AP CM Jagan Reddy Good Governance With Welfare Development Schemes - Sakshi
Sakshi News home page

CM YS Jagan Birthday Special: ప్రజా యోధుడు..

Published Wed, Dec 21 2022 5:35 AM | Last Updated on Thu, Dec 22 2022 12:51 PM

CM Jagan good governance with welfare development schemes - Sakshi

సాక్షి, అమరావతి: సంక్షేమ స్ఫూర్తిదాత.. హరితాంధ్ర రూపశిల్పి.. జలయజ్ఞంతో అపర భగీరధుడిగా తెలుగు ప్రజల హదయాల్లో సుస్థిరంగా నిలిచిపోయిన దివంగత వైఎస్సార్‌ ఆశయాలను కొనసాగించాలనే దృఢ సంకల్పంతో ముందడుగు వేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదేళ్ల పాటు తీవ్ర ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి వైఎస్సార్‌ సీపీని తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దారు. ఎందరో ముఖ్యమంత్రులున్నా వారి కుమారులెవరూ రాజకీయంగా బలమైన ముద్ర వేయలేకపోయారు.

దేశంలోనే కాదు.. ప్రపంచ చరిత్రలోనే మరణించిన ప్రముఖుల వారసులెవరూ తీవ్రమైన అణచివేత, వ్యక్తిత్వ హననాన్ని ఎదుర్కొంటూ లక్ష్యాన్ని సాధించిన దాఖలాలు లేవు. సీఎం జగన్‌ ప్రజల్లోనే ఉంటూ స్థిర సంకల్పంతో తన లక్ష్యాన్ని సాధించారు. 2019 ఎన్నికల్లో అఖండ విజయం సాధించి దివంగత వైఎస్సార్‌కు మించి మరో రెండడుగులు ముందుకు వేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. పరిపాలనలో తండ్రిని మించిన తనయుడుగా రాజకీయ విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటున్నారు. 

నిర్బంధాలను లెక్క చేయకుండా.. 
ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థుల తరఫున ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్‌ జగన్‌ను విచారణ కోసమని పిలిచిన సీబీఐ అక్రమంగా అరెస్టు చేసింది. తమ కోసం ఢిల్లీతో తలపడిన వైఎస్‌ జగన్‌ను  అన్యాయంగా అరెస్టు చేసినా ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను 17 శాసనసభ, ఒక లోక్‌సభ స్థానంలో రికార్డు మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్, టీడీపీ కుట్రలను జనం చిత్తు చేశారు. వైఎస్‌ జగన్‌ను సీబీఐ అక్రమంగా నిర్బంధించటాన్ని నిరసిస్తూ ‘జగన్‌ కోసం జనం’ ద్వారా కోటి సంతకాలను సేకరించారు. 

ఇచ్చిన మాట కోసం ఎందాకైనా.. 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 2న హెలికాఫ్టర్‌ ప్రమాదంలో హఠాన్మరణం చెందటాన్ని తట్టుకోలేక వందల మంది గుండె పగిలి అసువులు బాశారు. ఆ కుటుంబాలను వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఓదార్చుతానని వైఎస్‌ జగన్‌ మాట ఇచ్చారు. అందుకు కట్టుబడి ఓదార్పు యాత్ర తలపెట్టిన ఆయన్ను నాడు కాంగ్రెస్‌ అధిష్టానం తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.

వైఎస్‌ జగన్‌ను అణగదొక్కేందుకు టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్‌ అధిష్టానం చేతులు కలిపి తప్పుడు కేసులు బనాయించింది. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు నైతిక విలువలకు కట్టుబడి కాంగ్రెస్‌కు, ఆ పార్టీ నుంచి సంక్రమించిన కడప ఎంపీ పదవికి, పులివెందుల ఎమ్మెల్యే పదవికి వైఎస్‌ జగన్, వైఎస్‌ విజయమ్మ రాజీనామా చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌ ఉద్యమబాట పట్టారు.

ప్రతిపక్షంలోనూ ప్రజల పక్షమే.. 
రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేయగా వైఎస్సార్‌సీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఓట్ల కోసం టీడీపీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వగా.. సాధ్యమయ్యే హామీలను మాత్రమే జగన్‌  ఇచ్చారు. ఆ ఎన్నికల్లో 67 శాసనసభ, 8 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. కేవలం 5లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది. రైతులు, డ్వాక్రా మహి ళలను రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసగించటాన్ని నిరసిస్తూ ప్రజల పక్షాన ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ ఉద్యమించారు.

ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమబాట పట్టారు. నైతిక విలువకు తిలోదకాలిచ్చి 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు ఫిరాయింపులకు ప్రోత్సహించటాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సమావేశాలను వైఎస్‌ జగన్‌ బహిష్కరించారు. నేనున్నానంటూ ఆయన చేపట్టిన 3,648 కి.మీ. ప్రజాసంకల్ప పాదయాత్ర 134 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 2,516 గ్రామాలను తాకుతూ 341 రోజులపాటు కొనసాగింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారి తీసింది. 

ప్రజాభ్యుదయమే ఆశగా.. శ్వాసగా
ప్రజాభ్యుదయమే పరమావధిగా వైఎస్సార్‌ ఆశయ సాధనే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీని వైఎస్‌ జగన్‌ స్థాపించారు. కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్‌ జగన్, పులివెందుల శాసనసభ స్థానం వైఎస్‌ విజయమ్మ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. తమ కో­సం నిలబడిన వారిద్దరినీ ప్రజలు రికార్డు మెజార్టీతో జనం గెలిపించారు.

వైఎస్సార్‌సీపీలో చేరేందుకు కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. అయితే కాంగ్రెస్‌ నుంచి సంక్రమించిన పదవులకు రాజీనా­మా చేశాకే పార్టీలోకి రావాలని షరతు విధించి రాజకీయాల్లో మాయమవుతున్న నైతిక విలువలను పరిరక్షించేందుకు వైఎస్‌ జగన్‌ నడుం బిగించారు. నాడు 19 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కాంగ్రెస్‌ పార్టీకి, పదవులకు రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. 

ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ పోరాటం.. 
దాదాపు 16 నెలల అక్రమ నిర్భందం నుంచి బయటకొచ్చిన వైఎస్‌ జగన్‌ ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను గౌరవిస్తూ రాష్ట్ర విభజనలో కేంద్రం తీరును నిరసిస్తూ ఉద్యమబాట పట్టారు. ఆమరణ దీక్ష చేశారు. లోక్‌సభలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.  

చారిత్రక విజయంతో.. 
2019 సాధారణ ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకుని వైఎస్సార్‌ సీపీ అఖండ విజయం సాధించింది. దేశ చరిత్రలో సాధారణ ఎన్నికల్లో ఈ స్థాయిలో విజయం సాధించిన రాజకీయ పార్టీ మరొకటి లేదు. 2019 మే 30న అధికారం చేపట్టిన తొలి రోజే సంక్షేమాభివృద్ధి పథకాలకు సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. మూడున్నరేళ్లుగా సుపరిపాలనతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు.  

హామీల్లో ఇప్పటికే 98% అమలు చేసి ఎన్నికల మేనిఫెస్టోకు అసలైన నిర్వచనం చెప్పి రాజకీయాల్లో నవశకానికి తెరతీశారు. వరుసగా పంచాయతీ, మున్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్‌ ఎన్నికలతోపాటు తిరుపతి లోక్‌సభ, బ­ద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తిరుగులేని విజయం సాధించడం సీఎం జగన్‌కు ప్రజల్లో ఉన్న మద్దతుకు నిదర్శనం.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement