రాజమహేంద్రవరం నుంచి సాక్షి ప్రతినిధి: ‘ఇవాళ రాష్ట్రంలో జరుగుతోంది కులాల యుద్ధం కాదు.. క్లాసుల మధ్య యుద్ధం. ఒకవైపు పేదవాడు మరోవైపు పెత్తందారీ వ్యవస్థ మధ్య జరుగుతున్న యుద్ధమిది. పేదల వ్యతిరేక శక్తులతో పోరాటం చేస్తున్నాం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. విషయాన్ని గుర్తించాలి. పొరబాటు జరిగితే పేదవాడు నాశనమైపోతాడనేది మరిచిపోవద్దు. కుట్రలు, కుతంత్రాలతో వస్తున్న చంద్రబాబు, దత్తపుత్రుడు, గజదొంగల ముఠా విషయంలో అప్రమత్తంగా ఉండాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి, దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. 64,06,240 మంది లబ్థిదారులకు రూ.1,765.04 కోట్ల నమూనా చెక్‌ను ఎలుగొండ చెల్లాయమ్మకు అందచేశారు. గత సర్కారు అరకొరగా 39 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇస్తే ఇప్పుడు ఏకంగా 64.06 లక్షల మందికి పెన్షన్లు అందచేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.
చంద్రబాబు పింఛన్ల కోసం రూ.400 కోట్లిస్తే ఇప్పుడు నెలకు రూ.1,765 కోట్లకుపైగా వ్యయం చేస్తూ అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూరుస్తున్నట్లు తెలిపారు. నాడు కత్తిరింపులే లక్ష్యమని, జన్మభూమి కమిటీలకు 3 నెలల పెన్షన్ లంచమిస్తేనేగానీ మంజూరు కాని దుస్థితి నెలకొందన్నారు. గత సర్కారు అరకొరగా రూ.వెయ్యి పెన్షన్ ఇస్తే ఇప్పుడు నెలకు రూ.2,750 చొప్పున ఇస్తూ మిగిలిపోయిన అర్హులను సైతం గుర్తించి ఏటా రెండుసార్లు లబ్ధి చేకూరుస్తున్నట్లు చెప్పారు.
గత మూడున్నరేళ్లలో ఒక్క పింఛన్ల కోసమే రూ.62,500 కోట్లు వెచ్చించామన్నారు. పింఛన్ల పెంపు వారోత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు
మిగిలిపోయిన అర్హులకు కూడా..
అర్హతే ప్రామాణికంగా పథకాలన్నింటినీ అమలు చేస్తున్నాం. ఏ పార్టీకి ఓటేశారని కూడా చూడకుండా మనకు వ్యతిరేకంగా ఓటేసిన వారికి కూడా పథకాలన్నింటినీ అందిస్తున్నాం. వీటిని పారదర్శకంగా అర్హులకు చేర్చేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా 2.62 లక్షల మంది వలంటీర్లు, 1.30 లక్షల మంది ఉద్యోగులతో సచివాలయ వ్యవస్థను తెచ్చాం.
అవ్వాతాతలకే కాకుండా పుట్టుకతో, పుట్టిన తర్వాత అంగవైకల్యానికి గురైన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల బాధితులు, డయాలసిస్ చేసుకుంటున్నవారు, తలసీమియా, సికిల్‌సెల్, ఎనీమియా, హీమోఫీలియా, ఎయిడ్స్, బోదకాలు, చివరకు పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమైన వారికి, కండరాల క్షీణత, కుష్టువ్యాధి, కాలేయం, గుండె మార్పిడి జరిగిన నిరుపేదలందరికీ ప్రభుత్వం తరపున పెన్షన్లు ఇస్తున్నాం.
ఇవాళ అవ్వాతాతలకు పెన్షన్ పెంచడంతో పాటు గత జూలై నుంచి నవంబరు వరకు అర్హులందరికీ కొత్త కార్డులిచ్చాం. బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలు ఇవన్నీ డిసెంబరులోనే ఇచ్చాం. మిగిలిపోయిన అర్హులకు జూలై, డిసెంబరులో ఏడాదికి 2 సార్లు మేలు చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కొత్తగా 44,543 బియ్యం కార్డులు ఇవ్వడంతో ఏపీలో మొత్తం బియ్యం కార్డుల సంఖ్య 1,45,88,539కు చేరింది.
మరో 14,401 ఆరోగ్యశ్రీ కార్డులు వలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. దీంతో ఆరోగ్యశ్రీ కార్డులు 1,41,48,249కు చేరాయి. మరో 14,531 ఇళ్ల పట్టాలకు సంబంధించి మంజూరు పత్రాలను అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నారు. ఇలా 30,29,171 ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు అందించగలిగాం.
థాంక్యూ జగనన్న అంటూ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న ప్రజలు
అపకారికి సైతం మీ బిడ్డ ఉపకారం
గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా ఇప్పుడు పెన్షన్లకు ఎక్కడా కోటాలు, కత్తిరింపులు, వివక్ష, లంచాలు లేవు. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు ఆత్మాభిమానాన్ని చంపుకుని మోకరిల్లాల్సిన అవసరం లేదు. చివరకు మన పార్టీకి ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే చాలు పెన్షన్ దగ్గర నుంచి ప్రతి పథకం ఇళ్ల దగ్గరకు వెళ్లి అందించే గొప్ప వ్యవçస్థ తెచ్చాం. ఇందుకు కారణం మీ బిడ్డ మనసున్న పాలన. చెడు చేసేవారికి సైతం మంచి చేసే గుణం మీ బిడ్డకు ఉంది కాబట్టే ఇంత మంచి పరిపాలన చేయగలుగుతున్నాం.
షూటింగ్ కోసం గేట్లన్నీ మూసివేసి..
ఇదే చంద్రబాబు ఫోటో షూట్, డ్రోన్ షాట్ల కోసం ఇదే రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాలకు వచ్చారు. మీ అందరికీ గుర్తుందా...? (ప్రజలంతా ఒక్కసారిగా పైకి లేచి గుర్తుందంటూ నినదించారు) ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 29 మందిని ఇదే మాదిరిగా చంపేశాడు. అన్ని గేట్లు మూయించి సినిమా డైరెక్టర్‌ను పక్కన పెట్టుకుని షూటింగ్ కోసం ఈ ఒక్కగేట్ తెరిచాడు. వేల సంఖ్యలో జనమంతా ఒక్క గేటు గుండా వెళ్లాల్సిన పరిస్థితి. ఆ డ్రోన్ షాట్ల కోసం నాడు 29 మంది చనిపోతే.. కుంభమేళాలో చనిపోలేదా? తొక్కిసలాటలు జరగలేదా? అని ఈ పెద్ద మనిషి వాదించాడు.
మనుషులను చంపేసి మానవతావాదినంటాడు..
కందుకూరులో ఎక్కువ మంది వచ్చినట్లు చూపించేందుకు విశాలమైన ప్రదేశంలో మీటింగ్ జరగనివ్వకుండా ముందుకు తీసుకెళ్లి సందులోకి ప్రజలను తరలించారు. ఆ తర్వాత ఆ పెద్ద మనిషి తన వాహనాన్ని అక్కడికి తీసుకెళ్లడం ద్వారా 8 మందిని చంపేసిన పరిస్థితి చూశాం. తన డ్రోన్ షాట్స్, ఫోటో షూట్ కోసం 8 మందిని చంపేశాడు. ఆ వెంటనే ఆ పెద్దమనిషి అక్కడే.. మౌనం పాటించాలంటాడు.
పక్కనే ఉన్న ఆసుపత్రికి వెళ్లాలంటాడు. షూటింగ్ కోసం 5 నిమిషాల్లో ఆసుపత్రి నుంచి మళ్లీ తిరిగి వచ్చేశాడు. చనిపోయిన కుటుంబాలకు తానే చెక్కులు పంపిణీ చేశానంటాడు. తానే మనుషులను చంపేస్తాడు.. చనిపోయిన వారిపట్ల తాను ఒక మహోన్నత, మానవతావాదిలా మళ్లీ డ్రామాలాడుతున్నాడు.
ప్రతి అడుగులోనూ ‘బాబు’ మోసాలు
45 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే ఈ మనిషి వంకర బుద్ధి ఎలా ఉంటుందో 2014 నుంచి 2019 వరకు మనమంతా చూశాం. ప్రతి అడుగులోనూ మోసమే. రూ. 87,612 కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలంటూ చివరకు నట్టేట ముంచాడు. రూ.14,204 కోట్ల పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని నమ్మించి అక్కచెల్లెమ్మలను రోడ్ల పాలు జేశాడు. రూ.2 వేల నిరుద్యోగ భృతిని ఎగ్గొట్టారు. మేనిఫెస్టో ప్రకటించి ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో పడేశాడు.
పేదల వ్యతిరేక శక్తులతో పోరాటం
అధికారం కోసం సొంత మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ప్రజలు ఒక లెక్కా? ఇలాంటి వ్యక్తి ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా ఈనాడు రాయదు, ఆంధ్రజ్యోతి చెప్పదు, టీవీ 5 చూపించదు. దత్తపుత్రుడు ప్రశ్నించడు. కారణం వీళ్లంతా ఓ గజదొంగల ముఠా. అప్పట్లో జరిగిన ఏకైక స్కీం.. దోచుకో, పంచుకో, తినుకో(డీపీటీ). అందుకే ఆ పెద్దమనిషిని అధికారంలోకి తెచ్చేందుకు వారంతా కష్టపడుతున్నారు. వీరంతా పేదవాడికి ఇంగ్లిషు మీడియం చదువులు వద్దంటున్నారు.
పేదలకు ఇళ్లు కట్టించొద్దంటున్నారు. పేదవాడికి మంచి చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటున్నారు. ఇలాంటి పేదల వ్యతిరేక శక్తులతో మీబిడ్డ పోరాటం చేస్తున్నాడు. ఈ పోరాటంలో మీ అందరి చల్లని దీవెనలు, దేవుడి దయ మీ బిడ్డ పట్ల ఉండాలని కోరుతున్నా. మీ బిడ్డకు వీళ్ల మాదిరిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 లేకపోవచ్చు. దత్తపుత్రుడి అండ ఉండకపోవచ్చు. కానీ మీ బిడ్డకు ఉన్నదేమిటంటే... ఆ దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులు. ఆ పెద్దమనిషి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడిని నమ్ముకుంటే మీ బిడ్డ ఒక ఎస్సీ,ఎస్టీ బీసీ, మైనార్టీ, పేద వర్గాలను నమ్ముకున్నాడు.
పెంచిన పింఛన్లకు సంబంధించిన చెక్కును లబ్ధిదారులకు అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్
హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు
ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు పినిపే విశ్వరూప్, తానేటి వనిత, చెల్లుబోయిన వేణు, దాడిశెట్టిరాజా, కారుమూరి నాగేశ్వరరావు, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, ఎంపీలు పెదిరెడ్డి మి«థున్‌రెడ్డి, మార్గాని భరత్‌రామ్, పిల్లి సుభాష్ చంద్రబోస్, వంగా గీత, చింతా అనురాధ, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, పార్టీ కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షులు కురసాల కన్నబాబు, జక్కంపూడి రాజా, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సెర్ప్ సీఈవో ఇంతియాజ్, కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు.
వేలల్లో టోకెన్లు.. అరకొరగా చీరలు
ఇంత దారుణమైన రాజకీయాలు జరుగుతున్నా ఈనాడు రాయదు. ఆంధ్రజ్యోతి చూపించదు. టీవీ 5 అడగదు. దత్తపుత్రుడు అంతకన్నా ప్రశ్నించడు. పేదలను చంపేసి చివరికి టీడీపీ కోసం త్యాగం చేశారంటారు. చనిపోయిన వారిలో ఎస్సీలుంటే తన కోసం త్యాగం చేశారని దాన్ని కూడా వాడుకునే దారుణమైన ఆలోచనలు చేస్తాడు. ఈ పెద్ద మనిషి రక్త దాహం తీరక మళ్లీ గుంటూరులో సభ పెట్టాడు. కొత్త ఏడాది రోజు మరో ముగ్గురిని ఫోటో షూట్లు డ్రోన్ షాట్ కోసం బలి తీసుకున్న పరిస్థితిని మనమంతా చూశాం. తన సభకు ప్రజలు రారనే భయంతో చీరల పంపిణీ పేరుతో మరో ముగ్గురుని బలిగొన్నాడు.
వారం రోజులు ఇంటింటికీ తిరిగి టోకెన్లు ఇచ్చారు.బాబు వచ్చే వరకు, మీటింగ్ పూర్తయ్యే వరకు చీరలు పంపిణీ చేయలేదు. ముందే చీరలు పంపిణీ చేస్తే చంద్రబాబు రాకముందే మహిళలు వెళ్లిపోతారని పంచలేదు. తీరా చూస్తే ఇచ్చిన టోకెన్లు వేలల్లో ఉంటే పంపిణీ కోసం చీరలేమో అరకొరగా తెచ్చారు. ఫలితంగా తొక్కిసలాట జరిగింది. ఆశ్చర్యమేమిటంటే చంద్రబాబు తానే బలి తీసుకుంటాడు.. మళ్లీ మొసలి కన్నీళ్లు కారుస్తాడు. పోలీసులది తప్పు అంటాడు. ఇంతకన్నా అన్యాయమైన మనిషి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా?
39 లక్షల పెన్షన్లు ఎక్కడ?.. 64 లక్షల పింఛన్లు ఎక్కడ?
మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. గత ప్రభుత్వం దిగిపోయేనాటికి ఉన్న పరిపాలనను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. 2019 ఎన్నికలకు 2 నెలల ముందు వరకు పెన్షన్‌న్ కేవలం రూ.వెయ్యి మాత్రమే ఇచ్చేవారు. బాబు పాలనలో పెన్షన్లు ఎలా కోత పెట్టాలా? అనే ఆలోచన చేశారు. నాడు ఎవరైనా చనిపోతేనే మరొకరికి పెన్షన్ మంజూరు చేసే దుస్థితి. పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీల దగ్గరకు వెళ్లాల్సిందే. అరకొరగా ఇచ్చే పింఛన్లు సైతం మూడు నెలల సొమ్మును లంచంగా ఇస్తేనే మంజూరయ్యేవి కావు.
గత సర్కారు దిగిపోయే 6 నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇవ్వగా మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 64.06 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తోంది. 39 లక్షలు ఎక్కడ? మన ప్రభుత్వం ఇస్తున్న 64 లక్షలు పెన్షన్లు ఎక్కడ? మీరే ఆలోచన చేయండి. నాడు రూ.వెయ్యి మాత్రమే ఇవ్వగా నేడు రూ.2,750 చొప్పున ఇస్తున్నాం. తేడా గమనించండి.
గత సర్కారు హయాంలో పెన్షన్ల ఖర్చు నెలకు కేవలం రూ.400 కోట్లు కాగా ఈరోజు మన ప్రభుత్వం పెన్షన్ల కోసం నెలకు రూ.1,765 కోట్లు వ్యయం చేస్తోంది. పెన్షన్లపై ఏడాదికి రూ.21,180 కోట్లు వ్యయం చేస్తున్నాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడున్నరేళ్లలో కేవలం పెన్షన్ల కోసం రూ.62,500 కోట్లను అవ్వాతాతలు, వితంతు అక్కచెల్లెమ్మలు, అభాగ్యుల కోసం ఖర్చు చేసింది.
వెన్నుపోటు, ఫొటో షూట్, డ్రామాలే బాబు నైజం..
ఇంత మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వాన్ని ఏనాడూ మంచి చేసిన చరిత్ర లేని పార్టీలు, నాయకులు ఓర్వలేక విమర్శిస్తున్న రాజకీయాలను ఇవాళ చూస్తున్నాం. రాజకీయ వ్యవçస్థ్ధ ఎంత దిగజారిపోయిందో వివరించేందుకు చిన్న ఉదాహరణ చెబుతా.. కోర్టులో ఒకాయన జడ్జి ముందుకు వచ్చి.. ‘అయ్యా తల్లీతండ్రి లేనివాడిని! నన్ను శిక్షించకండి..’ అని ఏడ్చాడు.. ఆ ఏడుపు చూసి జడ్జి జాలిపడి చలించి ‘ఈ మనిషి చేసిన తప్పేమిటి?’ అని ప్రాసిక్యూటర్‌ను అడిగారు. ‘నిజమే.. ఈ మనిషికి తల్లీతండ్రి ఇద్దరూ లేరు.. కారణం ఆ తల్లితండ్రీ ఇద్దరినీ చంపేసింది ఈ వ్యక్తే..’ అని ప్రాసిక్యూటర్ చెప్పారు.
చంద్రబాబుది కూడా ఇదే పద్ధతి. ఈ పెద్ద మనిషి.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడుస్తాడు. తానే చంపేస్తాడు. సీఎం కుర్చీని కూడా లాక్కుంటాడు. ఎన్టీఆర్ పార్టీని, ట్రస్టుని, ఎన్టీఆర్ శవాన్ని కూడా లాక్కుంటాడు. ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఎన్టీఆర్ ఫోటోకు దండ వేస్తాడు. తమ్ముళ్లూ...! ఎన్టీఆర్ అంత గొప్ప వ్యక్తి ఎవరైనా ఉంటారా? అని ఊరూరా అడుగుతాడు. పొడిచేది, చంపేది ఆయనే. మళ్లీ మొసలి కన్నీరు కార్చేది కూడా ఆయనే. ఎన్టీఆర్ అయినా, ప్రజలైనా ఈ పెద్ద మనిషికి తెలిసిన నైజం.. వెన్నుపోటు పొడవడం. ఫోటో షూట్, డ్రామాలు చేయడం, మొసలి కన్నీరు కార్చడం.
Comments
Please login to add a commentAdd a comment