లడ్డూ ప్రసాదం భక్తులకు అమృతం.

అలాంటి పరమ పవిత్రమైన దివ్యధామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ దురుద్దేశంతో అపవిత్రం చేస్తున్నారు. రాజకీయ స్వార్థంతో పచ్చి అబద్ధాలు వల్లిస్తూ.. శ్రీవారికి మహాపచారం చేస్తూ.. భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతున్నారు.  

సాక్షి, అమరావతి: జరగనిది జరిగినట్లుగా దుష్ప్రచారం చేస్తూ ఆ దేవదేవుడికి మహాపచారం తలపెట్టే దుస్సాహసానికి సీఎం చంద్రబాబు తెగించారు. భక్తకోటి ప్రీతిపాత్రంగా స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. లడ్డూల తయారీలో అసలు ఆ నెయ్యిని వాడకుండా ట్యాంకర్లను సైతం తిరుపతి నుంచే వెనక్కి తిప్పి పంపినప్పుడు ఇంకెక్కడ అపవిత్రం అయింది? వాడని నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లు ఏ రకంగా చెబుతారు?  ఇంత మహాపచారాన్ని చంద్రబాబు రాజకీయ దురుద్దేశంతోనే చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. 

నెయ్యి సరఫరాకు సంబంధించి టీటీడీలో దశాబ్దాలుగా నిర్దిష్ట విధానం, ప్రక్రియ ఉంది.  ఇప్పుడూ అదే ఆనవాయితీ ఉంది. మరి నాసిరకంగా తయారైందని ఎలా అంటారు? నెయ్యి ట్యాంకర్లలో నాణ్యతను మూడు దశల్లో ముగ్గురు ల్యాబ్‌ టెక్నీషియన్లు పరీక్షిస్తారు. ఒక్క పరీక్షలోనైనా సరే నాణ్యత లేదని తేలితే ఆ ట్యాంకర్లను తిరుపతి నుంచే వెనక్కి తిప్పి పంపిస్తారు. 2013–19 మధ్య 15 నెయ్యి ట్యాంకర్లను, 2019–24 మధ్య 18 ట్యాంకర్లను ఇలాగే తిప్పి పంపేశారు. అంటే దానర్థం నాణ్యతలో ఏమాత్రం తేడా ఉన్నా కనీసం గోడౌన్‌లోకి కూడా సరుకుల వాహనాలను అనుమతించరనే! అయినా సరే వెనక్కి పంపేసిన నెయ్యిని లడ్డూ తయారీలో వాడినట్లు చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. 

అది కూడా రిపోర్టు వచ్చిన రెండు నెలల తరువాత ఓ పకడ్భందీ పథకం ప్రకారం చంద్రబాబు వంద రోజుల పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ఏకంగా టీడీపీ కార్యాలయంలో విడుదల చేయడం వెనుక ఎంత కుట్ర దాగి ఉందో బహిర్గతమవుతోంది. అసలు ఏమాత్రం వాడని నెయ్యి.. తయారు కాని లడ్డూ గురించి దేవుడే తనతో మాట్లాడించాడేమో.. నిజాలు చెప్పించాడేమోనంటూ చంద్రబాబు మహాపచారానికి ఒడిగట్టడం శ్రీవారి భక్తకోటిని నివ్వెరపరుస్తోంది!! 

పచ్చి అబద్ధాలాడుతూ.,. 
ఆవు నెయ్యి ప్రమాణాల మేరకు లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ల్యా»ొరేటరీలో నిర్వహించిన మూడు పరీక్షలలో తేలడంతో తిరుపతిలోని టీటీడీ గోడౌన్‌ బయట నుంచే నెయ్యి ట్యాంకర్లను అధికారులు సరఫరా సంస్థకు వెనక్కి పంపేశారు. శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు, లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యిని వాడలేదన్నది దీన్నిబట్టి స్పష్టమవుతోంది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా తెలుసు. 

కానీ.. సరఫరా సంస్థకు వెనక్కి తప్పి పంపేసిన కల్తీ నెయ్యితో శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు, లడ్డూ ప్రసాదాలను తయారు చేసినట్లు.. వాటిని భక్తులకు పంపిణీ చేసినట్లు.. భక్తులు వాటిని స్వీకరించినట్లు పచ్చి అబద్ధాలాడుతూ ప్రపంచవ్యాప్తంగా హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలను.. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవారిని ముఖ్యమంత్రి చంద్రబాబు అపవిత్రం చేస్తున్నారని భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు, టీటీడీ అధికారవర్గాలు మండిపడుతున్నాయి. 

పవిత్రమైన శ్రీవారి లడ్డూని సీఎం చంద్రబాబు అపవిత్రం చేస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. వైఎస్సార్‌సీపీని రాజకీయంగా దెబ్బతీయాలనే దురుద్దేశంతో సీఎం చంద్రబాబు శ్రీవారిని వాడుకుంటున్నారన్నది స్పష్టమవుతోంది. 

నెయ్యి, ముడిసరుకుల సేకరణకు గొప్ప వ్యవస్థ
టీటీడీ బోర్డు స్వతంత్ర సంస్థ. శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు, లడ్డూల తయారీ, అన్నప్రసాదంలో ఉపయోగించే ఆవు నెయ్యి, ముడిసరుకుల సేకరణకు ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో టీటీడీలో గొప్ప వ్యవస్థ ఉంది. నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించి ఆవు నెయ్యి, ముడిసరుకుల సేకరణకు ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో టీటీడీ టెండర్లు పిలుస్తుంది. తక్కువ ధరకు కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన సంస్థకు సరుకుల సరఫరా బాధ్యతలను అప్పగిస్తుంది. 

టీటీడీకి సరుకుల సరఫరా చేసే సమయంలో.. అవి టెండర్‌ నిర్దేశించిన ప్రమాణాల మేరకు నాణ్యంగా ఉన్నట్లుగా సంబంధిత సంస్థ ఎన్‌ఏబీఎల్‌ (నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డు ఫర్‌ ల్యాబ్స్‌) ధ్రువీకరించిన ల్యాబ్‌ నుంచి సర్టిఫికెట్‌ పొందాలి. తిరుపతిలోని టీటీడీ గోడౌన్‌ వద్దకు ఆవు నెయ్యి ట్యాంకర్‌ లేదా సరుకులు తెచ్చిన వాహనం చేరుకున్నాక.. మార్కెటింగ్‌ అధికారి, సరఫరా సంస్థ ప్రతినిధి సమక్షంలో ఒక్కో నెయ్యి ట్యాంకర్‌ నుంచి మూడు శాంపిళ్లను సేకరించి తిరుమలలోని టీటీడీ ల్యాబ్‌కు పంపుతారు. 

ఆ మూడు శాంపిళ్లను ముగ్గురు టెక్నీషియన్లతో వేర్వేరుగా పరీక్ష చేయిస్తారు. ఆ మూడు పరీక్షల్లో టెండర్‌లో నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఉన్నట్లుగా తేలితేనే ఆ నెయ్యి ట్యాంకర్‌ను గోడౌన్‌లోకి అనుమతించి అన్‌లోడ్‌కు అవకాశం కలి్పస్తారు. నాణ్యంగా లేదని ఒక్క పరీక్షలో తేలినా ఆ నెయ్యి ట్యాంకర్‌ను గోడౌన్‌లోకి అనుమతించరు. సరఫరా సంస్థకు వెనక్కి తిప్పి పంపేస్తారు. 

అసలు నాసిరకం ముడిసరుకులు.. కల్తీ నెయ్యిని శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు, లడ్డూ, అన్నప్రసాదాల తయారీలో వినియోగించే అవకాశమే లేదు. టీటీడీ చరిత్రలో ఎన్నడూ కల్తీ నెయ్యి, నాసిరకం ముడిసరుకులను శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు, లడ్డూ, అన్నప్రసాదాల తయారీలో ఉపయోగించలేదని మార్కెటింగ్‌ విభాగంలో పనిచేస్తున్న ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.  

ల్యాబొరేటరీ ఉన్నా.. లేదంటారా?
తిరుమలలో గోశాలకు సమీపంలో అధునాతనమైన ల్యా»ొరేటరీని టీటీడీ ఏర్పాటు చేసింది. టెండర్ల ద్వారా కొనుగోలు చేసిన సరుకుల శాంపిళ్లను మార్కెటింగ్‌ అధికారులు టీటీడీ ల్యాబ్‌కు పంపుతారు. నాణ్యతను ల్యాబ్‌ ధ్రువీకరిస్తేనే ఆ సరుకులను గోడౌన్‌లోకి అనుమతిస్తారు. లేదంటే సరఫరా సంస్థకు వెనక్కి పంపేస్తారు. కానీ.. ఈవో శ్యామలరావు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ టీటీడీకి ల్యాబ్‌ లేదని చెప్పడంపై టీటీడీ వర్గాలు విస్తుపోతున్నాయి.

ముందస్తు ప్రణాళిక మేరకే..
ముఖ్యమంత్రిగా చంద్రబాబు జూన్‌ 12న ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ఈవోగా జె.శ్యామలరావును జూన్‌ 14న ప్రభుత్వం నియమించింది. ఈవోగా బాధ్యతలు స్వీకరించక ముందే సీఎం చంద్రబాబును తాను కలిశానని తిరుమలలో శుక్రవారం మీడియా సమావేశంలో శ్యామలరావు వెల్లడించారు. తిరుమలలో ప్రసాదాల తయారీలో వినియోగించే ముడి­సరుకుల్లో నాణ్యత లేదని.. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి లడ్డూల తయారీలో వాడుతున్నారని చెప్పారన్నారు. దీన్ని బట్టి వైఎస్సార్‌సీపీని రాజకీయంగా దెబ్బతీయడానికి అప్పుడే చంద్రబాబు కుట్ర చేసినట్లు స్పష్టమవుతోంది.  

