CM Jagan High-Level Review Meeting On Grain Purchase With Agriculture Department - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: దళారులకు తావేలేదు

Published Thu, Jan 19 2023 1:58 AM | Last Updated on Thu, Jan 19 2023 9:36 AM

CM Jagan high-level review on Grain purchase with Agriculture department - Sakshi

గత ప్రభుత్వంతో పోలిస్తే ధాన్యం సేకరణలో మనం రైతులకు ఎంతో మేలు చేస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా మనమే చెల్లించాం. గతంలో ఏటా ధాన్యం సేకరణకు సుమారు రూ.8 వేల కోట్లు వెచ్చిస్తే, మన ప్రభుత్వంలో ఏకంగా రూ.15 వేల కోట్లు ఇస్తున్నాం. 2016–17లో 55 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే, 2020–21లో మనం దాదాపు 85 లక్షల టన్నులు సేకరించాం. చంద్రబాబు ఐదేళ్ల హయాంలో 2.65 కోట్ల టన్నుల ధాన్యం సేకరిస్తే, ఈ మూడు­న్నరేళ్లలోనే మనం 2.87 కోట్ల టన్నులు కొనుగోలు చేయడం సంతోషంగా ఉంది. 

ప్రతి గ్రామంలో సాయిల్‌ టెస్టింగ్‌ అయ్యాక కచ్చితంగా మ్యాపింగ్‌ చేయాలి. తద్వారా ఎరువులు, రసాయనాల వినియోగం అవసరాల మేరకే జరుగుతుంది. దీంతో రైతులకు పెట్టుబడి ఆదాతో పాటు కాలుష్యం కూడా తగ్గుతుంది. రబీలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు ఆర్బీకేల్లో అందుబాటులో ఉండేలా ముందస్తుగా సమకూర్చుకోవాలి. ఫిబ్రవరి 20 నుంచి ఈ క్రాప్‌ నమోదు ప్రారంభిస్తే.. మార్చి మొదటి వారంలోగా తుది జాబితా వెల్లడించేలా పని చేయాలి.  
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఇదివరకెన్నడూ లేని విధంగా ఎటువంటి వివక్ష, అవినీతి, దళారుల బెడద లేకుండా రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, వారికి దక్కాల్సిన మద్దతు ధరను ప్రతిపైసాతో సహా అనుకున్న సమయానికే చెల్లిస్తు­న్నా­మని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇంతకు ముందు రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన సందర్భమే లేదన్నారు. ఇప్పుడు అలాంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామని చెప్పారు.

పది శాతం రంగు మారిన ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేయాలని, ఇంకా ఎక్కువ శాతం రంగు మారి ఉంటే మిల్లర్లతో మాట్లాడి కొనుగోలు చేసేలా చూడాలన్నారు. ఇప్పుడు హమాలి, రవాణా, గోనె సంచుల ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తూ రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించిందని తెలిపారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అనుబంధ రంగాలు, పౌర సరఫరాల శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ–క్రాప్‌ డేటా ఆధారంగా మాత్రమే ధాన్యం కొనుగోలు చేయా­లని.. మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే ఖరీఫ్‌లో మిగిలిన సేకరణనూ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పుడున్న ప్రక్రియను మరింత బలోపేతం చేయాలన్నారు. ఆర్బీకేల్లో ధాన్యం సేకరించగానే రైతుల పని ముగుస్తుందని, ఆ తర్వాత అంతా ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు.

ఏమైనా సమస్యలు, మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం ఉంటే ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక నంబర్‌ను ఏర్పాటు చేయాలని, రైతులు ఫిర్యాదు చేయగానే వెంటనే అధికారులు స్పందించాలని ఆదేశించారు. ఈ వివరాలు అన్నింటినీ రైతులకు ఇచ్చే రశీదులో ముద్రించాలని చెప్పారు. ఇలా అన్ని విధాలా రైతులకు మంచి చేయడంలోనే సంతోషం ఉంటుందన్నారు. 
ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఉత్తరాంధ్రలోనూ డ్రోన్‌ పైలెట్‌ శిక్షణ కేంద్రం 
రైతులకు 50 శాతం సబ్సిడీతో వ్యక్తిగత వ్యవసాయ యంత్ర పరికరాలను అందించడంపై దృష్టి సారించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఆర్బీకేల స్థాయిలో కిసాన్‌ డ్రోన్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాల (సీహెచ్‌సీ)ను లక్ష్యం మేరకు నిర్ణీత వ్యవధిలోగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీలో మాదిరిగానే ఉత్తరాంధ్రలోనూ డ్రోన్‌ పైలెట్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లను సైతం అందించాలని చెప్పారు. మాండస్‌ తుపానుతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు సిద్ధం కావాలన్నారు. రాష్ట్రంలో ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలుకు కార్యాచరణ రూపొందించాలని, ఏటా ఏప్రిల్‌లో మట్టి నమూనా పరీక్షలు నిర్వహించి రైతులకు టెస్టు రిపోర్టులు ఇవ్వాలని ఆదేశించారు.

ఆ ఫలితాల ఆధారంగా భూమిలో ఎటువంటి పంటలు వేయాలో రైతులకు మార్గనిర్దేశం చేయాలని, ఆ పంటకు అవసరమైన పోషకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేస్తున్న ల్యాబ్‌లలో మట్టి నమూనా పరీక్షలు వేగంగా చేసేలా చర్యలు చేపట్టాలని, భవిష్యత్తులో ప్రతి ఆర్బీకేలోనూ పరీక్షలు చేసేలా పరికరాలను సమకూర్చుకోవాలన్నారు. ఇందు కోసం సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. కేంద్రం పీఎం కిసాన్‌ పథకం కింద నిధులు విడుదల చేసే సమయంలోనే రాష్ట్రంలో మనం రైతు భరోసా, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

తొలి విడత 500 డ్రోన్లు..
రైతులకు ఈ ఏడాది మార్చి, మే, జూన్‌ నెలల్లో డ్రోన్లను అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. 2 వేల డ్రోన్ల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో భాగంగా తొలి విడతగా 500 డ్రోన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గత డిసెంబర్‌ నుంచే డ్రోన్ల వినియోగంపై శిక్షణ ప్రారంభించామని, ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమాల్లో మరింత వేగం పెంచాలని సీఎం ఆదేశించారు.

పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తి
ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. 2014–19 మధ్య ఆహార ధాన్యాల సగటు ఉత్పత్తి 153.95 లక్షల టన్నులు ఉంటే.. 2019–20 నుంచి 2022–23 ఖరీఫ్‌ వరకు 166.09 లక్షల టన్నులు నమోదైందన్నారు. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు వాటి వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని, రేషన్‌లో కోరుకున్న వారికి చిరు ధాన్యాలు అందించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ధాన్యం సేకరణ కొనసాగింపు
ఖరీఫ్‌ ధాన్యం సేకరణలో ఇప్పటి వరకు 89 శాతం మంది రైతులకు మద్దతు ధరను వారి ఖాతాల్లో జమ చేసినట్టు అధికారులు సీఎంకు చెప్పారు. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని 21 రోజుల కంటే ముందుగానే చాలా వరకు రైతులకు చెల్లింపులు చేశామన్నారు. ఇప్పటి వరకు రూ.5,373 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో పంటల సీజన్లను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి రెండో వారం వరకూ సేకరణ కొనసాగిస్తామన్నారు. స్థానిక వీఏఓ నుంచి డీఆర్‌ఓ నుంచి సర్టిఫై చేసిన తర్వాతే సేకరణ ముగిస్తామని తెలిపారు.తొలిసారిగా మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ధాన్యం సేకరణ జరిగిందని, రైతులకు సంపూర్ణ మద్దతు ధరను అందించగలిగామన్నారు.

ఈ సమీక్షలో వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ సలహాదారు ఐ.తిరుపాల్‌రెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.మధుసూదన్‌రెడ్డి, మార్కెటింగ్, సహకారం ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్, పౌర సరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌ ఎం.విజయ సునీత, వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సీహెచ్‌ హరికిరణ్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ జి.శేఖర్‌ బాబు, ఏపీ మార్క్‌ఫెడ్‌ ఎండీ రాహుల్‌ పాండే, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ వీసీ డాక్టర్‌ ఎ.విష్టువర్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement