సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన చట్టంలోని ముఖ్యమైన హామీ అయిన 2014–15 ఆర్థిక ఏడాది రెవెన్యూ లోటు భర్తీని గత చంద్రబాబు ప్రభుత్వం సాధించలేక పోయింది. అప్పటి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ రెవెన్యూ లోటును పూర్తి స్థాయిలో సాధించలేక చేతులెత్తేసింది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి నుంచీ రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ వస్తున్నారు.
ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి, నీతి ఆయోగ్ అధికారులను కలిసినప్పుడల్లా రెవెన్యూ లోటు భర్తీ గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. దాని ఫలితమే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రెవెన్యూ లోటు భర్తీ కింద ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయంగా రూ.10,461 కోట్లు మంజూరు చేసింది. దీన్ని ఈనాడు పచ్చ మీడియా జీర్ణించుకోలేక చంద్రబాబు ఎన్నిసార్లు గింజుకున్నా విదల్చని కేంద్రం ఇప్పుడు రెవెన్యూ లోటు భర్తీ కింద డబ్బులు మంజూరు చేయడం తప్పనేలా రోత రాతలు రాసింది.
రాష్ట్రానికి ఆర్థికంగా ప్రయోజనం జరగడం కూడా పచ్చ మీడియా జీర్ణించుకోలేకపోవడం శోచనీయం. రాష్ట్ర విభజన జరిగిన 2014–15 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ.16,078 కోట్లుగా కాగ్ తేల్చింది. ఆ మేరకు భర్తీ చేయాల్సిందిగా గత చంద్రబాబు కోరిననప్పటికీ కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా రూ.4,000 కోట్లు మాత్రమే ఇచ్చింది. అయితే ముఖ్యమంత్రి జగన్ సర్కారు చట్ట ప్రకారం రావాల్సిన రెవెన్యూ లోటు భర్తీ గ్రాంటు కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉంది.
అందుకు సహేతుక కారణాలను నీతి ఆయోగ్‌తోపాటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులకు వివరించడంతో పాటు స్వయంగా ప్రధాన మంత్రి దృష్టికి కూడా ముఖ్యమంత్రి పలుసార్లు తీసుకెళ్లారు. దాని ఫలితంగానే ప్రస్తుతం నిధులు విడుదలయ్యాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలపై ఆరోపణలు చేస్తున్న పచ్చ మీడియా, టీడీపీ నేతలకు ఇది చెంపపెట్టే. సీఎం ఢిల్లీ పర్యటనలన్నీ రాష్ట్ర ప్రయోజనాలకోసమేనని రెవెన్యూ లోటు భర్తీ సాధనతో స్పష్టమైంది.
సీఎం జగన్ విజయమిది..
విభజన నాటి నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పరిష్కరించుకుంటోంది. సంక్షేమాభివృద్ధిలో దూసుకుపోతున్న ఏపీ సర్కారుకు ప్రస్తుత రెవెన్యూ లోటు భర్తీ నిధుల విడుదల భారీ ఊరట కలిగించనుంది. తాజాగా విడుదల చేసిన రూ.10,460.87 కోట్ల నిధులను 2014–15 ఆర్థిక ఏడాది రెవెన్యూ లోటు కింద చూపిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహేంద్ర చండేలియా ఆదేశాలిచ్చారు.
సీఎం గత నెల ఢిల్లీ పర్యటనలో భాగంగా జరిగిన చర్చలు కొలిక్కి వచ్చి నిధుల విడుదలకు ఈ నెల 19వ తేదీన ఆదేశాలు వెలవడగా తాజాగా నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభించాలని ఆర్థిక శాఖను కేంద్రం ఆదేశించింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి కేంద్రం నుంచి ఏకమొత్తంలో విడుదలైన భారీ నిధులు ఇవే కావడం గమనార్హం. చంద్రబాబుతో కానిది సీఎం జగన్ వల్ల సాధ్యమైందని, ఇది ముఖ్యమంత్రి విజయమని అధికార వర్గాలు వ్యాఖ్యానించాయి.
Comments
Please login to add a commentAdd a comment