⇒ ఏఆర్‌ ఫుడ్స్‌ సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యి కల్తీ అయ్యిందని జూలై 23న ఎన్‌డీడీబీ నివేదిక ఇచ్చింది. అదే రోజు ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ.. వెజిటబుల్‌ ఫ్యాట్స్‌ ఆవు నెయ్యిలో కలిసినట్లు పరీక్షల్లో వెల్లడవడంతో నాలుగు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపామని ప్రకటించారు.  

⇒ ఈనెల 18న మంగళగిరి సీకే కన్వెన్షన్‌ హాల్‌లో కూటమి శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడారని.. తిరుమలను అపవిత్రం చేశారంటూ ముందస్తుగా రచించిన కుట్ర అమలుకు తెరతీశారు. అదే రోజు ఎన్‌డీబీబీ జూలై 23న ఇచ్చిన పరీక్ష నివేదికను టీడీపీ కార్యాలయంలో విడుదల చేయించారు. 



⇒ ఆ నివేదిక సాక్షిగా కల్తీ అయిన నెయ్యి సరఫరా జరిగింది టీడీపీ ప్రభుత్వంలోనే కావడంతో తాను తీసుకున్న గోతిలోనే చంద్రబాబు పడ్డారు. అయినా సరే అబద్ధాలు వల్లె వేస్తూ శ్రీవారి భక్తుల మనోభావాలతో చెలగాటమాడటం మానుకోలేదు. 

⇒ టీటీడీ ఈవో శ్యామలరావు తాజాగా ఎన్‌డీబీబీ నివేదికపై జూలై 23న వెల్లడించిన అంశాలకు భిన్నంగా మీడియాతో మాట్లాడారు. వెజిటబుల్‌ ఫ్యాట్‌తోపాటు జంతువుల కొవ్వు కూడా ఆవు నెయ్యిలో కలిసినట్లు చెప్పడం గమనార్హం.

బురుగులా మారుతుంది..
నెయ్యిలో జంతువుల కొవ్వు, చేప నూనె ఉన్నట్లు కొందరు చెప్పడం ఆశ్చర్యమేస్తోంది. నెయ్యి ఔషధంతో సమానమైంది. అందులో వేరే ద్రవాలు ఎంత మోతాదులో కలిపినా వెంటనే దుర్వాసనతో పాటు నెయ్యి పొరలు పొరలుగా విడిపోయి బురుగులా తయారవుతుంది. మైసూరు ల్యాబోరేటరీ నివేదిక ఎందుకు బహిర్గతం చేయడం లేదు?. 
    – శ్రీకరన్, ప్రముఖ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబరేటరీ విశ్రాంత అధికారి, తమిళనాడు  

స్పెసిఫైడ్‌ అథారిటీ ఏది?
కొత్త ప్రభు­త్వం ఏర్పడి వంద రోజులు గడుస్తున్నా ఇంతవరకు టీటీడీ పాలకమండలి నియామకం ఊసే లేదు. టీటీడీ బోర్డు రద్దు అయిన వెంటనే స్పెసిఫైడ్‌ అథారిటీని నియమించకుండా ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. 
– టి.రాధాక్రిష్ణయ్య, ప్రముఖ టెంపుల్‌ రిటైర్డ్‌ అధికారి, తెలంగాణ

నోటికి వచ్చినట్లు నిందలా?
నిజానిజాలు తెలుసుకో­కుండా ఎన్‌డీడీబీ రిపోర్టు అంటూ అధికారులే రాజకీయ నాయ­కుల అవ­తా­ర­మెత్తి చెప్పడం టీటీడీ చరిత్రలో ఎన్నడూ చూడలేదు. ఇటువంటి ప్రచా­రం చేసే ముందు ఒకటికి పదిమార్లు ఆలోచించాలి. నోటికి వచ్చినట్టు శ్రీవారి ప్రసాదంపై నిందలు వేయడం అజ్ఞానానికి నిదర్శనం.    
 – సోమశేఖరన్, టీటీడీకి విరాళం అందించిన దాత, ఎన్‌ఆర్‌ఐ

అలా కలిపితే వెంటనే పాడవుతుంది
శ్రీవారి ప్రసాదంలో వాడే నెయ్యి విషయంలో అసత్య ప్రచారాలు బాధా­కరం. ఆవు పాలలో కొవ్వు అధిక శాతం ఉంటుంది. నెయ్యి తయారీ ప్రక్రియలో ఎంతో కొంత శాతం కొవ్వుకు సంబంధించిన ఆనవాళ్లు ఉంటాయి. నెయ్యిలో వేరే జాతి కొవ్వు కలిపితే వెంటనే పాడవుతుంది. చిన్న లాజిక్‌ కూడా తెలియకుండా అసత్య ప్రచారాలు చేయడం దారుణం.
    – ప్రకాష్‌ కుమార్, కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రంలో క్వాలిటీ కంట్రోలర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement