AP: అభివృద్ధి ఎక్స్‌ప్రెస్‌ | Cm Jagan Inaugurates Nad Flyover At Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో పలు ప్రాజెక్టులను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

Published Sat, Dec 18 2021 3:37 AM | Last Updated on Sat, Dec 18 2021 7:48 AM

Cm Jagan Inaugurates Nad Flyover At Visakhapatnam - Sakshi

స్మార్ట్‌ పార్కుగా తీర్చిదిద్దిన వుడా పార్కు విశేషాలను తెలుసుకుంటున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పరిపాలన రాజధానిగా నూతన సొగసులు సంతరించుకుంటున్న విశాఖలో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. నగర చరిత్రలో తొలిసారిగా రూ.247.32 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులను శుక్రవారం తన పర్యటన సందర్భంగా ప్రజలకు అంకితం చేశారు. విశాఖ వాసుల ట్రాఫిక్‌ కష్టాలకు తెరదించుతూ రూ.150 కోట్లతో తొలిసారి రోటరీ మోడల్‌లో అభివృద్ధి చేసిన ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌తో పాటు దేశంలోనే తొలి మెకనైజ్డ్‌ ఆటోమేటిక్‌ పార్కింగ్‌ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. సాగర నగరిలో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 33 ఎకరాల్లో రూ.33.50 కోట్లతో స్మార్ట్‌ పార్కుగా తీర్చిదిద్దిన వుడా పార్కు సీఎం చేతులమీదుగా ప్రారంభమైంది. మూడు జోన్లుగా దీన్ని సుందరీకరించారు.

12 కీలక ప్రాజెక్టులు ప్రారంభం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాయంత్రం 4.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాస్‌తో పాటు ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డాక్టర్‌ బీవీ సత్యవతి, గొడ్డేటి మాధవి, మేయర్‌ హరివెంకట కుమారి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికారు. ఎన్‌ఏడీ కూడలి, వుడా పార్కు వద్ద జరిగిన కార్యక్రమంలో మొత్తం 12 కీలక ప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు. 

వివాహ రిసెప్షన్‌ వేడుకలకు హాజరు

 ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి వివాహ రిసెప్షన్‌లో  సీఎం జగన్‌
అనంతరం ముఖ్యమంత్రి జగన్‌ పీఎంపాలెంలోని వైజాగ్‌ కన్వెన్షన్స్‌కు చేరుకొని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు నిహారిక, రవితేజ వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరుల్ని ఆశీర్వదించారు. ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన విజయనగరం డీసీసీబీ చైర్మన్‌ నెక్కల నాయుడుబాబు కుమార్తె దివ్యనాయుడు, సుభాష్‌ వివాహ రిసెప్షన్‌కు కూడా హాజరై వధూవరుల్ని ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. రాత్రి 7.30 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి తిరిగి గన్నవరం బయలుదేరారు. 

 సీఎం జగన్‌ ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవీ... 


వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు, నేతలు, అధికారులు 
 

ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌
రూ.150 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ఫ్లైఓవర్‌ విశాఖ వాసుల ట్రాఫిక్‌ కష్టాలను తీర్చనుంది. దేశంలోనే తొలిసారిగా రోటరీ మోడల్‌లో ఫ్లైఓవర్‌ను అభివృద్ధి చేశారు. ఎటువంటి భూ సేకరణ లేకుండానే దీన్ని పూర్తి చేశారు. 2036 నాటికి గంటకు 23,500 వాహనాలు ఈ ఫ్లైఓవర్‌పై ప్రయాణం చేస్తాయని అంచనా. 


సీఎం కప్‌ ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

తొలి మెకనైజ్డ్‌ పార్కింగ్‌
విశాఖ జగదాంబ జంక్షన్‌లో మల్టీ లెవల్‌ సెమీ–ఆటోమెటిక్‌ కార్‌ పార్కింగ్‌ను సీఎం జగన్‌ ప్రారంభించారు. రూ.11.45 కోట్లతో దీన్ని తీర్చిదిద్దారు. 367.89 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో 100 కార్లను పార్క్‌ చేసే అవకాశం ఉంది. పార్క్‌ చేసిన వాహనాన్ని గరిష్టంగా 90 సెకన్లలో తిరిగి తీసుకొచ్చే వీలుంది. 
పిఠాపురం కాలనీలో రూ.7.60 కోట్లతో నిర్మించిన వాణిజ్య సముదాయం.
రూ.7.55 కోట్లతో ఆనందపురం జంక్షన్‌ నుంచి బొని గ్రామం వరకూ 9 కిలోమీటర్ల పొడవున నిర్మించిన 2 వరసల రహదారి.
మధురవాడ లా కాలేజీ నుంచి రుషికొండ బీచ్‌ వరకూ రూ.7.50 కోట్లతో నిర్మించిన రెండు వరుసల రహదారి.
ఎన్‌హెచ్‌–16 నుంచి విశాఖ వ్యాలీ స్కూలు మీదుగా బీచ్‌ రోడ్‌ వరకూ రూ.6.97 కోట్లతో చేపట్టిన రహదారి.
రూ. 5.14 కోట్లతో చినముషిడివాడలో నిర్మించిన కళ్యాణ మండపం.
తాటిచెట్లపాలెం ధర్మానగర్‌లో రూ.1.56 కోట్లతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌.
దాదాపు 33 ఎకరాల్లో రూ.33.50 కోట్లతో స్మార్ట్‌ పార్కుగా సుందరీకరించిన వుడా పార్కును సీఎం ప్రారంభించారు. పార్కును మూడు జోన్లుగా తీర్చిదిద్దారు. ప్రత్యేకంగా స్పోర్ట్స్‌ ఏరియాను అభివృద్ధి చేశారు. బీఎంఎక్స్‌ సైకిల్‌ ట్రాక్‌ కూడా ఏర్పాటు చేశారు. హెర్బల్‌ ప్లాంట్స్‌తో ల్యాండ్‌స్కేప్‌ను సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేశారు.
రూ.4.65 కోట్లతో దండుబజారులో స్మార్ట్‌ స్కూల్‌గా అభివృద్ధి చేసిన మహారాణి విద్యాదేవి హైస్కూల్‌.
శిథిలావస్థలో ఉన్న టౌన్‌ హాల్‌ రూ.4.24 కోట్లతో ఆధునీకరణ ప్రాజెక్టుతో పాటు రూ.7.16 కోట్లతో పాత మునిసిపల్‌ హాల్‌ ఆధునీకరణ ప్రాజెక్టును కూడా సీఎం ప్రారంభించారు. 
వుడా పార్కులో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 21న నిర్వహించనున్న సీఎం క్రికెట్‌ కప్‌ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement