నాడు: టీడీపీ హయాంలో హక్కులు పరిరక్షించాలని వేడుకున్న నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానంటూ తాత్కాలిక సచివాలయం సాక్షిగా చంద్రబాబు బెదిరించారు. హామీలను అమలు చేయాలని విన్నవించుకున్న పాపానికి తాట తీస్తానంటూ మత్స్యకారులపై హూంకరించారు. న్యాయమూర్తులుగా బీసీలు పనికి రారంటూ చంద్రబాబు అవహేళన చేశారు.
నేడు: వెనుకబడిన వర్గాలను సమాజానికి వెన్నుముకగా తీర్చిదిద్దడమే లక్ష్యమని 2019 ఫిబ్రవరి 17న ఏలూరు బీసీ గర్జనలో చెప్పిన దానికి మిన్నగా సీఎం జగన్ మంచి చేస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాలతో డీబీటీ రూపంలో రూ.2.45 లక్షల కోట్లు అందించగా అందులో బీసీల ఖాతాల్లోనే రూ.1,15,155.02 కోట్లు జమ చేశారు. బీసీ బిడ్డలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకూ సింహభాగం పదవులను బీసీలకే ఇచ్చి రాజ్యాధికారంలో వాటా కల్పించారు.
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా చేయూతనివ్వడం, రాజ్యాధికారంలో సింహభాగం వాటా, ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం ద్వారా బీసీలను ముఖ్యమంత్రి జగన్ సమాజానికి వెన్నుముకలా తీర్చిదిద్దారని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. దేశంలో సామాజిక న్యాయం నినాదంతో వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన బీసీ ముఖ్యమంత్రులకు సైతం సాధ్యం కాని రీతిలో సీఎం జగన్ రాజ్యాధికారంలో సింహభాగం వాటా బలహీన వర్గాలకు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.
వివిధ సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో గత 56 నెలల్లో రూ.2.45 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేయగా ఇందులో బీసీల ఖాతాల్లోనే రూ.1,15,155.02 కోట్లను నేరుగా జమ చేశారని ప్రస్తావిస్తున్నారు. డీబీటీ, నాన్ డీబీటీతో కలిపి పేదలకు రూ.4.12 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూరగా అందులో బీసీ వర్గాలే రూ.1,65,476.89 కోట్ల మేర లబ్ధి పొందాయి. విద్యా సాధికారతతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ఇవన్నీ బీసీలను సమాజానికి వెన్నుముకలా మార్చేందుకు బాటలు వేశాయని విశ్లేషిస్తున్నారు.
పరిపాలనలో సింహభాగం..
2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలలో వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయాన్ని సాధించింది. 2019 మే 30న వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 జూన్ 8న ఏర్పాటు చేసిన మంత్రివర్గాన్ని గతేడాది ఏప్రిల్ 11న పునర్ వ్యవస్థీకరించారు. 25 మంది సభ్యులున్న మంత్రివర్గంలో ఏకంగా 11 మంది బీసీలకు స్థానం కల్పించారు. ఆ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడును డిప్యూటీ సీఎంగా నియమించారు. విద్య, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యారోగ్యం లాంటి కీలక శాఖలను ఆ వర్గాలకే అప్పగించారు.
2014–19 మధ్య చంద్రబాబు తన మంత్రివర్గంలో కేవలం 8 పదవులు మాత్రమే బీసీలకు ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎనిమిది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే నలుగురు బీసీలను సీఎం వైఎస్ జగన్ రాజ్యసభకు పంపారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌కు అవకాశం కల్పించారు. శాసనమండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 29 పదవులు (69 శాతం) దక్కేలా సీఎం జగన్ చర్యలు తీసుకోగా 2014–19 మధ్య చంద్రబాబు ఆ వర్గాలకు కేవలం 18 పదవులు (37 శాతం) మాత్రమే ఇచ్చారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు పెద్దపీట
టస్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడంపై హైకోర్టును ఆశ్రయించేలా చంద్రబాబు టీడీపీ నేతలను పురిగొల్పారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీసీల రిజర్వేషన్ 24 శాతానికి తగ్గిపోయింది. అయితే రిజర్వేషన్లు తగ్గినా అంతకంటే ఎక్కువ మంది బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్ దాన్ని ఆచరించి చూపారు.
♦ జిల్లా పరిషత్ ఎన్నికల్లో 13 జడ్పీలను వైఎస్సార్‌సీపీ దక్కించుకోగా అందులో బీసీలకు 6 జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవులు (46 శాతం) కేటాయించారు.
♦మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకుగాను వైఎస్సార్‌సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకోగా 67 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వర్గాలకే ఇచ్చారు. ఇందులో కూడా గరిష్టంగా బీసీలకే పదవులు దక్కాయి.
♦14 కార్పొరేషన్లలో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేయగా తొమ్మిది చోట్ల మేయర్ పదవులు (64 శాతం) బీసీలకు ఇచ్చారు.
♦ 87 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలను వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకోగా చైర్‌పర్సన్ పదవుల్లో బీసీలకు 44(53 శాతం) ఇచ్చారు.
చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవులు
♦ దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్ చేస్తూ సీఎం జగన్ ఏకంగా చట్టం తెచ్చారు.
♦ రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు.
♦ వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 బీసీలకు ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి ఆ వర్గాల వారికే అవకాశం కల్పించారు.
♦ 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకు (42 శాతం) ఇచ్చారు.
వైఎస్సార్‌సీపీ వెంటే బీసీలు..
చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజ్యసభలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టడం, అనంతరం అధికారంలోకి వచ్చాక బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తుండటంతో ఆ వర్గాలు వైఎస్సార్‌సీపీ వెంటే నడుస్తున్నాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్.. తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయాలు సాధించడం దీనికి రుజువుగా నిలిచింది.
బీసీల జనాభా అధికంగా ఉన్న కుప్పం కోట కూలిపోయి చంద్రబాబు రాజకీయ పునాదులు పెకలించడానికి ఇదే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీసీల అభ్యున్నతి కోసం శాశ్వత కమిషన్, కులగణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో సీఎం జగన్ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదింపజేశారు. కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో రాష్ట్రంలో కులగణన చేపట్టడానికి సిద్ధమవడం బీసీ వర్గాల అభ్యున్నతి పట్ల చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచిందని స్పష్టం చేస్తున్నారు.
కుప్పం కోట బీసీలదే..!
ఎన్టీఆర్‌కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని దక్కించుకోవటానికి ముందే.. 1989లోనే బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున చంద్రగిరి నుంచి పోటీ చేసిన చంద్రబాబు టీడీపీ అభ్యర్థి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీ పంచన చేరారు. టీడీపీ ఆవిర్భావం నుంచి అంటే 1983, 1985 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున బీసీ నేతలే పోటీ చేసి గెలుపొందారు. అక్కడ బీసీల జనాభా అధికం.
తన సొంతూరు ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయంగా పప్పులు ఉడకవని గ్రహించిన చంద్రబాబు 1989లో కుప్పం నియోజక వర్గానికి వలస వెళ్లి రాజకీయంగా బీసీలకు ద్రోహం చేశారు. అప్పటి నుంచి కుప్పంలోనే పోటీ చేస్తూ వస్తున్నారు. తండ్రి బాటలోనే లోకేశ్ నడుస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో బీసీలు అధికం. 2019 ఎన్నికల్లో బీసీ నేతకు వెన్నుపోటు పొడిచి ఆ స్థానంలో పోటీ చేసిన నారా లోకేశ్ ఘోరంగా ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment