సాక్షి, అమరావతి: వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది కూడా రంగం సిద్ధంచేసింది. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో మంగళవారం జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఈ సాయాన్ని జమచేయనున్నారు. మొత్తం 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా కింద రూ.123.52 కోట్లతో పాటు ఓఎన్‌జీసీ పైపులైన్ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు కూడా రూ.108 కోట్ల ఆర్థిక సాయాన్ని జమచేయనున్నారు.
గతంతో పోలిస్తే ఆరు రెట్లు అధికం..
సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో ఒకొక్కరికి రూ.10వేల చొప్పున వేట నిషేధ భృతి అందిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం తొలి రెండేళ్లలో రూ.2 వేలు చొప్పున ఇవ్వగా, ఆ తర్వాత రూ.4వేల చొప్పున ఇచ్చారు. అదీ కూడా మర, యాంత్రిక పడవలకే పరిమితం చేశారు. ఇలా సగటున 50వేల మందికి రూ.21 కోట్లు మాత్రమే ఇచ్చారు. కానీ, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ భృతి రూ.10వేలకు పెంచడమే కాక.. మర, యాంత్రిక పడవలతో పాటు సంప్రదాయ పడవలపై వేట జరిపే మత్స్యకార కుటుంబాలకు కూడా చెల్లిస్తోంది.
ఏటా సగటున రూ.110 కోట్లు చొప్పున చెల్లించింది. గతంతో పోలిస్తే ఇది దాదాపు ఆరు రెట్లు అధికం. ఇక చెప్పిన మాట ప్రకారం సరైన సమయానికి, వేట నిషేధ కాలంలోనే భృతి చెల్లిస్తూ వారికి అండగా నిలుస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఒక్కొ కుటుంబానికి సగటున రూ.50వేల చొప్పున ఈ నాలుగేళ్లలో రూ.538 కోట్ల భృతిని అందించారు.
డీజిల్ సబ్సిడీ గతం కంటే మిన్నగా..
టీడీపీ హయాంలో 1,100 బోట్లకు లీటర్ డీజిల్‌కు రూ.6 చొప్పున ఏటా సగటున రూ.12 కోట్లు ఆయిల్ సబ్సిడీ ఇచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక ఆ సబ్సిడీని రూ.9కి పెంచడమే కాక మత్స్యకారులకు స్మార్ట్ కార్డులు ఇచ్చారు. వీటి ద్వారా సబ్సిడీ మొత్తాన్ని మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని డీజిల్‌కు చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఇలా ఏటా సగటున 20 వేల బోట్లకు రూ.25 కోట్లు చెల్లిస్తోంది.
విదేశీ జైళ్లలో మగ్గిన 23 మంది విడుదల
వేట చేస్తూ మరణించిన మత్స్యకార కుటుంబాలకు గత ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం ఇస్తే ఈ ప్రభుత్వం దాన్ని రూ.10లక్షలకు పెంచింది. అంతేకాదు.. 2018లో పాకిస్తాన్ భద్రతా దళాలకు పట్టుబడగా, 13 నెలల పాటు కరాచీ జైలులో మగ్గిన 23 మత్స్యకారుల విడుదల కోసం కనీస ప్రయత్నం చేయకుండా టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కానీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చీరాగానే విదేశాంగ మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపింది.
వారిని పాకిస్థాన్ చెర నుండి విడిపించిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదే. మరోవైపు.. మత్స్యకారుల వలసల నివారణ, వారికి మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.3,767.48 కోట్లతో కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, రూ.16వేల కోట్లతో నాలుగు పోర్టులను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన నిర్మిస్తోంది. తద్వారా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తోంది.
నేడు సీఎం జగన్ నిజాంపట్నం రాక
సాక్షి ప్రతినిధి, బాపట్ల : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం బాపట్ల జిల్లా పర్యటనకు రానున్నారు. రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నంలో జరిగే కార్యక్రమానికి ఆయన హాజరై బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే మత్స్యకార భరోసా మొత్తాన్ని ఉ.11.35 గంటలకు బటన్‌నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తారు. లబ్ధిదారులతోనూ మాట్లాడతారు. ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా నేతృత్వంలో అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉ.9.00 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి తిరిగి మ.1.00కు ఇంటికి చేరుకుంటారు.
జీవనోపాధి కోల్పోయిన వారికి అండగా..
ఇక ఓఎన్‌జీసీ సంస్థ పైప్‌లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.108 కోట్లు కూడా సీఎం జగన్ జమచేస్తున్నారు. ఇప్పటివరకు వీరికి రూ.393.76 కోట్ల పరిహారం ఇచ్చారు. ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,43,649 మత్స్యకారులకు రూ.3,835.89 కోట్లు జమచేశారు. మరోవైపు.. ఫిష్ ఆంధ్ర బ్రాండ్ ద్వారా దేశీయ వినియోగం పెంచడంతోపాటు ఆక్వా రైతులకు, మత్స్యకారులకు మెరుగైన రేట్లు అందించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 26 ఆక్వా హబ్‌లు.. వాటికి అనుసంధానంగా 4,000 రిటైల్ దుకాణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందులో 2,184 రిటైల్ దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాక.. మత్స్య, ఆక్వా రైతులకు సేవలు అందించేందుకు వీలుగా అభివృద్ధి చేసిన వెబ్ అప్లికేషన్ ఈ–మత్స్యకార్‌తోపాటు టోల్ ఫ్రీ నెంబర్ 155251ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment