సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో నేతన్నకు తోడుగా నిలిచి, అన్ని విధాలా చేయి పట్టుకుని నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నేతకు, ఆప్కోకు జీవం పోయడమే కాకుండా చేనేత వ్రస్తాలకు మార్కెటింగ్‌పై కూడా దృష్టి పెట్టామని చెప్పారు. ఇంతకు ముందు లేని విధంగా అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల మీద నేతన్నల వ్రస్తాలను అమ్మే ఏర్పాటు చేశామని, తద్వారా వారి జీవితాల్లో వెలుగు నింపామని తెలిపారు. శుక్రవారం ఆయన తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైఎస్సార్ నేతన్న నేస్తం ఐదో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కంప్యూటర్‌లో బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేతన్నల ఖాతాల్లో రూ.193.64 కోట్లు నేరుగా జమ చేశారు. అర్హులై ఉండి సొంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఈ ఏడాది కూడా రూ.24,000 ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నేతన్నల మగ్గాలు ప్రపంచంతో మాట్లాడే నేల వెంకటగిరి అని చెప్పారు. అలాంటి ఈ గడ్డపై నుంచి ఐదో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం కార్యక్రమం జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఆరి్థకంగా, రాజకీయంగా, విద్యా పరంగా, మహిళా సాధికారత పరంగా అన్ని విధాలా మేలు చేయడంలో.. అంబేడ్కర్, పూలే భావజాలాన్ని అమలు చేయడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా మనం ముందున్నామని స్పష్టం చేశారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
బీసీలు బ్యాక్ బోన్ క్లాసులు
బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసులు కాదు.. బ్యాక్ బోన్ క్లాసులుగా మారుస్తానని ఎన్నికల వేళ చెప్పాను. ఆ రోజు చెప్పిన మాటకు కట్టుబడి ఈ నాలుగేళ్లలో ప్రతి పనిలోనూ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కనిపించే విధంగా అడుగులు వేశాను. ఈ కోవలోనే నవరత్నాలు తీసుకు వచ్చాను. నేతన్న నేస్తం తీసుకొచ్చాను. సొంత మగ్గం కలిగి ఉన్న ప్రతి నేతన్నకు ఏటా రూ.24 వేల చొప్పున వరుసగా ఇస్తూ పోతున్నా. ఇలా ఐదు విడతలుగా రూ.1.20 లక్షలు ప్రతి నేతన్న చేతిలో పెట్టాం.
80,686 మంది చేనేత అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల కుటుంబాలకి మేలు జరిగేలా ఇవాళ రూ.194 కోట్లు జమ చేస్తున్నాం. ఈ ఒక్క పథకం ద్వారా మాత్రమే ఐదు దఫాలుగా రూ.970 కోట్లు జమ చేసి నేతన్నలకు తోడుగా నిలబడ్డాం.
చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న 77 నేతన్నల కుటుంబాలకు కనీసం సహాయం కూడా చేయలేదు. మీ బిడ్డ సీఎం అయ్యాక ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున ఇచ్చాం. ఇకపై అలా జరగకుండా నవరత్నాలు తీసుకొచ్చాం.
హామీలు గాలికొదిలేసిన గత ప్రభుత్వం
నేతన్నలకు ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు గెలిచాక గాలికి వదిలేశారు. వారికి రూ.1.50 లక్షలతో ఉచితంగా ఇళ్లు కట్టిస్తామన్నారు. మగ్గం షెడ్డు కట్టిస్తామన్నారు. బడ్జెట్‌లో రూ.1000 కోట్లు ఏటా కేటాయిస్తామన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష బ్యాంకు రుణాలిస్తామన్నారు. చేనేత కారి్మకులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఇలా ఎన్నో హామీలిచ్చి చివరకు చేనేతలను మోసం చేశారు. ఏటా రూ.1000 కోట్లు ఖర్చు చేస్తామన్న వారు ఐదేళ్లకు కలిపి రూ.450 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. దీంతో నేతన్నల కుటుంబాలు అతలాకుతలం అయ్యాయి.
మన ప్రభుత్వంలో ఆ పరిస్థితి మార్చేశాం
మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికలప్పుడు చెప్పిన మాట నెరవేరుస్తూ 2019 డిసెంబర్ 21న నా పుట్టిన రోజునాడు వైఎస్సార్ నేతన్న నేస్తం తీసుకొచ్చాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరుసగా ఐదో దఫా సహాయం చేశాం.
సామాజిక పింఛన్ల రూపంలో రూ.1,396 కోట్లు, నవరత్నాల్లో ఇతర పథకాల ద్వారా మరో రూ.871 కోట్లు వారి చేతిలో పెట్టాం. బకాయిలతో కలిపి ఆప్కోకు రూ.468 కోట్లు, నేతన్న నేస్తం ద్వారా రూ.970 కోట్లు.. మొత్తంగా రూ.3,706 కోట్లు నేతన్నల సంక్షేమం కోసం ఖర్చు చేయగలిగాం. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్లకి కలిపి రూ.450 కోట్లు ఎక్కడ? మీ బిడ్డ ప్రభుత్వంలో 50 నెలల్లో రూ.3,706 కోట్లు ఎక్కడ? ఒక్కసారి మీరే ఆలోచించండి.
వెంకటగిరికి వరాలు
వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే రామ్‌కుమార్‌రెడ్డి నిధులు అడిగారు. ఆల్తూరుపాడు ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి అడుగులు ముందుకు వేయకుండా అడ్డుకున్న పరిస్థితి చూశాం. రివైజ్డ్ ప్రాజెక్టు కాస్ట్ ఎస్టిమేషన్ తయారుచేయిస్తే రూ.553 కోట్లు అవుతుందన్నారు. ఇందుకు అనుమతులు మంజూరు చేస్తాను. 6 మండలాల్లో డ్రెయిన్లు, సీసీరోడ్ల కోసం రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నా. మున్సిపాలిటీలో డ్రెయిన్లు, సీసీరోడ్లకు సంబంధించి ప్రతి గడపకూ తిరగమని రామ్‌కు చెబుతున్నాను. ఒక్కోసచివాలయానికి రూ.50 లక్షలు కేటాయిస్తాం. వెంకటగిరికి ఇరిగేషన్ ట్యాంకుకు సంబంధించిన నిధులూ మంజూరు చేస్తాను. బీసీ కమ్యూనిటీ హాల్, ఎస్సీ గురుకుల స్కూల్ మంజూరు చేస్తున్నా. పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తున్నా.
జాతర ఇవాళే వచ్చినట్లయ్యింది
గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నేత పనులు గిట్టుబాటు కాక చేనేత కార్మికులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు మీరొచ్చాక (సీఎం జగన్) వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఆ పరిస్థితులు మారిపోయాయి. నవరత్నాల పథకాల ద్వారా ఎంతగానో లబ్ధి పొందుతున్నాం. నా భర్తకు కిడ్నీలో రాళ్లు వస్తే రూపాయి ఖర్చు కాకుండా ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్ చేయించాం. పిల్లలకు స్కూల్లో రుచికరమైన భోజనం పెడుతున్నారు. మీ (సీఎం) పుణ్య మా అని టిడ్కో ఇల్లు కూడా వచ్చింది. సీఎం జగనన్న మేలు ఎప్పటికీ మరచిపోం. రెండు నెలల తర్వాత వచ్చే వెంకటగిరి జాతర.. ఇవాళే వచ్చినంత ఆనందంగా ఉంది. – సోమా విజయలక్ష్మి, చేనేత కార్మికురాలు, వెంకటగిరి
Comments
Please login to add a commentAdd a comment